ఆంధ్రప్రదేశ్‌

కాపు కార్పొరేషన్‌లో కుమ్ములాటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 20: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఇప్పటికే కమిషన్ వేసి తొలిసారిగా వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేసి కాపులకు రుణాలందిస్తున్నప్పటికీ అందుకు తగిన ప్రచారం లేకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. రాష్ట్ర చరిత్రలో కాపుల కోసం ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, వాటిపై పార్టీ ముద్ర వేసేందుకు తాము నియమించిన చైర్మన్ గానీ, ఎండి గానీ దృష్టి సారించకుండా ఆధిపత్య పోరుతో కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ మేరకు కార్పొరేషన్ పనితీరుపై సమీక్ష నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఫలితంగా మంగళవారం కార్పొరేషన్ పనితీరుపై సమీక్ష జరగనుంది. వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేసి విద్యార్థులకు విదేశీ చదువులకు రుణాలు, వ్యాపారాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నప్పటికీ చాలామంది కాపులు ఇప్పటికీ ముద్రగడ, ఇతర పార్టీల వైపు చూస్తున్న వైనం బాబు దృష్టికి వచ్చింది. ప్రభుత్వ రుణాలు పొందిన వారంతా చంద్రబాబు నాయుడు ఫొటోలు కాకుండా పవన్-ముద్రగడ ఫొటోలు ముద్రించుకుంటున్న అంశంపై పార్టీలో చర్చ కూడా జరిగింది. ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉండి కూడా కాపులకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే దాన్ని వారికి చేర్చాల్సిన చైర్మన్, ప్రచారం నిర్వహించాల్సిన ఎండి ఇద్దరూ అధిపత్య పోరులో నిమగ్నమై అందుకు కార్పొరేషన్ కార్యాలయాన్ని వేదిక చేసుకోవడంపై వచ్చిన ఫిర్యాదులను బాబు తీవ్రంగా పరిగణించారు. ఇద్దరు ఒకరి అధికారాలకు మరొకరు కత్తెర వేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని, చైర్మన్ సన్మానాలకు పరిమితమవుతున్నారే తప్ప, పథకాలను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారు. బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ అందులో ప్రచారానికి ఇప్పటివరకూ ఒక శాతం కూడా ఖర్చుపెట్టని వైనంపైనా చర్చ జరుగుతోంది. దీంతో ఆ ఇద్దరినీ తప్పించడమో, లేదా వారి బాధ్యతలను మరొకరికి అప్పగించి వారిద్వారా కార్పొరేషన్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమో చేయాలన్న సూచనలు ఇప్పటికే అందాయి. ఎండీని కూడా మార్చి పథకాలను కాపుల వద్దకు తీసుకెళ్లే సమర్థుడైన అధికారిని నియమించాలని, అదే సమయంలో చైర్మన్‌ను తొలగించి కాపు వర్గాల్లో ప్రజాదరణ ఉన్న నేతకు పగ్గాలివ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కార్పొరేషన్‌కు జిల్లా కార్యాలయాలు ఏర్పాటుచేయాల్సి ఉన్నా ఇప్పటివరకూ అది చేయలేదు. బెజవాడలో ఉన్న కార్యాలయం చెక్కులు పంపిణీ చేయడానికే పరిమితమయింది. అదేవిధంగా కార్పొరేషన్ అమలుచేస్తున్న పథకాలు కూడా ఎవరికీ తెలియకపోవడంతో ముద్రగడ, ఇతరులు చేస్తున్న ఆరోపణలే నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా కార్పొరేషన్ పనితీరును పట్టించుకోవడం మానేశారంటున్నారు. ఫలితంగా వెయ్యి కోట్ల బడ్జెట్, కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటుచేసిన కార్యాలయం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మా జాతి కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌లో ఏం జరుగుతోందో మావాళ్లకే తెలియడం లేదు. ఎంత ఖర్చుపెడుతున్నా కాపుల్లో మా పార్టీపై సానుకూలత కనిపించడం లేదు. అంతా పవన్, ముద్రగడ వైపే చూస్తున్నారు. మరి అలాంటప్పుడు కార్పొరేషన్ ఉండి ఏంలాభం? ఆఫీసులో కాపు నేతల సన్మానాలు, నేతల పత్రికా ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో పథకాల గురించి చెప్పేదిక్కులేనప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల రాజకీయంగా ఏం ప్రయోజనమన్న ఆలోచన వస్తోంద’ని తెదేపాకు చెందిన ఓ కాపునేత వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, కార్పొరేషన్‌లో భారీ బడ్జెట్ ఉన్నందున కాపుల కోసం అమలుచేస్తున్న పథకాలను వారి వద్దకు తీసుకెళ్లడంతో పాటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు జిల్లాస్థాయిలో ఒక అధికార ప్రతినిధిని నియమించాలని, అదేసమయంలో రాష్టస్థ్రాయిలో కొందరు అధికార ప్రతినిధులను నియమిస్తే బాగుంటుందన్న యోచన ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే సూచనలు అందినట్లు తెలుస్తోంది. పార్టీలో సమర్థులైన కాపు నేతలున్నారని, వారిని కాపు కార్పొరేషన్ అధికార ప్రతినిధులుగా నియమిస్తే వారికి గుర్తింపు ఇవ్వడంతోపాటు పథకాలు కూడా వేగంగా కాపులకు చేరతాయంటున్నారు. వారికి కార్పొరేషన్ నుంచి కొంత వేతనం కూడా ఏర్పాటుచేస్తే పార్టీలో పనిచేస్తున్న కాపు నేతలకు ఉపాధి కూడా చూపించినట్టవుతుందన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో అమలుచేస్తున్న పథకాలను ఆ సామాజిక వర్గానికి అందేందుకు చైర్మన్ ఐవిఆర్ కృష్ణారావు రూపొందించిన జిల్లా కో-ఆర్డినేటర్ల వ్యవస్థ విజయవంతమైన విషయాన్ని కాపు నేతలు ఈసందర్భంగా గుర్తుచేస్తున్నారు.