ఆంధ్రప్రదేశ్‌

‘దేశం’లో గోదా‘వర్రీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 23: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ విజయం అందించిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ సీట్ల కోసం పెరుగుతున్న పోటీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా పరిణమించింది. స్థానిక సంస్థల కోటాలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో తమకు సీట్లు ఇవ్వాలంటూ కులం కార్డుతో నేతలు చేస్తున్న ఒత్తిళ్లు నాయకత్వాన్ని హడలెత్తిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటి ఉభయ గోదావరి జిల్లాలో త్వరలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిత్వాల కోసం ఆశావహులు వివిధ రూపాల్లో నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రధానంగా కాపు, శెట్టిబలిజ, క్షత్రియ, మత్స్యకార వర్గానికి చెందిన సీనియర్లు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. అందులో భాగంగా రెండు జిల్లాలకు చెందిన మంత్రుల ఇళ్లు, ఆఫీసులు వారి అనుచరులతో కిటకిటలాడుతున్నాయి. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా గంపగుత్తగా తెదేపాకు జైకొట్టింది. ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వాటిని దక్కించుకునేందుకు డజన్ల సంఖ్యలో ఆశావహులు రంగంలో దిగారు. అటు విపక్షానికి కనీస స్థాయిలో కూడా సభ్యులు లేకపోవడంతో రెండు సీట్లు అవలీలగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న నాయకత్వానికి, ఆశావహులు తెరపైకి తెస్తున్న కులం కార్డు ఆందోళన కలిగిస్తోంది. మరోసారి ఎమ్మెల్సీ కోసం అంగర రామ్మోహన్ తన శెట్టిబలిజ కులం కార్డును గట్టిగానే సంధిస్తున్నారు.
కాగా గతంలోనే పోటీపడి, బాబు హామీతో వెనక్కితగ్గిన క్షత్రియ వర్గానికి చెందిన సత్యనారాయణరాజు ఈసారి గట్టిగానే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వనుందున, ఈసారయినా తమకు అవకాశం ఇవ్వాలని ఆ వర్గీయులు ఒత్తిడి చేస్తున్నారు. బాబు పాదయాత్రలో చివరివరకూ ఉన్న సత్యనారాయణరాజుకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలంతా మద్దతు ఇస్తున్నారు. నిజానికి పార్టీ వర్గాల్లో ఆయనకు చాలాకాలం నుంచి సానుభూతి ఉంది. చిన్న వయసులోనే పార్టీలో చురుగ్గా పాల్గొన్నప్పటికీ, వయసు అడ్డంకిగా మారింది. గత ఎన్నికల్లో నిరాశ చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఈలి నానితోపాటు ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, సర్పంచుల చాంబర్ అధ్యక్షుడు కడలి గోపాలరావు, ఎర్రానవీన్ కూడా టికెట్లు ఆశిస్తున్నారు.
ఇక తూర్పు గోదావరి జిల్లాలో పెరుగుతున్న ఆశావహులను చూసి మంత్రులు హడలిపోతున్నారు. ఈ జిల్లాల్లో పూర్తిగా కులపోరు కనిపిస్తోంది. కాపు-బీసీ-కమ్మ వర్గాల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ముద్రగడను చూపించి కాపు కోటాలో సీటు సాధించే వ్యూహానికి నేతలు తెరలేపారు. కమ్మ వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కొనసాగింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయనకు ఆర్ధిక మంత్రి యనమల కూడా మద్దతునిస్తున్నారు.
కాపు వర్గానికి చెందిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మెట్ల రమణబాబు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంపి తోట నరసింహం తన బావమరిది రమణబాబుకు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల్లో బాబు తనకు హామీ ఇచ్చిన ప్రకారం సీటు కోసం సీనియర్ నేత గన్ని కృష్ణ ప్రయత్నిస్తుండగా, మత్స్యకారుల నుంచి నాగిడి నాగేశ్వరరావు టికెట్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఈ జిల్లాలో జరుగుతున్న పోటీ చివరకు యనమల- తోట నరసింహం వ్యక్తిగత ప్రతిష్ఠగా మారింది. ఇందులో కాపు వర్గానికి చెందిన హోంమంత్రి చినరాజప్ప తన కాపు వర్గం పక్షాన ఉంటారా? లేక యనమల సమర్థిస్తున్న కమ్మ వర్గం వైపు ఉంటారా అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
ఈ రెండు జిల్లాల్లో కులమే ప్రధానం కావడం, అందులో రెండు కులాలు కీలకం కావడంతో ఎవరికి సీటు ఇవ్వాలన్నది నాయకత్వానికి సమస్యగా పరిణమించింది. గత ఎన్నికల్లో సీట్లు దక్కనివారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు, ఇప్పటివరకూ అవకాశాలు దక్కని వారికి న్యాయం చేయడం, మంత్రుల సిఫార్సుల మొహమాటంతో నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనికితోడు టికెట్లు లభించని నేతలవైపు వైసీపీ చూస్తుండటం మరో సమస్యలా పరిణమించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇప్పటికే రెండు జిల్లా నేతలతో చర్చిస్తున్నారు.