ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలతో మోసం చేస్తున్నాయి.. ఇచ్చిన మాట తప్పుతున్నాయి.. మీరు చేయలేకపోతే ఎందుకు చేయలేదో తేల్చండి.. ఆపై ప్రజలే నిర్ణయిస్తారు’.. అని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అల్టిమేటమిచ్చారు. ‘ఎన్నికలకు ముందు వీధివీధి తిరిగి హామీలు గుప్పించారు.. ప్రజలు పదేపదే రోడ్లపైకి వస్తున్నారు.. ఒకటి రెండు కులాలు ఉద్యమబాట పట్టాయి.. నేను ముందుగానే హెచ్చరించా.. ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం మీరే’ అని ఆయన స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో రెండు తెలుగు రాష్ట్రాల నేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దీక్షాపరులకు పవన్‌కల్యాణ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తన చిన్ననాటి సహచరులైన చేనేత కుటుంబాల జీవన స్థితిగతులకు చలించి, వారి జీవనప్రమాణాలు మెరుగుపడాలనే భావనతో ఉన్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో రెండు వేల మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వాలకు పట్టకపోవటం దారుణమన్నారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వివిధ సంఘాల వారు తనవద్దకు వస్తే వడ్డించేవాడిని వదిలి విస్తరాకులు ఎత్తేవాడి వద్దకు వెళ్లారని కొందరు నాయకులు వ్యాఖ్యానాలు చేశారన్నారు. విస్తరాకులు ఎత్తడమంటే చెత్తను తీసివేయటంగా గ్రహించాలని ఆయన చురకలంటించారు. రాజకీయ వ్యవస్థలో నాయకులు కులాలను కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. చేనేత వస్త్రాల్లో 11 రకాలు చేతిమగ్గాల ద్వారానే ఉత్పత్తి అవుతాయని, పవర్‌లూమ్స్ వల్ల నేత కళాకారులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని లక్షల మంది పొట్టలు కొడుతున్న పవర్‌లూమ్స్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సమస్యలపై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చేనేత వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులతో పాటు ప్రపంచంలోని ప్రతి తెలుగువారు ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. పంచెకట్టు, బొట్టులోనే తెలుగుదనం ఇమిడి ఉందన్నారు. వచ్చే నెల 14వ తేదీతో జనసేన ఆవిర్భవించి మూడేళ్లు పూర్తవుతున్నందున ప్రజాసమస్యలపై వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామని ప్రకటించారు. ‘వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేస్తా.. ఒక్క ఓటు వచ్చినా, కోటి మంది ఓట్లేసినా ప్రజాసమస్యలపైనే మా పోరాటం’ అని పవన్‌కల్యాణ్ తేల్చిచెప్పారు. ‘నాకు కులాలు, మతాలు లేవు.. మీరే నా బలం.. మీకు అన్యాయం చేస్తే తనైనా, మనైనా ఉపేక్షించేదిలేదు’ అని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వారసత్వ రాజకీయాలంటే వ్యతిరేకతలేదని చెప్తూనే.. ‘ఎన్నాళ్లీ కుటుంబ రాజకీయ వ్యవస్థ’ అని ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదాపై స్పందిస్తూ ‘ఓట్ల కోసం వచ్చినప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పారు.. పాదయాత్రలకు వచ్చి హామీలు గుప్పించారు.. పదవిలోకి వచ్చాక మాటమీద నిలవలేక పోతున్నార’ని విమర్శించారు. ప్రత్యేక హోదా రాదు, ప్యాకేజీ వస్తుందని నమ్మించి ఇప్పుడు చట్టబద్ధత కూడా అవసరంలేదని అబద్ధాలు చెప్పి మోసగిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘రాజకీయాల్లోకి వచ్చి దోపిడీ చేయాల్సిన అవసరం నాకులేదు.. అభిమానులు ఇచ్చే రూపాయి చాలు.. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జనసేన కాపాడుతుంది’ అని పవన్‌కల్యాణ్ వివరించారు.

చిత్రం..నేత కార్మిక సంఘాల నేతలతో సత్యాగ్రహ దీక్ష విరమింపజేస్తున్న పవన్‌కల్యాణ్