ఆంధ్రప్రదేశ్‌

నిఘా నేత్రంలో ఏఓబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 2: ఒడిశాలోని పొత్తంగి బ్లాక్ సుంకి వద్ద పోలీస్ వాహనాన్ని మావోలు పేల్చి వేసిన సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించి ఎఒబిని జల్లెడ పడుతున్నారు. కటక్‌లోని అంగూల్ పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందేందుకు బయలుదేరిన పోలీసు వాహనాన్ని మావోలు మందుపాతరతో పేల్చివేసిన విషయం విదితమే. ఈ సంఘటనలో ఇప్పటికి 8 మంది మృత్యువాతపడగా, మరో ఐదుగురు తీవ్రగాయాలతో విశాఖలో చికిత్స పొందుతున్నారు. దీంతో గురువారం వేకువ ఝాము నుంచి పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కల్వర్టులు, రహదారులు పరిశీలించి ఇలాంటి మందుపాతరలు మావోలు ఇంకెక్కడైనా అమర్చారా అన్న కోణంలో కూడా డిటెక్టర్లతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మందుపాతర పేల్చివేసిన తరువాత కూడా రెండో దఫా మావోలు ఎదురుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ముందస్తు జాగ్రత్తతో పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వాహనాల రాకపోకలకు అనుమతించారు. మావోలు సుంకి వద్ద మందుపాతర పేల్చివేసిన సంఘటనతో కల్వర్టు కూలిపోయింది. దీంతో ఎన్‌హెచ్ 46పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు ఆ రహదారి గుండా వాహనాలను అనుమతించలేదు. ఉదయం 9 గంటలకు కల్వర్టుకు మరమ్మతులు పూర్తి చేయడంతో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ముందెళ్లిన వాహనాలు ఎవరివి?
మందుపాతర పేల్చడానికి కొద్ది క్షణాల ముందర ఒక మోటారుబైక్, జీపు ఆ రహదారి గుండా పోలీసు వాహనానికి ముందర ప్రయాణించాయని స్థానికులు చెబుతున్నారు. ఆ వాహనాలు కూడా ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించాయి. దీంతో ఆ వాహనంలో మావోలు ఎవరైనా ప్రయాణించారా? వారు ఇచ్చిన సమాచారంతో కల్వర్టును పేల్చివేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మావోలు ఇలాంటి విధ్వంసానికి పూనుకున్నారంటే గత 10 రోజులుగా అక్కడ రెక్కి నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మావోలు పోలీసు వాహనాన్ని పేల్చివేయడానికి ముందర సుంకికి సమీపంలో ఉన్న వాహనాలను రోడ్డుపై అటకాయించారని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో కనీసం 15 మంది వరకు మావోలు పాల్గొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుంకికి సమీపంలోని మావోలకు సురక్షిత ప్రాంతాలైన తాడూరు, బంగారుబుడ్డి, బోడంపాడులో వారు రాత్రి బస చేసి ఆ గ్రామాల మీదుగా ఒడిశా అడవుల్లోకి చేరుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి పెద్ద విధ్వంసానికి మావోలు పూనుకున్నప్పుడు కనీసం 40 నుంచి 60 మంది వరకు మావోలు వివిధ ప్రాంతాల్లో తలదాచుకొని ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన తరువాత మావోలు ఒడిశాలోని సుంకి నుంచి ఆంధ్రలోకి ప్రవేశించే అవకాశాలు లేకపోవడంతో ఒడిశా అడవుల గుండా మల్కన్‌గిరి, కొరాపుట్, నారాయణపట్నం ప్రాంతాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది చెబుతున్నారు. ఇవి సంఘటనా స్థలం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున వారు ఆయా గిరిజన గ్రామాల మీదుగా వెళ్లే అవకాశం ఉందని ఆ దిశగా గిరిజన గ్రామాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోపక్క సుంకి నుంచి మోదుగ పంచాయతీలోని లోవ, పరకాపురం మీదుగా గొల్లూరు, ములగవలస, జామిగుడ మీదుగా కొరాపుట్ అడవుల్లోకి చేరి ఉంటారని భావిస్తున్నారు. లేనిచో సుంకి నుంచి కుందిలి, కొటియా, గంజాయిభద్ర, రామవలస, నిమ్మలపాడు మీదుగా ఒడిశాలోని మల్కన్‌గిరి అడవులకు చేరుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.