ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీ అధికారుల ఖాతాల్లో రూ. కోట్లలో నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: ముందస్తు జాగ్రత్తలేవీ లేకపోగా ఆపై కూడా నిర్లిప్త వైఖరితో ప్రజాధనం కాపాడటంలో రాష్ట్ర ట్రెజరీశాఖ ఘోరంగా విఫలమవుతున్నది. సిఎం వంటి వివిఐపిల కాన్వాయ్‌లో ముందస్తు జాగ్రత్తగా అంబులెన్స్‌తో పాటు చివరకు ఫైరింజన్ కూడా ఉంటుంది.. అలాంటిది కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వర్తించే ట్రెజరీ శాఖలో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలేవీ కన్పించడం లేదు. తొలుత తెనాలిలో ఒక జూనియర్ అసిస్టెంట్ అక్కడి మున్సిపాల్టీలో వివిధ పద్దుల బిల్లులకు సంబంధించి ఒక కోటీ ఆరు లక్షల రూపాయలను దారి మళ్లించిన వైనం బయటపడిన వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఒకరిని చూసి మరొకరు దాదాపు ఎక్కువ జిల్లా సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ఎవరికి అందినంతగా దోచుకోటం ప్రారంభించారు. తాజాగా తమ శాఖ పేరుప్రతిష్టలు కాపాడేందుకు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించకుండా సొమ్ము రికవరీపై దృష్టి సారిస్తున్న వైనం ఆంధ్రభూమి ప్రతినిధి దృష్టికి వచ్చింది. నెల్లూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు పెన్షన్‌దారులకు సంబంధించిన రూ.15 లక్షల సొమ్మును ఏకంగా తన సొంత బ్యాంక్ ఖాతాలకు మళ్లింప చేసుకున్నాడు. తెనాలి ఘటన తర్వాత ఈ వ్యవహారం బైటికి పొక్కటంతో ప్రకాశం జిల్లా డెప్యూటీ ట్రెజరీ అధికారిణి ప్రసన్నలక్ష్మి నెల్లూరు వెళ్లి విచారించి గుట్టుచప్పుడు కాకుండా రికవరీకి చర్యలు చేపట్టగా ఇప్పటికి ఐదు లక్షలు రికవరీ అయినట్లు తెలిసింది. ఇంకా ఇలాంటి వ్యవహారాలు ఏమైనా చోటుచేసుకున్నాయో పరిశీలించేందుకు గాను అక్కడి రికార్డులన్నింటిని ఆమె తన వెంట పట్టుకెళ్లారు. అసలు ట్రెజరీ శాఖలో కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఇలాంటి అవినీతి అక్రమాలు బాహాటంగా చోటుచేసుకోటం ప్రారంభమైంది. ఈ విధానంలో ప్రతి సబ్ ట్రెజరీ అధికారి, ఎకౌంటెంట్ ఇద్దరి పేర బ్యాంక్ ఖాతా ప్రారంభించబడింది. బ్యాంకుల్లో ఆమోదం పొందిన బిల్లుల మొత్తాలు ఈ ఖాతాకు చేరుతుండగా ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సంబంధించిన శాఖలు, లేదా వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు ఆ మొత్తాలను నెట్ నుంచి క్లిక్ చేయటం క్షణాల్లో జరిగిపోతున్నది. ఇక పెన్షన్‌దారుల్లో అత్యధిక మంది నిర్ణీత తేదీ రోజుకు తమ పెన్షన్ బ్యాంక్‌లో జమపడిందా లేదా అని తెలిసుకుంటుంటే అవినీతిపరులైన కొంతమంది నెలల తరబడి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అలాగే విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరిగినా ఆ తర్వాత పట్టించుకోవటం లేదు. ఇలాంటి వారి ఖాతాలకు జమ కావాల్సిన మొత్తాలను సిబ్బంది తమ అధికారులతో కుమ్మక్కయి నేరుగా తమ సొంత బ్యాంకు ఖాతాలకు జమ చేసుకుంటున్నారు. ఇక తెలివిగల సిబ్బంది కొందరు లక్షలాది రూపాయల విలువైన ప్రభుత్వ శాఖల బిల్లులను తొలుత జమచేసి తిరిగి రెండోసారి అవే బిల్లులను పాస్ చేయించి తమ సొంత ఖాతాలకు మళ్లించుకుంటుంటే ఆయా ప్రభుత్వ శాఖలు కూడా పట్టించుకోని వైనం కన్పిస్తోంది. ఏది ఏమైనా ప్రతి జిల్లాలోను ట్రెజరీ అధికారుల బ్యాంక్ ఖాతాల్లో కోట్లాది రూపాయల నిల్వలున్నాయి. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరచి కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలన్నింటిని స్తంభింప చేసి అసలు ఎంతకాలం నుంచి ఏ బిల్లుకు సంబంధించిన మొత్తాలు ఎందుకు పేరుకుపోయాయో ఆరా దీయటంతోపాటు ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పాసైన బిల్లులు, వాటికి సంబంధించిన మొత్తాలు ఏ ఖాతాలోకి జమ అయ్యాయో క్షుణ్ణంగా విచారిస్తే కోట్లాది రూపాయల అవినీతి మరింతగా బట్టబయలు కాగలదనుటలో ఎలాంటి సందేహం లేదు.