ఆంధ్రప్రదేశ్‌

రాజధాని అమరావతి చుట్టూ రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 19: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలు, పెట్టుబడుల కంటే రాజకీయ వివాదాలు ముదురుపాకాన పడుతున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సిపి అమరావతి కేంద్రంగా ఫక్తు రాజకీయాలు నడపటం ఆసక్తికరంగా మారింది. జగన్ పర్యటన జరిగిన ప్రతిసారీ ఉద్రిక్తత చోటుచేసుకోవడం, ఆయన రాకముందే తెదేపా విమర్శల దాడి చేయటం, దానిపై వైకాపా ఎదురుదాడి చేయటంతో గ్రామాలు రాజకీయంగా చీలిపోయి, ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. అమరావతి కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు అభివృద్ధిని పక్కదారి పట్టించి రెండు పార్టీల ఆధిపత్య పోరుకు వేదికగా మారుతున్నాయి. తాజాగా వైకాపా అధినేత జగన్ అమరావతి ప్రాంతంలోని గ్రామాల పర్యటన మరోసారి వివాదాలకు కారణమయింది. ఆయన రాకను కొన్ని గ్రామాల్లోని రైతులు అడ్డుకోవడం, మా ఊరికి రావద్దని ఫ్లెక్సీని కట్టడం, పోలీసులు జగన్ కాన్వాయ్‌ను మాత్రమే అనుమతించడం, అటుగా వెళుతున్న తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైకాపా కార్యకర్తలు దాడి చేయపోగా, ఆమె గన్‌మెన్లు రంగంలోకి దిగి తుపాకులతో హెచ్చరించటం వంటి సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను ఆకట్టుకునేందుకు జగన్, ఆయన పార్టీ నేతలు తొలినుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ మేరకు అన్యాయం జరిగిన రైతులతో పాటు భూములివ్వని రైతులకు ఆ పార్టీ దన్నుగా నిలిచింది. రాజధానికి భూములిచ్చిన రైతులను బాబు, ఆయన మంత్రులు మోసం చేసి తమకు అనుకూలమైన కంపెనీలకు వాటిని ధారదత్తం చేస్తున్నారన్న ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో వైకాపా విజయం సాధించింది. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, వారి బినామీలు ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న విషయాన్ని జగన్ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేయడంతో, అది మిగిలిన వర్గాల పైనా ప్రభావం చూపింది. అది చాలదన్నట్లు వైకాపా తన పార్టీ సానుభూతిపరులు, అనుకూలంగా వ్యవహరించే సీనియర్ జర్నలిస్టులతో హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్‌ట్రైబ్యునల్‌లో కేసులు వేయించడం ద్వారా సర్కారుకు చికాకు, చిక్కులు తెప్పించింది. దీంతో ఎదురుదాడికి దిగిన తెదేపా.. జగన్ వచ్చిన ప్రతిసారీ భూముల రేట్లు పడిపోతున్నాయని, జగన్‌ను ప్రోత్సహిస్తే పెట్టుబడులు రావన్న మానసిక ప్రచారానికి తెరలేపింది. జగన్ వచ్చేముందే రైతుల్లో చైతన్యం తేవడం, పార్టీపరంగా గ్రామాల్లోని కార్యకర్తలను అప్రమత్తం చేయటం, జిల్లా నేతలతో మీడియా ద్వారా జగన్ తండ్రి వైఎస్ హయాంలో జరిగిన భూకుంభకోణాలను గుర్తుచేయడం ద్వారా.. జగన్ ఆరోపణల ప్రభావం ప్రజలపై పడకుండా తెదేపా నాయకత్వం జాగ్రత్త పడుతోంది. ప్రధానంగా వైఎస్ హయాంలో జరిగిన భూకుంభకోణాలు, ఆ పార్టీ నేతలకు వాటిని కట్టబెట్టిన వైనంపై తెదేపా ప్రతిసారి చర్చనీయాంశం చేస్తోంది. అయితే గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు పుల్లారావు, రావెల కిశోర్, సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నారాయణ రైతుల్లో అవగాహన పెంచి, ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు తగిన సమాధానం చెప్పడంలో విఫలమవుతుండటం కూడా, వైకాపా వాదనకు బలం చేకూరేందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. విపక్షాల నేతలు పర్యనలు జరిపి, విమర్శలు కురిపించిన ప్రతిసారి భూముల రేట్లు పడిపోవడం అటు రైతులకూ ఆందోళనగా మారింది. పెద్దనోట్ల రద్దు వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలినప్పటికీ అంతోఇంతో రాజధాని ప్రాంతంలోని భూములకు ఇంకా గిరాకీ ఉండటం రైతులకు ఊరటనిస్తోంది. అయితే వైకాపా నేతలు పర్యటనలకు మీడియాలో ప్రముఖ స్థానం లభిస్తుండటంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకురావడం లేదని వాపోతున్నారు. దానికితోడు తాము అధికారంలోకొస్తే ఎవరి భూములు వారికి ఇస్తామన్న జగన్ హామీ కూడా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే రైతులు ఇచ్చిన భూములన్నీ చదును చేయగా ఎవరి భూములేవో వారే గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడగా, ఏవిధంగా భూమి వెనక్కి ఇస్తారో అటు రైతులకు, ఇటు వైకాపా నేతలకూ అర్థంకాని విషయంగా మారింది.