ఆంధ్రప్రదేశ్‌

మీడియా పాయంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమావేశాలు పొడిగించమంటే కుదరదన్నారు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనేకమైన ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలో తాండవిస్తున్న కరవు, అన్నదాతల వలసలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉన్నందున, సమావేశాలను పొడిగించాలని తాము కోరితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కుదిరేపనే కాదని స్పష్టంచేశారని వైసిపి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలను 13 రోజులు మాత్రమే జరుపుతామని చెప్పడం సమంజసం కాదన్నారు. కనీసం నెల రోజులైనా అసెంబ్లీ సమావేశాలు ఉండాలని, అప్పుడే ప్రజా సమస్యలను గుర్తించడానికి వీలు కలుగుతుందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం అంతా అసత్యాలు, అబద్దాలతో కూడుకుందని, అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వ కరపత్రమేనని ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, గడికోట పేర్కొన్నారు.
బాబు ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు : చెవిరెడ్డి
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఇంటికో ఉద్యోగం ఇచ్చారో లేదో గానీ చంద్రబాబు ఇంట్లో మాత్రం ముగ్గురికి ఉద్యోగాలు లభించాయని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా బాలయ్య బాబు ఎమ్మెల్యే అయ్యారని, తాజాగా చిన్నబాబు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారని, బుల్లిబాబు దేవాన్ష్‌కే పదవి రావాల్సి ఉందని ఎద్దేవాచేశారు.
క్యాబినెట్ ప్రతులను చదివే సాంప్రదాయం మారాలి
తొలి శాసనసభ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ చేత అనర్గళంగా 50 నిముషాల పాటు అబద్దాలు, అసత్యాలు పలికించారని, అసలు క్యాబినెట్ రూపొందించిన ప్రతులను చదివే సాంప్రదాయాన్ని మార్చాలన్న ప్రతిపాదన తీసుకురావాల్సిన అవసరం ఈ రోజు ప్రసంగాన్ని చూస్తే అవశ్యమనిపిస్తుందని మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో జాతీయ వృద్ధిరేటు కన్నా రాష్ట్రం ఎంతగానో ముందుందని చెప్పించారని, అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని, పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని పలికించారన్నారు. ఇదంతా అబద్ధమంటూ కనీస మద్ధతు ధర పెంచనిదే రైతుకు ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. నేషనల్ ఎకమనిక్ సోషల్ సర్వీస్ సంస్థ అవినీతిపై నిర్వహించిన సర్వేలో రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించడమేనా అభివృద్ధి చెందడం అంటూ ప్రశ్నించారు.
కరవు పరిస్థితుల్లో వృద్ధిరేటు ఎలా సాధ్యం
రాష్ట్రంలో వరుసగా రెండు సంవత్సరాల పాటు కరవు తాండవిస్తుంటే వ్యవసాయంలో 24 శాతం వృద్ధిరేటు సాధించామని చెప్పుకోవడం అంకెల గారడి తప్ప మరొకటి కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి నిలదీశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ వందలాది మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తిస్తూ వచ్చిందని, 25 శాతం మేర వరి విలువ పడిపోగా, 100 కోట్ల రూపాయల మేర ప్రత్తిరైతులు నష్టపోయారని అన్నారు. ఇలాంటి ప్రధానమైన పంటల ధరలు, ఉత్పత్తి పడిపోతే వ్యవసాయరంగంలో గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

పెద్దాయనచేత వెన్నుపోటు ప్రసంగం చదివించారు
నూతన అసెంబ్లీలోనైనా దుష్టసాంప్రదాయాలకు చరమగీతం పాడతారనుకుంటే ఏకంగా పెద్దాయనైన గవర్నర్ నరసింహన్ చేత ప్రత్యేకహోదాకు సంబంధించి నిస్సిగ్గుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచేవిధంగా ప్రసంగాన్ని చదివించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఆరోపించారు. మూడు సంవత్సరాల పాటు ప్రత్యేకహోదాపై అసత్యాలు, అబద్దాలను వల్లెవేస్తూ చివరికి నూతన అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి హోదాతో పనిలేదని చెప్పించి ఎట్టకేలకు ప్రత్యేకహోదాకు చరమగీతం పాడేశారని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం
తిరుపతి ఏడు కొండల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడి, సిఎం చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రజలను నమ్మక ద్రోహం చేశారని సిపిఐ ఎమ్మెల్సీ పిజె.చంద్రశేఖరరావు విమర్శించారు. సోమవారం అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎపి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా సాధించుకోవాలన్నారు. తొలిరోజు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చే విధంగా, ప్రత్యేక హోదా ఇక రాదంటూ ప్రభుత్వం చెప్పించటం 5 కోట్ల ఆంధ్రప్రజలను చంద్రబాబు మోసం చేయటమేనని అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతోందని చెప్పటం హాస్యాస్పదమన్నారు.