ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీలకు విద్యుత్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు రాష్ట్రంలోని వివిధ పంచాయతీలకు భారంగా పరిణమించాయి. అరకొర ఆదాయంతో పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోవడంతో అనేక పంచాయతీల్లో చీకట్లు అలముకున్నాయి. విద్యుత్ బకాయిలు దాదాపు 1350 కోట్ల రూపాయల మేరకు పేరుకుపోగా, సర్‌చార్జి భారం దాదాపు 40 కోట్ల రూపాయల వరకూ ఉంది. రాష్ట్రంలో 12,920 పంచాయితీలు ఉన్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో ఎన్నికైన పంచాయితీ పాలకవర్గాలు అరకొరగా ఉన్న ఆదాయంతో పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, ఆ నిధుల్లో 20 శాతం మాత్రమే విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు అనుమతిస్తారు. దీంతో కొన్ని పంచాయితీల ఆదాయం జీతాలు, ఇతర నిర్వహణకు మాత్రమే సరిపోతుండటంతో విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లించలేని పరిస్థితి చాలా చోట్ల నెలకొంది. రాష్ట్రంలోని వివిధ పంచాయితీలు 1350 కోట్ల మేర విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో 40 కోట్ల వరకూ సర్‌చార్జిగా ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు విధించాయి. విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని 17 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను గురువారం నిలిపివేశారు. దీంతో వీధి లైట్ల వెలగక పంచాయితీల్లో చీకట్లు అలముకున్నాయి. శివరాత్రి పర్వదినాన వీధిలైట్లు వెలగకుండా చేయడం విమర్శలకు తావిస్తోంది. గంటూరు జిల్లా పరిధిలోని పంచాయితీల నుంచి దాదాపు 80 కోట్ల రూపాయల మేర విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్నాయి. ఉండవల్లి వంటి గ్రామానికి ఏటా ఆదాయం 40 లక్షల రూపాయలు వస్తుంటే, అందులో జీతాల కింద 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 30 లక్షల రూపాయల మేర ఉన్న విద్యుత్ బిల్లును మిగిలిన మొత్తంతో ఎలా చెల్లించాలన్నది పంచాయితీ కార్యవర్గానికి మింగుడుపడని సమస్య. ఇదే పరిస్థితి చాలా పంచాయితీల్లో నెలకొంది. విద్యుత్ బిల్లు బకాయిల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిస్థితిలో మార్పులేదు.
సౌర విద్యుత్ మేలు
పంచాయితీల్లో పేరుకుపోతున్న విద్యుత్ బకాయిల సమస్యకు చెక్ పెట్టేందకు సౌర విద్యుత్ మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు తొలుత కొంత ఖర్చయినా, తరువాతి కాలంలో పంచాయితీలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎల్‌ఇడి బల్బుల వల్ల కూడా కొంత మేర విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. విద్యుత్ బకాయిలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఆలిండియా పంచాయితీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం కూడా కొంత మొత్తం విడుదల చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వీధీ లైట్లు, మంచినీటి సరఫరాపై దీని ప్రభావం ఉంటోందని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకు సిద్ధమని తెలిపారు.