ఆంధ్రప్రదేశ్‌

జగన్ జోరు.. తమ్ముళ్ల బేజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 2: ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ బలంపై ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గతంగా ఆయన జోరుపై తెలుగుదేశం పార్టీలో అలజడి పెరుగుతోంది. జగన్ సభలకు పోటెత్తుతున్న జనవాహిని అటు పార్టీ క్యాడర్‌నూ ఆందోళన పరుస్తోంది. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్‌ల వైఫల్యమే వైసీపీ బలపడేందుకు కారణమని క్యాడర్ ఆరోపిస్తున్నారు. క్యాడర్‌ను పట్టించుకోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లు సొంత సంపాదనకు ఎగబడి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్న వైనమే వైసీపీ బలపడేందుకు కారణమవుతోందని స్పష్టం చేస్తున్నారు. పార్టీ-ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహించిన జన్మభూమి గ్రామసభలను మంత్రి శిద్దా సొంత నియోజకవర్గమైన దర్శిలోనే కార్యకర్తలు బహిష్కరించారంటే సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నియోజకవర్గంలో కీలకమైన రాజకీయ పదవులు, పోస్టింగులన్నీ సొంత కులం వారికే ఇస్తూ, పార్టీ కోసం పనిచేసిన తమపై మంత్రి నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని కమ్మ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ప్రధానంగా యార్డు చైర్మన్ ఎంపికపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. చివరకు అద్దంకి ఎలక్ట్రికల్ డిఈ ఎంపికలో సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతో, కరణం బలరాం ఆగ్రహించిన వైనం పార్టీలో చర్చనీయాంశమయింది. కొందరు మంత్రులు, అగ్రనేతల కుమారులు, కూతుళ్లు, అల్లుళ్లు అడ్డగోలుగా సంపాదించి రోడ్డుపై పడుతున్న అరాచకంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు.. జగన్‌ను ప్రత్యామ్నాయంగా చూడాల్సిన పరిస్థితిని కల్పించారని సీనియర్లు విశే్లషిస్తున్నారు.
క్యాడర్ కష్టాలను పట్టించుకోకుండా మైనింగ్, ఇసుక, భూదందాలతో వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలు విదేశీ విహార యాత్రలకు వెళుతున్నారని మండిపడుతున్నారు. కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ల దోపిడీ చివరకు మంత్రుల డ్రైవర్లకూ ఆదర్శంగా మారిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. గోదావరి జిల్లాలో సర్కారుకు వనరులు సమకూర్చిపెట్టే ఒక శాఖ మంత్రి వద్ద పనిచేసే వ్యక్తిగత డ్రైవర్ గత కొన్ని నెలల నుంచి చేస్తున్న దందా తాజాగా వెలుగుచూసింది. మంత్రి పేరు చెప్పి భీమవరానికి చెందిన ఒక వైశ్య సంఘ నేత నుంచి ఒక కారును కొనిపించుకున్న సదరు డ్రైవర్, చాలాకాలం నుంచి ఇతర దందాలు కూడా నడిపిస్తున్నారని, ఈవిషయం మంత్రి దృష్టికి వెళ్లినా ఇంతవరకూ తొలగించకపోవడాన్ని బట్టి డ్రైవర్లు కూడా జనాలను వదలడం లేదని స్పష్టమవుతోందంటున్నారు. మంత్రి గారి ఆదాయ వ్యవహారాలు కూడా సదరు డ్రైవర్ నాయకత్వంలోనే జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గుంటూరు మైనింగ్ ఉన్నతాధికారి తమ్ముడు కూడా ఆదాయ మార్గాల్లో చురుకుగా ఉన్నారని, అందుకే ఏ జిల్లాలో అయితే సస్పెండయ్యారో మళ్లీ అదే జిల్లాకు పోస్టింగ్ ఇచ్చారంటున్నారు. విశాఖలో ఉండే ఈయన ఎప్పుడూ మంత్రిగారి వద్దే కనిపిస్తున్నారని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖుడి పీఏ ముండ్లమూరు మండలంలోని చిలకలేరు వాగులో జరుగుతున్న ఇసుక దందాలో మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన పార్టీవారినీ వదలడం లేదని, సదరు పీఏ తీరుపై పార్టీ నేతలు కూడా చాలాకాలం నుంచీ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా చంద్రబాబు వియ్యంకుడైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ వ్యవహారంపై నేతలు బహిరంగంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ రాజకీయ అవగాహన రాహిత్యాన్ని పీఏ సద్వినియోగం చేసుకుంటున్నారని నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బాలకృష్ణ ఎంత బాబు వియ్యంకుడైనా తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈవిషయంలో ఎన్టీఆర్‌నే లెక్కచేయలేదని, ఏమీతెలియని బాలయ్యను ఎందుకు విడిచిపెడతారంటున్నారు. ప్రకాశంలో జిల్లాలో మంత్రి శిద్దా, విజయనగరంలో మంత్రి మృణాళిని, పశ్చిమ గోదావరిలో మంత్రి సుజాత, తూర్పులో రాజప్ప, విశాఖలో గంటా శ్రీనివాస్, నెల్లూరులో నారాయణ వైసీపీని ఎదుర్కోవడంలో గానీ, సొంత పార్టీని బలపర్చటంలో గానీ విఫలమయ్యారని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. జగన్‌పై గళం విప్పితే తమ వ్యాపారాలపై జగన్ మీడియాలో తమపై ఎక్కడ వ్యతిరేక వార్తలు రాస్తారోనన్న భయం కొందరిదయితే, భవిష్యత్తులో రాజకీయ వాతావరణం ఎటొచ్చి ఎటుపోతుందోనన్న ముందుచూపుతో మరికొందరు జగన్-వైసీపీపై దాడి చేసేందుకు భయపడుతున్నారని విశే్లషిస్తున్నారు. వ్యాపారాలు చేసుకునే మంత్రులు, ఎమ్మెల్యేలే ఈ వరసలో ఉన్నారని చెబుతున్నారు. తమ నేతల వైఫల్యమే జగన్, ఆయన పార్టీ రాజకీయంగా బలపడేందుకు కారణమవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలి ద్వారకాతిరుమల, నరసరావుపేట, కనిగిరి, పశ్చిమ గోదావరిలో ఆక్వా బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టిన వైనం తెదేపాకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ద్వారకాతిరుమలకు జనం పోటెత్తడం తమ్ముళ్లలో గుబులు రేపింది. జగన్‌కు అంత జనం ఎలా వస్తున్నారనే దానిపై తర్జనభర్జన మొదలయింది. మంత్రివర్గ ప్రక్షాళన, ఎమ్మెల్యేల నియంత్రణ, క్యాడర్‌కు న్యాయం చేయకపోతే జగన్ మరింత బలపడటం ఖాయమని కూడా కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు.