ఆంధ్రప్రదేశ్‌

అస్త్రాలు అందిస్తున్నామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 11: అసలే సమస్యలతో సతమవుతున్న నేపథ్యంలో అనవసరమైన సమస్యలు కొనితెచ్చుకుని అదనపు సమస్యల్లో ఇరుక్కుంటున్న తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్లు, మంత్రులు తలపట్టుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేసిన వైనం పార్టీ శ్రేణులెవరికీ రుచించలేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ఆమెను ఆహ్వానించిన ప్రభుత్వం, గన్నవరం ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని, హైదరాబాద్‌కు తరలించిన వైనం పార్టీకి చెడ్డపేరు తెచ్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. దీనివల్ల ఒక మహిళను అనవసరంగా అవమానించి అరెస్టు చేశారన్న సానుభూతిని తామే వైసీపీకి అందించామని పలువురు సీనియర్లు వ్యాఖ్యానించారు. రోజా అరెస్టుకు కారణాలు చూపించడంలో తాము విఫలమైతే, దానిని అక్రమమని చాటడంలో వైసీపీ విజయం సాధించిందని, ఈ ఎపిసోడ్‌లో వైసీపీకి పొలిటికల్ మైలేజీ వచ్చిందంటున్నారు. మహిళా సదస్సు సందర్భంలో మహిళా ఎమ్మెల్యేను సదస్సు వరకూ రానీయకుండా అడ్డుకున్నారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, ఇది ప్రమాదకర సంకేమని వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెను సదస్సు వరకూ రానిచ్చి, వేదికపైకి పిలవకుండా సరిపోయేదని పలువురు సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆమెను వేదికపైకి ఆహ్వానించకపోయినా ఎలాంటి విమర్శలు వచ్చేవి కాదని, తొలిరోజు సభలో వైసీపీ ఎంపీ బుట్టా రేణుకకు అవకాశం ఇచ్చినందున రోజా విమర్శలు సరికావన్న అభిప్రాయం వ్యక్తమయ్యేదని విశే్లషిస్తున్నారు. ‘రోజా సదస్సుకు వచ్చినా ఆమె దానిని రాజకీయం చేస్తారనడంలో సందేహం లేదు. కానీ బయట మీడియాతో మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ పని ఆమె ఎలాగూ బయటకు వెళ్లినా చేస్తారు కాబట్టి, రోజాను అడ్డుకోకుండా ఉంటే బాగుండేద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఓ పక్క మహిళల గురించి మాట్లాడుతూ, అదే మహిళను అనవసరంగా అరెస్టు చేశారన్న భావన కల్పించారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రోజాపై మహిళా ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులను ఉసిగొల్పి ఆమెకు అనవసర ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రోజాను తిడితే మంత్రి పదవి వస్తుందని కొందరు, జగన్‌ను విమర్శిస్తే గుర్తింపు వస్తుందన్న ఆశతో మరికొందరు, ముద్రగడను విమర్శించం ద్వారా ఉనికి కొనసాగించుకోవచ్చని ఇంకొందరు చేస్తున్న వ్యాఖ్యలు వారిని చూసి టిడిపి భయపడుతోందన్న సంకేతాలకు కారణమవుతున్నాయని సీనియర్లు విశే్లషిస్తున్నారు. అదే సమయంలో కాపునేత ముద్రగడ పద్మనాభం విషయంలోనూ పార్టీ నాయకత్వం అనవరంగా భయపడుతూ, ఆయనను హీరోను చేస్తోందన్న అసంతృప్తి పార్టీ నేతల్లో చాలాకాలం నుంచి వ్యక్తమవుతోంది. ఆయనను వదిలేస్తే సరిపోతుందని, అలాకాకుండా ఆయనపై ఎక్కువ దృష్టి సారించి, సీఎం కంటే ఎక్కువ సంఖ్యలో పోలీసులను మోహరించడం వల్ల ముద్రగడను తామే హీరోగా చేస్తున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపు నేతలే మీడియా ప్రతినిధులతో ముద్రగడను మేమే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం, మీడియానే ఎక్కువగా హైలెట్ చేస్తోంది.. ఆయన మానాన ఆయనను వదిలేస్తే అసలు గొడవేమీ ఉండదని చెబుతున్నా, తమ నాయకత్వం మాత్రం ముద్రగడను చూసి భయపడటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. అయితే, ఆవిధంగా వదిలేస్తే తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం అనుమతి కూడా తీసుకోనంటున్న వ్యక్తి మాటల వెనుక హింస ఆలోచన ఉన్నట్టే కదా? నష్టం జరిగిన తర్వాత ఏమి అనుకున్నా లాభమేమిటి? ముందుచూపుతో ఉంటే నష్టమేమీ లేదన్న వాదన మరో వైపు వినిపిస్తోంది. ఇటీవల హోదా పోరులో భాగంగా విశాఖకు వెళ్లిన జగన్‌ను అనవసరంగా అరెస్టు చేసి, ఆయనను హీరో చేశామన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే కాబోయే సీఎంను టచ్ చేస్తున్నావంటూ నోరు జారి జగన్ తనకొచ్చిన మైలేజీని చేతులారా జారవిడుచుకున్నారని, లేకపోతే అక్కడ కూడా తమ పార్టీ నష్టపోయేదని గుర్తు చేస్తున్నారు.
కీలకమైన అంశాలు, పార్టీ ప్రతిష్ఠతో ముడిపడిన వ్యవహారాలు తెరపైకి వచ్చినప్పుడు తమతో మాట్లాడకపోవడంపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో బాబు విపక్షనేతగా ఒకతీరు, సీఎంగా మరో తీరున వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి రోజా అరెస్టు, హైదరాబాద్ తరలింపు అంశాన్ని నాయకత్వం తమతో చర్చించలేదని చెబుతున్నారు.