ఆంధ్రప్రదేశ్‌

కరవు కాటేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస కరవుల కారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 301 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈ సంఖ్య 400కు పైగానే ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో శనివారం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పళ్లంరాజు తదితరులు రాష్ట్రంలో కరవు సమస్యపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పళ్లంరాజు మాట్లాడుతూ ఈ ఏడాది ఇంకా వేసవి కాలం ప్రారంభం కాకుండానే కరవు తీవ్రత ఈ విధంగా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. కరవు పీడిత ప్రాంతాల్లో ఏ విధమైన ముందస్తు సహాయ చర్యలు తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుచిత వైఖరి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పశుగ్రాసం లేక ఇబ్బందులు ఏర్పడ్డాయని, నేడు వేలాదిగా పాడి పశువులను కబేళాలకు తరలించే దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటుచేసిన దాఖలాల్లేవన్నారు. పిసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 10లక్షల మంది పొట్ట చేత పట్టుకుని, బతుకు జీవుడా అంటూ ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం లెక్కలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఈ పథకం లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఉపాధి హామీ పనులను గ్రామసభల్లో నిర్ధారించకుండా జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో పెద్ద ఎత్తున దందా సాగుతోందని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలకు వెంటనే మంచినీటిని సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక సంస్థల అధికారాలను కాలరాసే విధంగా మారిన జన్మభూమి గ్రామ కమిటీలను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులను గ్రామసభల్లోనే నిర్ణయించి, అమలుచేయాలని, వలసల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి కార్యదర్శి విలియం హ్యారీ, రాష్ట్ర కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అంతకు ముందు పళ్ళంరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

చిత్రం..తూ.గో. జెసి సత్యనారాయణకు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం