ఆంధ్రప్రదేశ్‌

విశాఖ రైల్వేజోన్ వచ్చేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 15: విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ వచ్చేస్తోంది. వచ్చేనెల తొలివారంలోనే ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్‌లో జోన్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనేక అంశాలు బలాన్నిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా విశాఖకు ప్రత్యేక రైళ్ళు విపరీతంగా వస్తున్నాయి. వీటిలో కొన్ని కొనసాగుతున్నాయి కూడా. జోన్ రావడానికి ముందుగా ప్రత్యేక రైళ్ళు పట్టాలెక్కడం, ఇవి కొనసాగుతున్న పరిస్థితులు మరింత బలాన్నిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. అలాగే రైల్వేజోన్లను 17కి పెంచుతున్నట్టుగా ఇటీవల కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. ఇది కూడా విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటుకు మరో సంకేతంగా ఇక్కడి రైల్వేవర్గాలు చెబుతున్నాయి.
విశాఖ రైల్వేస్టేషన్ విస్తరణ, ఒడిశా పెత్తనాన్ని తగ్గించడం, మూడో రైల్వేలైన్ నిర్మాణం, వచ్చిన రైళ్ళన్నీ వచ్చినట్టుగానే వెళ్ళిపోయే సౌలభ్యం కల్పించేందుకు వీలుగా విశాఖ రైల్వేస్టేషన్ చివర భాగంలో ‘బల్బు లైన్’ అభివృద్ధిపై ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించడం వంటి పలు అంశాలు ఇక్కడ జోన్ ఏర్పాటవుతుందనడానికి మరింత బలాన్నిస్తున్నాయని, ఇక్కడి రైల్వేవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, పార్టీ ఇమేజ్‌ను మరింతగా పెంచుకునేందుకు కేంద్రం జోన్ ప్రకటనపై ఆచీతూచీ అడుగేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కాకుండా కాస్తంత సమయం తీసుకుని జోన్ ప్రకటన చేయాలని, దీని కంటే ముందుగా కొన్ని సంకేతాలు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఇప్పటికే జోన్ విశాఖలోనే ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు.
విశాఖలో జోన్ ప్రధాన కార్యాలయాన్ని ఒకటి, రెండు చోట్ల స్థలాన్ని పరిశీలించడంపై రైల్వే అధికారులు దృష్టిపెట్టారు. ఎపుడూ లేనివిధంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో వౌలిక వసతులను పూర్తిస్థాయిలో విస్తరణ జరుగుతోంది. సాధారణ ప్రయాణికుల నుంచి ప్రముఖుల కోసం అవసరమైన ఏసీ లాంజ్‌లు, హోటళ్ళు, ఎనిమిది ప్లాట్‌ఫారాలు, ఎస్కలేటర్లు, విశాఖ రైల్వేస్టేషన్, జ్ఞానాపురం స్టేషన్ల అభివృద్ధి, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, ప్రధాన రిజర్వేషన్ కాంప్లెక్స్, జనరల్ బుకింగ్ కౌంటర్ల విస్తరణ, శాటిలైట్ కౌంటర్ల అభివృద్ధి, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పెంపొందించడం, రైల్వేస్టేషన్‌లో దాదాపు 50 క్లోజుడ్ సర్క్యూట్ టివీలను ఏర్పాటు చేశారు. అలాగే పండుగ సీజన్లలో ప్రయాణికులకు అవసరమైనన్నీ ప్రత్యేకరైళ్ళను నడుపుతున్నారు. వాల్తేరుడివిజన్‌పై ఒడిశా పెత్తనం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. దీనివల్ల వాల్తేరు డివిజన్ కేంద్రంగా చేసుకుని గుంటూరు, విజయవాడ డివిజన్లను కలుపుకొంటూ మూడు డివిజన్లతో విశాఖ కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. అయితే జోన్ ఏర్పాటుపై లెక్కలు తేలాల్సి ఉంది. ఎన్నికల సమీపంలో దీనిని ప్రకటిస్తారా? లేదంటే కాస్తంత ముందుగానే ప్రకటించిన తరువాతనే ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తారా? అనేది స్పష్టంకావాల్సి ఉంది. కాగా జోన్ వస్తే ఇక్కడి నుంచి భువనేశ్వర్‌కు తరలిపోయిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మళ్ళీ తీసుకురావాల్సి ఉంది. ఇది వస్తేనే జోన్ పరిధిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తమీద ఈ ఏడాదిలోనే విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుకు అంకురార్పణ జరుగవచ్చని ఇటు రైల్వేవర్గాలు, మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజానీకం కొండంత ఆశలు పెట్టుకుంది.