ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్ రంగస్థల పురస్కారానికి గుమ్మడి గోపాలకృష్ణ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: నందమూరి తారక రామారావు వర్దంతిని పురస్కరించుకుని రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 15తేదీ వరకు గుంటూరు, కర్నూలు, విజయనగరంలలో జరిగిన నంది నాటక పోటీల్లో ఎంపికైన 15 ఉత్తమ నాటక, నాటికల పేర్లను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం వెల్లడించారు. అలాగే 2016వ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి గుమ్మడి గోపాలకృష్ణ ఎంపికయ్యారు. ఈ పురస్కారం కింద లక్షా 50వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేసారు. పెద్ది రామారావు అధ్యక్షతన అల్లాబక్ష్‌ముల్లా , జిఎస్‌ఎస్ శాస్ర్తీ ఈ ఎంపిక చేసారు. త్వరలో జరిగే నంది నాటక బహుమతుల ప్రధానోత్సవ సభలో సిఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతి గ్రహీతలకు బహుమతులు అందచేస్తారని వెంకటేశ్వర్ తెలిపారు.
నాటకోత్సవాలకు ఈ దఫా 276 ఎంట్రీలు రాగా 246 ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 5వేల మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మన రాష్ట్రంతో పాటుగా తెలంగాణ, ఒరిస్సా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, బెంగాల్, పాండిచ్చేరి, తదితర రాష్ట్రాల నుంచి తెలుగు నాటక సమాజాలు ఈ పోటీల్లో పాల్గొనడం ఒక విశేషం. ప్రదర్శితమైన ప్రతి పద్య నాటకానికి రూ.30వేలు, ప్రతి సాంఘిక నాటకానికి రూ.20వేలు, నాటికకు రూ.15వేలు, ప్రతి బాలల నాటిక, ప్రతి కళాశాల, విశ్వవిద్యాలయ నాటికకు రూ.15వేలు పారితోషికం ఇచ్చారు. న్యాయనిర్ణేతలు ఒక్కో విభాగం నుంచి 10-12 ప్రదర్శనలను ఎంపిక చేయగా వీటి వీడియోలను తుది న్యాయ నిర్ణేతలు ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు వీక్షించి ప్రతి విభాగం నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను, వ్యక్తిగత బహుమతుల విజేతలను ఎంపిక చేయటం జరిగింది. నాటక రంగంపై పర్చూరుకు చెందిన కారుమూరి సీతారామయ్య గ్రామీణ నేపధ్యంలో ఆధునిక తెలుగు నాటక రచన సమస్యలపై రాసిన పుస్తకాన్ని ఉత్తమ పుస్తకంగా ప్రకటించారు. పై బహుమతులతో పాటు 43 వ్యక్తిగత బహుమతులను కూడా ఎంపిక చేయటం జరిగింది. వీరికి దాదాపుగా రూ.15 లక్షలు నగదు బహుమతులను అందజేసారు.
బహుమతుల వివరాలు
పద్యనాటక విభాగంలో అనంతపురం లలిత కళాపరిషత్ వారి ‘సతీ సావిత్రి’, కర్నూలు లలిత కళా సమితి వారి ‘ప్రమీలార్జున పరిణయం’, ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ వారి ‘చాణక్య చంద్రగుప్త’ ప్రదర్శనలు, సాంఘిక నాటక విభాగంలో పెదకాకాని గంగోత్రి వారి ‘అక్షర కిరీటం’, హైదరాబాద్ కళాంజలి వారి ‘జారుడుమెట్లు’, రాజమండ్రి విజయాదిత్య ఆర్ట్స్ వారి ‘ఇంటింటి కథ’, సాంఘిక నాటక విభాగంలో కొలకలూరు శ్రీసాయి ఆర్ట్స్‌వారి ‘చాలు-ఇక చాలు’, గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘రెండు నిశ్శబ్దాల మధ్య’, బొరివంక శర్వాణి గ్రామీణ గిరిజన సేవా సంఘం వారి ‘తేనెటీగలు పగపడ్తాయి’, బాలల నాటికల విభాగంలో విశాఖపట్టణం, శ్రీప్రకాష్ విద్యానికేతన్‌వారి ‘ఎక్కడివాళ్లు అక్కడే’, నంద్యాల శ్రీగురురాజా కానె్సప్ట్ స్కూలు వారి ‘అపురూపం’ ఒంగోలు కళాప్రియ లిటిల్ చాంప్స్ వారి ‘్భరోసా’, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విభాగంలో ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా డిగ్రీ కళాశాలవారి ‘సంభవామి’, విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల న్యూస్టార్ మోడరన్ ధియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ‘కాంట్రవర్సీ’ అనంతపూర్ ఎస్‌ఎస్‌బిఎన్ డిగ్రీ కళాశాల వారి ‘వృక్షో రక్షిత రక్షితః’ నాటకాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి.