ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పెట్రో వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న పెట్రోలియం యూనివర్శిటీలో భాగస్వామి కావాలని చమురు, సహజవాయు, రిఫైనరీ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ ఆరాంకో సంస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం సౌదీ ఆరాంకో సంస్థ ప్రెసిడెంట్, సీఈవో అమిన్ హెచ్ నాసర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. భారత్‌లో ఒక ఆయిల్ రిఫైనరీ నెలకొల్పే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమిన్ తెలుపగా చమురు, సహజవాయు రంగంలో ఏపిలో ఉన్న వనరులు, అవకాశాలను సిఎం వివరించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో హైడ్రోకార్బన్ నిక్షేపాలు, టెక్నాలజీ, మానవ వనరులపై ముఖ్యమంత్రి వివరించారు. ప్రతిపాదిత పెట్రోవర్శిటీపై సౌదీ అరాంకో ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఉందని, అవకాశాలను పరిశీలిస్తామన్నారు. సౌదీలో తమ సంస్థను పరిశీలించటానికి ఒక బృందాన్ని పంపాలని ఆరాంకో హెడ్స్ కోరగా త్వరలో పంపిస్తామని చంద్రబాబు బదులిచ్చారు. అలాగే 15రోజుల్లో తమ బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుందని నాసర్ తెలిపారు.
డిజిటల్ వర్సిటీ పెట్టండి.. సహకరిస్తాం
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో డిజిటల్ యూనివర్శిటీ స్థాపనకు ముందుకొస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని పే టిఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మకు చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. బుధవారం దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిజిటలైజేషన్, డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఇటీవల తాము తీసుకున్న చర్యలను ఆయనకు వివరించారు. పే టిఎం తీసుకొచ్చే కొత్త సాంకేతిక పద్ధతుల్ని తొలుత ఆంధ్రప్రదేశ్‌కే అందిస్తామని విజయశేఖర్ శర్మ చెప్పారు. పే టిఎం బ్యాంకుగా ఆవిర్భవించనుందని, 2020 నాటికి 500 మిలియన్ ఖాతాలను సమకూర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి గ్రామంలో డిజిటల్ పే టిఎం బ్యాంకు ఉండేలా చూడటం తమ కొత్త లక్ష్యాలని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే స్వయం ఉపాధి కింద చిన్నపాటి రుణాలను ఇస్తామని తెలిపారు.
సెక్వియా ప్రతినిధులతో భేటీ
వెంచర్ కాపిటల్ ఫండ్ సంస్థ సెక్వియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. భారత్‌లో తాము 11 సంవత్సరాల క్రితమే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని సెక్వియా ఎండీని చంద్రబాబు కోరారు. ఏపిలో తగిన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నోవేషన్, ఇంక్యుబేటర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. ఇదిలావుంటే ప్రస్తుతం సెక్వియా టెక్ కంపెనీలపై దృష్టి సారించింది.
ఫుజిసు ప్రతినిధులతో సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుజిసు సంస్థను కోరారు. సంస్థ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నొబుహుకో ససాకి సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేశారు. నేలలో తేమ శాతాన్ని కచ్చితంగా కొలిచే సెన్సర్లు, నీటి పరిమాణ వివరాలందించే పరికరాలను అందించగలరా అని సిఎం వారిని అడిగారు. కాలుష్యం, వాయువేగం, నేల స్వభావాన్ని గుర్తించగలిగిన పరికరాలను అందిస్తారా అని ఆరాతీశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో టెక్నాలజీని ప్రభుత్వం వినియోగించుకుంటున్న తీరును వివరించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను గుర్తించడానికి త్వరలో ఒక బృందం మరావతి వస్తుందని ఫుజిసు సీఈవో చంద్రబాబుకు తెలిపారు.
ఉప్పునీటిని మంచినీటిగా మార్చాలి
ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరంలో ఉప్పునీటిని మంచినీటిగా మార్చటం తక్షణావసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో ప్రసిద్ధి చెందిన లూమిన్ వరల్డ్ కంపెనీ సీఈవో జోనాథన్ షిమిట్ తనతో భేటీ అయినప్పుడు ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు. సౌరశక్తితో ఉప్పునీటిని మంచినీటిగా మార్చే సాంకేతికత తమ దగ్గర ఉందని జోనాథన్ షిమిట్ అన్నారు. బొగ్గు నుంచి సైతం కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదన అందించ గలిగిన సాంకేతికత తమ సొంతమని తెలిపారు. ఏపిలో అవకాశాలను పరిశీలించడానికి వచ్చేనెలలో తమ సంస్థ ప్రతినిధులు అక్కడికి వస్తారని ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. తమ సంస్థ వ్యర్థాల నిర్వహణ రంగంలో అడుగుపెట్టిందని కూడా వివరించారు.

చిత్రం... ఫిజిట్సు ప్రతినిధులతో మాట్లాడుతున్న చంద్రబాబు