ఆంధ్రప్రదేశ్‌

కావాలని ఒకరు.. కాదని మరొకరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 19: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించిన నియోజకవర్గాల పునర్విభజనపై సందేహాలు కొనసాగుతున్నాయి. వలస వచ్చిన వారికి కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలను ఆశగా చూపించిన ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రుల ఆశలకు.. అవే తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకత్వాలు కళ్లెం వేస్తున్నాయి. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా ఇద్దరు సీఎంలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. విభజన చట్టం ప్రకారం తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆమేరకు రెండు రాష్ట్రాల శాసనసభలు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. ఆ ప్రకారంగా 119 సీట్లున్న తెలంగాణలో 153కు, 175 సీట్లున్న ఏపిలో 225కు నియోజకవర్గాలను పెంచాలని రెండు ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఆమేరకు ఇద్దరు సిఎంలూ కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పక్షాన ఎంపి వినోద్‌కుమార్, టిడిపి తరపున కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పట్లో పునర్విభజన కుదరదని, 2021లోనే పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సందర్భంగా స్పష్టం చేసింది. అయినా తెదేపా, తెరాసలో ఆశలు నీరుగారలేదు. రెండు రాష్ట్రాల ఒత్తిళ్లతో కదిలిన వెంకయ్య నాయుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఫైలు పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ ‘జరుగుతున్నట్లు’ కనిపిస్తోంది. ఒక వర్గానికి చెందిన మీడియాలో దీనిపై ఎక్కువగా హడావుడి కనిపిస్తుండటంతో గోడదూకిన ఎమ్మెల్యేలు, అగ్రనేతలు ఖుషీగా ఉన్నారు.
అయితే, ఇద్దరు సీఎంలు పట్టువదలని విక్రమార్కుల్లా ఒత్తిళ్లు తెస్తుంటే, అటు రెండు రాష్ట్రాల బిజెపి శాఖలు మాత్రం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేశాయి. కొద్దినెలల క్రితం అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో పునర్విభజనపై రెండు రాష్ట్రాల నాయకులతో చర్చించారు. ఆ క్రమంలో పునర్విభజన అవసరమా? లేదా? దానికి కారణాలేమిటంటూ ముద్రించిన ఫార్మెట్‌ను అందరికీ పంపిణీ చేశారు. దానికి రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఇప్పటి పరిస్థితిలో తమకు అవసరం లేదని అందులో లిఖితపూర్వకంగా రాసిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దానివల్ల పార్టీకి కొత్తగా వచ్చిన లాభమేమీ వుండదని, సంస్థాగతంగా అంత బలం కూడా లేదని నాయకులు అమిత్‌షాకు వివరించారు. అయితే కొద్దిరోజుల నుంచి పునర్విభజన అంశంపై మళ్లీ కదలిక ప్రారంభమైందని మీడియాలో వార్తలు రావడంతో ఆ అంశంపై చర్చ మొదలయింది. ఈ ఏడాదికి అయిపోతోందని, కేంద్రం కూడా ఆమేరకు సుముఖంగానే ఉందన్న ప్రచారంతో రెండు పార్టీల్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అగ్రనేతల్లో సంతోషం వెల్లివిరిసింది.
అయితే ఇదంతా బిజెపికి సంబంధం లేని వ్యవహారమని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ‘ఆ రెండు పార్టీలు తమ పార్టీలో చేరినవారు ఆందోళన చెందకుండా తమ అనుకూల మీడియాలో కథనాలు రాయించుకుంటున్నాయి. మా నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్న మాట నిజమే. కానీ నిర్ణయం తీసుకోవలసింది పార్టీ కదా? మా అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? రెండు రాష్ట్ర కమిటీలు వద్దని చెప్పిన తర్వాత, సొంత పార్టీ వారిని కాదని, ఇతర పార్టీలు చెప్పిన వాటిని మా నాయకత్వం అమలు చేస్తుందా?’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. యుపిలో విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి ఒత్తిళ్లకూ లొంగే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి ప్రయోజనం లేకపోతే వ్యక్తుల కోసం ఎందుకు నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో వెంకయ్య నాయుడు కృషి చేస్తున్నందున ఆయన మాట నాయకత్వం కాదనే పరిస్థితి ఉండదని నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్న తెదేపాను సమర్థించే బిజెపిలోని మరో వర్గం వాదిస్తోంది. వెంకయ్య ప్రయత్నాలు, ఇద్దరు సీఎంలు అంగీకరించిన తర్వాత ఇక ఆగే ప్రసక్తే ఉండదని ఈ వర్గం చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపిలో వెంకయ్య నాయుడును కాదని నిర్ణయం తీసుకునే ధైర్యం నాయకత్వం చేయదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సంఖ్య పెరిగితే తామూ రాష్ట్రంలో బలపడతామని, ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశాలు వస్తాయని ఈ వర్గం వాదిస్తోంది.
ఆ వర్గం మీడియా వెనుక ఓ పార్టీ?
కాగా, గత కొద్దికాలం నుంచి ఒక వర్గం తెలుగు మీడియాతో పాటు ప్యాకేజీ, రుణమాఫీ అంశాలపై పవన్ ట్వీట్లలో చేసిన వ్యాఖ్యలు, కథనాలపై ఏపి బిజెపి నేతలు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాటిని ఇంగ్లీషులో అనువాదం చేసి పంపారు. తాజా కథనాలపై ఆగ్రహంతో ఉన్న కమలదళాలు దాన్ని సీరియస్‌గానే తీసుకుని, వాటి నేపథ్యాన్ని తమ జాతీయ అధ్యక్షుడికి ఫిర్యాదులో వివరించారు. దీనివెనుక రాజకీయ కుట్ర ఉందని, రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలూ నెరవేరుస్తున్న బిజెపి ఏపిలో బలపడకుండా ఉండేందుకు ఒక సామాజిక వర్గం మీడియా చాలాకాలం నుంచి చేస్తున్న ప్రయత్నాల వెనుక ఒక రాజకీయ పార్టీ ప్రమేయం ఉందంటూ, ఆమేరకు ఆ మీడియా సంస్థలకు అందిస్తున్న ప్రయోజనాలను కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. గతంలో హోదా గురించి కూడా ఇదే వర్గం మీడియా తమ పార్టీకి, మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిందని లేఖలో గుర్తుచేసినట్లు తెలిసింది. బిజెపి బలపడకుండా అంతర్గతంగా జరుగుతున్న ఈ పరిణామాలపై చర్య తీసుకోవాలని వారు అమిత్‌షాను కోరినట్లు కూడా సమాచారం.

చిత్రాలు..ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్