ఆంధ్రప్రదేశ్‌

‘మహిళా రక్షక్’కు రక్షణేదీ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 29: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ‘మహిళా రక్షక్’కు ఇప్పుడు రక్షణ అవసరమా? అంటే అవుననే చెప్పాలి. పబ్లిక్‌గా యువతులు, మహిళలను వేధించే మృగాళ్లను కనిపెట్టి పనిపట్టేందుకు ప్రయోగాత్మకంగా విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ‘మహిళా రక్షక్’పై అప్పుడే దాడులు మొదలయ్యాయి. మఫ్టీలో విధి నిర్వహణలో ఉన్న మహిళా రక్షక్ బృందంలోని ఓ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల భద్రతా చర్యలు పటిష్ఠమవుతున్న క్రమంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్’ మాదిరిగానే విజయవాడలో కూడా కొద్దిరోజుల క్రితం ‘మహిళా రక్షక్’ బృందాలను ఏర్పాటు చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్టేషన్ల నుంచి ఎంపిక చేసిన మహిళా కానిస్టేబుళ్లతో 50 బృందాలు ఏర్పడ్డాయి. వీరంతా మహిళా ఎస్‌ఐ పర్యవేక్షణలో యూనిఫాంలో కాకుండా మఫ్టీలో సాధారణ యువతుల మాదిరిగా సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, పార్కులు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార కూడళ్లు, గుళ్లు, బస్టాపులు, బస్టాండు, రైల్వేస్టేషన్, తదితర రద్దీ ప్రాంతాల్లో నిఘా వేస్తారు. యువతులను, మహిళలను వేధించే ఈవ్‌టీజర్లను కనిపెట్టి వారి చేష్టలను కెమెరాలో బంధించిన తర్వాత వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తారు. వీరందరికీ వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించి తర్వాత కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఒకసారి దొరికితే సస్పెక్ట్ షీటు తెరుస్తారు. రెండోసారి పట్టుబడితే కేసు తీవ్రతనుబట్టి నిర్భయ కేసులు నమోదు చేస్తారు. ఇవీ ‘మహిళా రక్షక్’ విధులు.
ఇప్పటికే రంగంలోకి దిగిన ఈ ప్రత్యేక బృందాలు తొలిరోజే 14మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశాయి. ఇక రెండో విడతలో ఆదివారం విజయవాడలోని పలు ప్రాంతాల నుంచి మరో 13మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడే మరో మలుపు. మహిళా రక్షక్ బృందంలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. రెండో విడతలో ఈవ్‌టీజర్లను, అమ్మాయిల పట్ల వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించే పనిలో ఉండగా రైల్వేస్టేషన్ వద్ద మఫ్టీల ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి అమ్మాయిలను వేధిస్తుండగా సదరు కానిస్టేబుల్ వీడియోలో చిత్రీకరించడాన్ని గమనించి ఆమెపై దాడి చేశాడు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన మహిళా కానిస్టేబుల్ తేరుకుని తాను పోలీసునని చెబుతున్నా.. అయితే ఏంటంటూ కొట్టి కిందపడేశాడు. సమీపంలో ఉన్న పోలీసు కానిస్టేబుల్, స్థానికులు వచ్చి అతన్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే తనకు మహిళా కానిస్టేబుల్ అని తెలీదంటూ సదరు వ్యక్తి సెలవిచ్చాడు. దీంతో ‘రక్షణ’ మరింత ప్రశ్నార్థకమైంది. కానిస్టేబుల్ అని తెలియకుండానే దాడి చేయడమంటే సాధారణ మహిళ కాబట్టే మరింత భద్రత అనివార్యమని భావించిన ఉన్నతాధికారులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఈ పరిణామంతో వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో సాధారణ మహిళలు, యువతులకు రక్షణ లేదనేది స్పష్టమైందని డిసిపి జి పాలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ‘మహిళా రక్షక్’ బృందాలను మరింత బలోపేతం చేస్తూనే వారికి రక్షణగా సమీపంలో పురుష కానిస్టేబుళ్లు ఉండేలా సూచనలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఉమెన్ సేఫ్టీ 2013 యాక్టు ప్రకారం మహిళల భద్రతకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటూ విజయవాడ పోలీసు కమిషనరేట్ చట్టం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలోభాగంగా విద్యాసంస్థలు, కంపెనీలు తదితరచోట్ల శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టింది. వేధింపురాయుళ్ల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై యువతులకు, వారిని వేధిస్తే చట్టాల కాఠిన్యం ఎలా ఉంటుందో తెలుపుతూ యువకులకు అవగాహన కల్పించనున్నారు. కాగా సెల్‌ఫోన్ మేసేజ్‌ల ద్వారా ఓ కానిస్టేబుల్ భార్యతో పాటు మరో ముగ్గురు యువతులకు అసభ్యకర చిత్రాలు, సందేశాలు పంపుతున్న కాకినాడకు చెందిన పిల్లి శేఖర్ అలియాస్ కళ్యాణ్ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు డిసిపి పాల్‌రాజు వెల్లడించారు.

చిత్రం..నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డిసిపి పాల్‌రాజు