ఆంధ్రప్రదేశ్‌

అరెస్టులు..నిర్బంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 26: ప్రత్యేక హోదా డిమాండ్‌తో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించిన వైకాపా జిల్లా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మానను జిల్లా కార్యాలయం ప్రధాన గేటును కూడా దాటనివ్వకుండా పోలీసులు నిలిపివేశారు. టెక్కలి వైకాపా సమన్వయకర్త పేరాడ తిలక్ టూటౌన్ సిఐ మోహన్‌తో వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు వైకాపా కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నంలో కుమ్ములాట జరిగింది. డిఎస్పీ భార్గవరావునాయుడు సమయస్ఫూర్తిగా వైకాపా జిల్లా కార్యాలయం ప్రధాన గేట్లన్నీంటికీ తాళాలు వేసి కొవ్వొత్తుల ర్యాలీని ఆ కార్యాలయానికే పరిమితం చేసారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శాంతియుతంగా ప్రజలు, పార్టీలు, సంస్థలు, యువత ఆకాంక్షను వెల్లడించే అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు. అంతకుముందు విశాఖపట్నం బయలుదేరిన ధర్మానను హౌస్ అరెస్టు చేసి ఊరి పొలిమేర దాటనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా నేత తమ్మినేని సీతారాంను రణస్థలం వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని లావేరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రణస్థలం వద్ద సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధును కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అట్టుడికిన గోదావరి జిల్లాలు
కాకినాడ/ఏలూరు,: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండుతో గోదావరి జిల్లాల్లో గురువారం నిరసనలను పెల్లుబికాయి. ఓవైపు గణతంత్ర వేడుకలు జరుగుతుండగా, మరోవైపు నిరసనకారులు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రకారకాల ఆందోళనలు సాగించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న డిసిసి అధ్యక్షుడు పంతం నానాజీ, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్, కాంగ్రెస్ బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన సాగిస్తున్న కాకినాడ జెఎన్‌టియు విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టుచేశారు. ఈ సంఘటనలో ఎస్‌ఎఫ్‌ఐ నేత క్రాంతికుమార్‌కు పోలీసుల లాఠీఛార్జీ కారణంగా గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలో పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పుష్కరఘాట్ సమీపంలో ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్‌చేస్తూ జనసేన కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసనకు ప్రయత్నించడంతో అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సోషల్ మీడియాలో నిరసన తెలియజేసిన ఇద్దరు జనసేన కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నందం గనిరాజు జంక్షన్‌లో సిపిఎం కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనగా రోడ్డుపైకి వచ్చిన వెంటనే పోలీసులు ప్రదర్శనను భగ్నం చేశారు. సామర్లకోటలో డివైఎఫ్‌ఐ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకుని, 10 మందిని అరెస్టు చేశారు. ముమ్మిడివరంలో వైసిపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు గురువారం ధర్నా, ర్యాలీ వంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దాపురంలో అఖిల పక్ష నేతలు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మండపేటలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నేతలను పోలీసులు అడ్డుకుని, పోలీసుస్టేషన్‌కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడానికి వెళుతున్న వారిని అడ్డుకున్నారు.
అడుగడుగునా అడ్డంకులు
తిరుపతి/ఒంగోలు/నెల్లూరు:ప్రత్యేక హోదా కోసం విపక్షాలు చేస్తున్న ఆందోళనలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేశారు. తిరుపతిలో విపక్ష నేతలు ఆందోళన చేయడంతో పోలీసులు మొహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో కొంత సమయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైకాపా విద్యార్థి, యువజన సంఘం, జనసేన నేతలు పోలీసుల అప్రమత్తం కాకమునుపే ఎస్వీయూనివర్శిటీ పరిపాలనా భవనం ముందు అరగంటపాటు ఆందోళన చేశారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు తక్షణం వారిని అరెస్టు చేశారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. తిరుపతిలో కొంతమంది జాతీయజెండా చేతపట్టుకుని ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద బైటాయించి ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సమయంలో విద్యార్థి, యువజన నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ః పీలేరులో కొవ్వొత్తుల ర్యాలీ చేయడానికి యత్నిస్తుండగా ఆందోళన చేస్తున్న ఎంపి మిథున్‌రెడ్డిని, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్టుచేశారు. ఒంగోలులో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేయబోతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేకహోదా కావాలంటూ ఒంగోలులో గురువారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన స్థానిక అంబేద్కర్ భవనం నుంచి ప్రారంభమైంది. కలెక్టరేట్‌కు చేరుకునేలోగా పోలీసులు ఈ ప్రదర్శనను అడ్డుకుని వైకాపానేతలను అరెస్టుచేసి వన్‌టౌన్‌పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఒంగోలులో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనకు హాజరయ్యేందుకు వస్తున్న మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి సహా పలువురిని పోలీసులు పొదిలిలో అరెస్టుచేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రఅధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. కాగా నెల్లూరు జిల్లా కేంద్రంలోనూ వైకాపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టుచేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడానికి బయలుదేరుతున్న నెల్లూరు రూరల్, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌ను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకొని వారిద్దరిని కార్యాలయంలో నిర్బంధించారు. నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయాన్ని పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే కార్యకర్తలందరు కెవిఆర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని కొవ్వొత్తుల ర్యాలీకి సన్నాహాలు చేస్తుండగా, ఎమ్మెల్యేలను బయటకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యేలు ర్యాలీని నిర్వహించలేకపోయారు. అన్ని పార్టీలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఢిల్లీకి వెళ్లి మోదీ ముందు నిరసన తెలుపుదామని, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో చూద్దామని అన్నారు.
అనంతలో కాంగ్రెస్ వౌనదీక్ష
అనంతపురం టౌన్:ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఆ హక్కును కాలరాసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని పిసిసి అధ్యయుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. వాటిని నిర్బంధించి హోదా సాధిస్తామని అన్నారు. హోదా సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం అనంతపురం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీవిగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని వౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ పార్లమెంటులో ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బిజెపి, టిడిపి పోటాపోటీగా ఐదు కాదు, పది కాదు, ఏకంగా పదిహేనేళ్లు ఉండాలని ప్రకటించాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి హోదాకన్నా ప్యాకేజీ తోనే అభివృద్ధి జరుగుతుందని సన్నానినొక్కులు నొక్కుతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి హోదా కన్నా ప్యాకేజీతోనే అనేక లాభాలున్నాయంటూ ఏకంగా పుస్తకాన్ని ముద్రించిందన్నారు.

చిత్రాలు..నెల్లూరులో వైకాపా ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే కాకాణి తదితరుల నిరసన
*కాకినాడలో విద్యార్థులను అరెస్టు చేస్తున్న పోలీసులు