ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ కుటుంబంలో విభీషణులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిఒక్కరినీ విస్మయపరిచిన వైఎస్ కుటుంబ సభ్యుని ఓటమి వెనుక కుటుంబ కలహాలే దాగున్నాయా? జగన్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన కుటుంబ సభ్యులే విభీషణుల పాత్ర పోషించారా? కొన్ని నెలలుగా చాపకింద నీరులా నడిచిన కథలో ‘ఆ నలుగురే’ కీలకపాత్ర పోషించారా?.. తాజాగా కడపలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పోస్ట్‌మార్టంలో వెలుగుచూసిన నిజాలివి! అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దశాబ్దాల నుంచి కడప జిల్లాను కనుసన్నలతో శాసిస్తున్న వైఎస్ కుటుంబంలో జిల్లా ప్రజలంతా ప్రేమించే వైఎస్ వివేకానందరెడ్డి ఘోర పరాజయం రాష్టమ్రంతటా చర్చనీయాంశమయింది. ఓటమి జిల్లా ప్రజల్లో ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టింది. వైఎస్ కుటుంబం పట్టు సడలిందనడానికి ఈ ఫలితాలు ఒక నిదర్శమని కొందరు వాదిస్తుంటే, తెలుగుదేశం ప్రభుత్వం కోట్లు వెచ్చించి స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచిందన్న వాదనలు మరికొందరి నుంచి వినిపిస్తున్నాయి. దాన్నలా ఉంచితే, అసలు వైఎస్ కుటుంబంలోని ప్రముఖులే వివేకా ఓటమికి కృషి చేశారన్న వార్త విస్మయానికి గురిచేస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని, వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిరుగులేని స్థానంలో నిలబెట్టేందుకు త్యాగం చేసిన తమ కుటుంబానికి వైఎస్ కుటుంబం అన్యాయం చేసిందన్న ఓ నేత అసంతృప్తి తాజాగా వివేకా ఓటమికి ఒక కారణమయింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమను ఆర్థికంగా ఆదుకోలేదని, రాజకీయంగా పదవులిచ్చి ప్రోత్సహించలేదన్న అసంతృప్తి రానురాను అసమ్మతిగా మారిందని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి. అయితే వైఎస్ తన కుటుంబ సభ్యులందరికీ బంగ్లాలు కట్టించారని, ఆర్థిక సమస్యలు అబద్ధమని వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే మరికొందరు వాదిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు నేత గతంలోనే తన ఇంటిని ఓ తెలుగుదేశం నాయకుడికి అమ్మారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన ఆర్థిక ఇబ్బందిని గమనించిన జిల్లా తెలుగుదేశం కీలక నేత ఒకరు గత నెలరోజుల క్రితమే వైఎస్ కుటుంబానికి చెందిన నేతతో రాయబారం నడిపారు. ఇందుకు ‘ఆసుపత్రి సంబంధాలు’ కూడా దోహదపడ్డాయని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి. తనకు ఇల్లు ఇప్పించాలన్న సదరు నేత షరతును తెదేపా నేతలు ఆమోదించారంటున్నారు. దానికి ప్రతిగా తన వర్గానికి చెందిన 7 ఓట్లతో పాటు మరో ఇద్దరు వైసీపీ నేతల ద్వారా మరికొన్ని ఓట్లు వేయించేందుకు సదరు వైఎస్ కుటుంబీకుడు తెలుగుదేశం అభ్యర్థితో ఒప్పందం కుదుర్చుకున్నారు. తన బంధువులతో జరిగిన ఒప్పందాన్ని తెలుసుకున్న జగన్ ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించి పంచాయితీ పెట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు. తాను ఎవరితోనూ ఒప్పందం చేసుకోలేదని, వివేకాకే ఓట్లు వేయిస్తామని చెప్పినప్పటికీ చివరలో ఆయన తెదేపాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పార్టీ వర్గాలు అసలు విషయం చెప్పాయి. ఫలితంగా మొత్తం డజను ఓట్లకు పైగా వేయించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి ఈవిషయంలో శరవేగంగా స్పందించగా జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఈ ఎన్నికల్లో చక్రంతిప్పిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించి దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమన్వయకర్తలుగా ‘ఆపరేషన్ విభీషణ’ను సుఖాంతం చేశారు. అయితే వివేకా ఓటమిని జీర్ణించుకోలేని ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు సదరు విభీషణుడి అనుచరుడైన ఒక కౌన్సిలర్ ఇంటిపై సోమవారం రాత్రి మూకుమ్మడి దాడికి దిగగా భీతిల్లిన ఆయన వైఎస్ కుటుంబీకుడి ఇంట్లో తలదాచుకున్నారు. తమ నేత ఓటమికి కారణమైన నేతను వందల మంది కార్యకర్తలు నానాదుర్భాషలాడారు. దీంతో పోలీసులు ఆ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబంలోని లక్ష్మీపార్వతిని జగన్ తన పార్టీలో చేర్చుకుని ఆ ఫ్యామిలీకి ఝలక్ ఇవ్వగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కీలక సమయంలో వైఎస్ కుటుంబాన్ని చీల్చి జగన్‌కు షాక్ ఇచ్చినట్టయింది.