ఆంధ్రప్రదేశ్‌

ఇదో గ‘లీజు’ వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఫిబ్రవరి 17: ప్రధాన రైల్వే స్టేషన్లకు చెందిన విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాణిజ్య పరంగా అభివృద్ధి చేసి, ఆదాయం పెంచుకునే ఆలోచనలో రైల్వేశాఖ ఉండగా, విజయవాడలో 45 ఏళ్ల క్రితం చేసుకున్న ఒక ఒప్పందం అతీగతీ లేకుండా ఉంది. ప్రధాన రైల్వేస్టేషన్ ఉన్న ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చి వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి, దాని ద్వారా వచ్చే రాబడితో ఆ ప్రాంత రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడానికి ఈనెల 1వ తేదీన ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా వారం రోజుల క్రితం రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు రిమోట్ వీడియో లింక్ ద్వారా విజయవాడ రైల్వేస్టేషన్ రీ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కూడా. ఇదిలా ఉండగా గత యుపిఎ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ పార్టనర్‌షిప్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో ఉన్న రైల్వే ఖాళీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అయితే స్థలం తీసుకున్న కంపెనీ ప్రతినిధులు లీజు తీసుకున్న వ్యక్తులు సంస్థ పేరుతో బోర్డులు స్థాపించి వదిలేశారు తప్పితే, తరువాత ఎటువంటి నిర్మాణాలు ప్రారంభించ లేదు. విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు అతి చేరువలో డివిజనల్ రైల్వే ఆసుపత్రి ప్రహరీగోడకు ఎదురుగా సుమారు రెండు నుంచి మూడు వేలలోపు గజాలు విస్తీర్ణం కలిగిన ఖాళీ రైల్వే స్థలం ఉంది. గత పది సంవత్సరాల క్రితం డివిజనల్ ఇంజనీర్లు ఈ స్థలంపై సర్వే జరిపి దానికి చెందిన రిపోర్టుని రైల్వే బోర్డుకు పంపించారు. అనంతరం రైల్వేబోర్డు స్థలాన్ని ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథార్టీకి అప్పగించారు. వీరి ద్వారా బాలాజీ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ 45 సంవత్సరాల పాటు ఈ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు వచ్చి విజయవాడ డివిజన్‌కు చెందిన ల్యాండ్ విభాగపు ఇంజనీర్ అధికారులతో కలిసి వారు నిర్మించదలచిన కట్టడంపై స్థలంలో పరిశీలన జరిపారు. ఈ సమావేశానంతరం స్థలంలో రెండు బోర్డులను ఏర్పాటు చేశారు. అందులో ఒక బోర్డు ఇండియన్ రైల్వే ప్రాపర్టీ అని, మరో బోర్డులో ఫర్ కన్‌స్ట్రక్షన్ 5 స్టోర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ 45 ఇయర్స్ అనే బోర్డులు నెలకొల్పారు. ఆ తరువాత బాలాజీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అక్కడ ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టకుండానే వదిలేసింది. అనంతరం (కాంట్రాక్టర్) లీజుదారుని పేరు మార్పుతో అదే స్థానంలో మరో బోర్డు వెలిసింది. ఆ బోర్డులో బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌కు బదులుగా యలమంచిలి కన్‌స్ట్రక్షన్స్ అని బోర్డు పెట్టారు. ఈ సంస్థ ప్రతినిధులు కూడా లీజు స్థలాన్ని పరిశీలించుకుని స్థలం తమ సంస్థదనే ఒక బోర్డుని ఏర్పాటు చేసి వెళ్లారు. ఆ తరువాత ఈ సంస్థ కూడా ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా అలాగే వదిలేసింది. దీంతో నిర్మాణానికి ఇచ్చిన గడువు పూర్తికావడంతో ఖాళీ స్థలంలో ఉన్న బోర్డుపై యలమంచిలి కన్‌స్ట్రక్షన్స్ అనే పేరుపైన విజయవాడ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లు స్టిక్కర్లను అంటించారు. ప్రస్తుతం ఈ స్థలం రైల్వేశాఖ ఆధీనంలో ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన పిపిపి విధానం ద్వారా ఈ స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడతామని అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో ప్రముఖ కంపెనీలు 45 సంవత్సరాలు లీజుకు తీసుకుని ఎటువంటి నిర్మాణాలు లేకుండానే తిరిగి ఆ స్థలాన్ని రైల్వేశాఖకు వదిలేశాయి. ప్రస్తుతం అదే స్థలానికి రైల్వే అధికారులు తిరిగి టెండర్లు పిలువనున్నారు. వచ్చే మే 24వ తేదీకి నిర్వహణ టెండర్లు పిలిచి, ఎవరు మెరుగైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే వారికి స్థలం లీజుకు ఇస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు విజయవంతమవుతుందనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.