రాష్ట్రీయం

మహిళా బిల్లుకు బాబు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 11: రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు బాగా ఉన్నాయని, వారు పట్టుదలతో ఎదగాలని తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ రెండవరోజు శనివారం మధ్యహ్నం జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్లమెంటులో మహిళా బిల్లు అనుమతి పొందేందుకు కృషి చేయాలన్నారు. మహిళా సాధికారత లేకుండా సమాజం అభివృద్ధి చెందలేదని చెప్పారు. స్ర్తి వంటింటికే పరిమితి అనేది ఇప్పుడు తుడిచి పెట్టుకుపోయిందని, ప్రతి రంగంలో మహిళలు పోటీ పడుతున్నారన్నారు. పురాణాల్లో మహిళలకు ఉన్నత స్థానాలు కల్పించారని, అయితే కాలక్రమంలో మహిళల పట్ల గౌరవం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచినా మహిళలకు సమానత్వం రాలేదన్నారు. వారిపై ఆంక్షలు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు.
స్వేచ్ఛ మన జన్మహక్కు
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఈ వేదికలో తీర్మానం చేయాలని ఎపి మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి కోరారు. జాతీయ మహిళా పార్లమెంటు రెండోరోజు శనివారం నన్నపనేని మాట్లాడుతూ జనాభాలో 52 శాతం ఉన్న మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం అందరం కలసికట్టుగా పనిచేసి సాధిద్దామన్నారు. స్వేచ్ఛ మహిళల జన్మహక్కన్నారు. మానవజాతి మనుగడకు ఆధారమైన స్ర్తిలు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. ఇప్పటికీ వరకట్న వేధింపులు, గృహహింస, ర్యాగింగ్, అత్యాచారాలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ, రాష్టప్రతి ప్రతిభాపాటిల్, ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ, ముఖ్యమంత్రులుగా మమత బెనర్జీ, జయలలిత, మాయావతితో పాటు సుమిత్రా మహాజన్, మీరాకుమార్ స్పీకర్లుగా రాణించారని వివరించారు.
యువతకు బాబు ఆదర్శం
కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమర్ధవంతంగా వ్యవహరించి భారీస్థాయిలో పెట్టుబడులు రాబట్టారన్నారు. రాష్ట్రంలోని యువతకే కాకుండా ప్రపంచ యువతకు ఆయన ఆదర్శం అన్నారు. మదర్ థెరిస్సా, అబ్దుల్ కలాం, పిటి ఉష, మలాలా వంటి వారిని ఆదర్శంగా తీసుకుని యువత ఎదగాలన్నారు. విద్యార్థినులు ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కొనసాగించాలని, ఆశాజనకమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు.
మహిళలు
అన్ని రంగాల్లో ఎదగాలి
మహిళలు ప్రతి విషయంలో ఇంట్లో పెద్దవారి అభిప్రాయం తీసుకోవాలి అని అనకుండా సొంత నిర్ణయాలతో అభివృద్ధి చెందాలని శాసనసభ స్పీకర్ కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. విద్య, వైద్యం, రాజకీయం తదితర అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలన్నారు. అవకాశాలు మీ కళ్ల ముందే ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. 21వ శతాబ్దం భారత్‌దేనని గర్వంగా చెప్పారు.
సమాజంలో మార్పు రావాలి
ఆడపిల్ల పుడితే బాధపడకుండా తలఎత్తుకుని గర్వంగా చెప్పండి అని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ అన్నారు. మహిళల పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. యువతులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత, కిమిడి మృణాళిని, కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు..డికె అరుణ, నన్నపనేని రాజకుమారి, గద్దె అనూరాధ, డాక్టర్ విజయలక్ష్మి