ఆంధ్రప్రదేశ్‌

బాబాయ్ వర్సెస్ అబ్బాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 16: తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించి, దేశ రాజధానిలో పార్టీ పతాకానికి గౌరవం తెచ్చిన దివంగత మాజీ ఎంపి కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబంలో రాజకీయ అధిపత్యపోరు మొదలయింది. ఎర్రన్నాయుడి సోదరుడైన మంత్రి అచ్చెన్నాయుడుకు, ఎర్రన్నాయుడు కుటుంబానికి రాను రాను దూరం పెరిగి, అది చివరకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వరకూ వెళ్లిందన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లాల్లో బాబాయ్-అబ్బాయ్ మధ్య రాజకీయ అధిపత్యానికి తెరలేచింది. ఎర్రన్నాయుడు తనయుడైన ఎంపి రామ్మోహన్‌నాయుడు రాజకీయ ఎదుగుదలకు బాబాయ్ అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నారని, దివంగత ఎర్రన్నాయుడు సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలకు మచ్చ తెస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న ఎర్రన్న కుటుంబం ఇటీవల పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కలసి అచ్చెన్న చర్యలపై ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబం నుంచి మంత్రి పదవి లేకపోయినా ఫర్వాలేదని, కానీ ఎర్రన్న పేరు ప్రతిష్ఠలకు మచ్చ తెచ్చేందుకు తాము అనుమతించబోమని బాబు వద్ద వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీగా ఉన్న రామ్మోహన్‌నాయుడు జిల్లాలో సిఫారసు చేసిన వివిధ పనులు, బదిలీలను అచ్చెన్నాయుడు అడ్డుకుంటున్నారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి నిలిపివేస్తున్నారన్న ప్రచారం చాలాకాలం నుంచీ వినిపిస్తున్న విషయం తెలిసిందే. యువనేత రామ్మోహన్‌నాయుడు దూకుడును అచ్చెన్న రాజకీయ అభద్రతగా భావిస్తున్నందుకే జిల్లాలో ఆయనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని రామ్మోహన్‌నాయుడు అనుచర వర్గం చాలాకాలం నుంచీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా సైకిల్ యాత్రతో జిల్లాలో పార్టీని కదిలించి, ఎర్రన్నాయుడిని గుర్తు చేసిన రామ్మోహన్‌నాయుడిని ఎదగనీయకుండా చేస్తున్న ప్రయత్నాలు దివంగత నేత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న ఎర్రన్నాయుడు కుటుంబం చివరకు విధిలేక బాబును కలసి జిల్లాలో పరిస్థితి వివరించినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు పదవికి ఎసరు తప్పదన్న చర్చకు తెరలేచింది. కాగా, నిజానికి వీరిద్దరి మధ్య నిమ్మాడలో చెక్ పవర్, శ్రీకాకుళం రూరల్‌లో ఇసుక రీచ్ తవ్వకాల విషయంలో విబేధాలు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలాకాలం నుంచి నిమ్మాడలో సర్పంచ్ ఎవరున్నా ఎర్రన్నాయుడు సోదరుడైన ప్రసాద్ ఆధ్వర్యానే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే, ప్రస్తుతం మంత్రి భార్య అక్కడ సర్పంచిగా ఉన్నప్పటికీ, ప్రసాద్‌కు విలువ ఇవ్వకపోవడం కూడా ఎర్రన్నాయుడు కుటుంబం ఆగ్రహానికి కారణమని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి. అటు అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు, మద్యం సిండికేట్లన్నీ స్థానికులకు కాకుండా మంత్రి విజయనగరం జిల్లా వారికే అప్పగించారన్న అసంతృప్తి కూడా జిల్లా పార్టీ నేతల్లో ఉంది. మంత్రి కార్యదర్శి ఒకరు ఇష్టారీతిన వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, చివరకు కలెక్టర్ ఫోన్ చేసినా తీయకుండా హిందూపురంలో మరో శేఖర్‌లా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై గతంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ప్రతిభాభారతి కూడా సమన్వయ కమిటీ సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానమైన అన్ని లావాదేవీలు ఆయన ఆధ్వర్యానే జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి. దీనిపై ఎంపి రామ్మోహన్‌నాయుడు వివరణ కోరగా అలాంటివేమీ లేదని చెప్పారు. అయితే, తన సైకిల్ యాత్ర సందర్భంగా తనకు సహకరించిన తండ్రి అభిమానులు తన రాజకీయ భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచిస్తారు తప్ప, కుటుంబంలో ఎలాంటి రాజకీయ కలహాలు లేవని చెప్పారు. నిమ్మాడ సర్పంచ్‌కు సంబంధించి చెక్‌పవర్ అంశం సహా, తామంతా కలిసే చేసుకుంటున్నామని, బాబాయ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని, అసలు తన తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పటివరకూ తమ కుటుంబం బాబును కలిసింది లేదని రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

చిత్రాలు.. కింజరాపు రామ్మోహన్‌నాయుడు *కింజరాపు అచ్చెన్నాయుడు