ఆంధ్రప్రదేశ్‌

సూర్యప్రభపై ఊరేగిన వాయులింగేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంగళవారం సూర్యప్రభ, చప్పర వాహనసేవలు జరిగాయి. ఉదయం గంగాదేవి సమేత సోమస్కంద మూర్తి సూర్యప్రభ వాహనంపై, జ్ఞాన ప్రసూనాంబ చప్పరం వాహనంపై ఊరేగారు. మేళతాళాలు, కళాకారుల బృందాలు వెంటరాగా వాహనసేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ట్రస్టుబోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, ఇ ఓ భ్రమరాంబలు ప్రారంభించారు. భూతరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి స్వామి భూత వాహనంపై, అమ్మవారు చిలుక వాహనంపైన ఊరేగి భక్తులను అనుగ్రహించారు. విద్యుత్ దీపాల కాంతుల్లో జరిగిన ఉత్సవంలో వేలమంది భక్తులు పాల్గొని కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

ఆది దంపతులకు రావణ వాహన సేవ
శ్రీశైలం, ఫిబ్రవరి 21: శ్రీశైలంలో కొలువైన ఆది దంపతులు మంగళవారం రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక యాగాలు, హోమాలు, జపానుష్టానాలు, పారాయణాలు జరిపించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. రావణవాహనంపై ఆశీనులనుచేసి మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం పురవీధుల్లో కన్నుల పండువగా జరిగింది. గ్రామోత్సవం ముందు భక్తుల కోలాటాలు, గొరవయ్యల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, తోలుబొమ్మలాటలు, పగటి వేషాలు భక్తును విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం పుష్పపల్లకి సేవ నిర్వహించనున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీశైల మల్లన్నకు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం మంత్రిని అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రధాన పర్యాటక కేంద్రంగా కొల్లేరు

కార్యాచరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

విజయవాడ, ఫిబ్రవరి 21: కొల్లేరు సరస్సును రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు వారంలోగా పొందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు, అరికట్టడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపి స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మూడవ సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. అలాగే రాష్ట్రంలోని పక్షి సంరక్షణ కేంద్రాలను, జింకలు, ఎలుగుబంటుల పార్కులను మరింత అభివృద్ధి చేసి, ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలోనే పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం మన రాష్ట్రంలోనే ఉందని దాన్ని టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలంటే దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చెప్పారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నగర వనాలను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. విజయవాడలోని ఓ కొండను నైట్ సఫారీకి అనువుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అడవుల్లో పెద్దఎత్తున చెక్‌డ్యాంలు నిర్మించి అటవీ విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు. తీర ప్రాంతంలో మామిడి తోటల పెంపకం చేపట్టాలని చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇఏపీ నిధులు మార్చి నెలాఖరులోగా ఖర్చు చేయండి
ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఇఏపి) కింద కేంద్రం రాష్ట్రానికి అందించిన నిధులను మార్చి నెలాఖరులోగా ఆయా అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయం సమావేశ మందిరంలో శాఖాధిపతుల బడ్జెట్ కసరత్తుపై జరిగిన సమీక్షలో ఈ అంశంపై చర్చించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద కేటాయించిన మొత్తం నిధుల్లో రూ.785.98 కోట్లు మార్చి నెలాఖరులోగా వ్యయం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఏపీ వాటర్ సెక్టార్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్ కెనాల్స్) కింద కేటాయించిన నిధుల్లో మార్చి నెలాఖరులోగా రూ.133.99 కోట్లు ఖర్చు చేయాలని సిఎం చెప్పారు. ఏపి రోడ్ సెక్టారు ప్రాజెక్టు కింద కేటాయించిన నిధుల్లో ఇంకా రూ.215.97 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద రూ.144.22 కోట్లు, ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ ప్రాజెక్టుకు రూ.12.37 కోట్లు, ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు రూ.201.24 కోట్లు, ఏపీ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు కింద రూ.82.30 కోట్లు, ఏపీ రూరల్ హైవోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రాజెక్టు కింద ఇంధన శాఖకు కేటాయించిన నిధుల్లో రూ.29.10 కోట్లు, ఏపీ కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు కింద జల వనరుల శాఖకు కేటాయించిన నిధుల్లో రూ.6.65 కోట్లు, ఏపి ఇరిగేషన్ లైలీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు కింద జల వనరుల శాఖకు కేటాయించిన నిధుల్లో రూ.34.14 కోట్లు మార్చి నెలాఖరులోగా వ్యయం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.