ఆంధ్రప్రదేశ్‌

టిడిపి - వైసిపి మాటల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: శాసనసభ సమావేశాల్లో మంగళవారం బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైన కొద్దిక్షణాల్లోనే అవినీతి, అక్రమాలు, కమీషన్లపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పరస్పర దూషణలతో సభ హోరెత్తింది. ఈనేపథ్యంలో ‘క్విడ్‌ప్రోకో’ తెరపైకి వచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మిగులు విద్యుత్ కన్పిస్తున్నా ఇక్కడ చంద్రబాబు కృష్ణపట్నం, విటిపిఎస్‌లో అదనపు విద్యుత్ ఉత్పాదన పేరిట అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తున్నారని, ఇదే క్విడ్‌ప్రోకో అంటూ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన వైకాపా సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం పొరుగునున్న తెలంగాణలో రూ.4.46 కోట్లు, గుజరాత్‌లో రూ.4.76 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.3.96 కోట్లు ఖర్చుచేస్తుంటే చంద్రబాబు మాత్రం రూ.6.35 కోట్లు చొప్పున కాంట్రాక్టర్లకు అప్పనంగా దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యుత్ రంగం భ్రష్టుపట్టిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల కేవలం నెలరోజుల్లోనే పరిస్థితులు అనుకూలంగా మారాయన్నారు. ఇప్పటికీ కర్నాటకలో విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయని చెప్పారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదంటూ నాలుగుమార్లు ఓపెన్ బిడ్స్ పిలిచి ఎవరూ రాకపోవటంతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్‌ను ఖరారు చేశామని చెప్పారు. ఇందులో అవినీతి జరిగిందంటూ మాట్లాడే నైతికత తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని జైలుకెళ్లిన జగన్‌కు లేదన్నారు. దీనిపై వైకాపా సభ్యులు ఒక్కసారిగా లేచి విరుచుకుపడ్డారు. మధ్యలో బిజెపి పక్ష నేత విష్ణుకుమార్‌రాజు జోక్యం చేసుకుంటూ ‘జగన్ పుష్కలంగా గడించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా చూశారా?’ అన్నప్పుడు వైకాపా సభ్యులు బల్లలు చరిచారు. వెంటనే తేరుకుంటూ ఏదిఏమైనా బాబు కష్టపడి ఈ రాష్ట్రాన్ని అంథకారం నుంచి వెలుగులోకి తెచ్చారన్నారు. జగన్ కార్యాలయం, ఇల్లు కూడా వెలుగులతో నిండి ఉంటున్నాయికదా అన్నప్పుడు టిడిపి సభ్యులు ‘అసలు జగన్ ఇక్కడ లేరుకదా, తెలంగాణాలో ఉంటున్నారుకదా’ అంటూ నాలిక్కరుచుకున్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ జగన్ వద్ద డబ్బు ఎంత ఉందో తాను చూడకపోయినా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 43వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తుచేసిందన్నారు. సిబిఐ 11 కేసులు నమోదు చేసిందని, ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దీనికి నిరసనగా వైకాపా సభ్యులు మరోమారు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పది శాతమిస్తే ఆస్తులన్నీ రాసిస్తా
అచ్చెన్నాయుడు ఆరోపణలపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మంత్రి చెబుతున్న రూ.43వేల కోట్లలో 10శాతం తనకిస్తే ఆయన ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెట్టి ఆస్తులన్నీ రాసిస్తానం’టూ ప్రకటించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘సిఎం చంద్రబాబు సహా మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నోరుతెరిస్తే అబద్ధాలొస్తాయి. నా తండ్రి బతికి ఉన్నంతకాలం ఆయనతో పాటు నన్ను కూడా మంచోళ్లే అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే అసలు కథ మొదలైంది’ అన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు, ఎర్రన్నాయుడు కుమ్మక్కయి తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టించారన్నారు. వాస్తవానికి సీజ్ చేసిన ఆస్తి విలువ రూ.1200 కోట్లు కూడా లేదన్నారు. 2009 తర్వాత సాక్షి దినపత్రిక షేర్ల విలువతో పాటు పెరిగిన ఆస్తులను కూడా అక్రమంగా జోడించారంటూ ఏదిఏమైనా ‘సాక్షి’ దేశంలోనే 8వ స్థానంలో ఉందన్నారు. ఈనాడు పత్రిక కూడా కొంతకాలం నష్టాల్లో నడిచి షేర్ల విలువ పెరిగిన తర్వాత కోలుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి పాదాభివందనం చేయడం వల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై వైకాపా సభ్యులు ఒక్కసారిగా లేచి పెద్దపెట్టున కేకలు వేయటంతో సభ హోరెత్తింది. ఒకదశలో వైకాపా సభ్యులు చంద్రబాబు అతి పెద్ద అవినీతిపరుడంటూ విరుచుకుపడ్డారు. ఆ నల్లధనంతోనే శాసనసభ్యులను కొంటూ ఓటుకు నోటు కేసులో చిక్కారంటూ పెద్దపెట్టున కేకలు వేశారు.

చిత్రం..సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు