ఆంధ్రప్రదేశ్‌

నాడు కయ్యం .. నేడు నెయ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 20: శత్రురాజులు చేతులు కలిపారు. మారిన రాజకీయ పరిణామాలు సంస్థనాధీశులను ఒక్కటి చేశాయి. విజయనగరం, బొబ్బిలి రాజులకు తరాతరాలుగా ఉన్న వైరం ఉత్తరాంధ్ర వాసులకు తెలియంది కాదు. అనివార్యమైన రాజకీయ పరిస్థితులు వీరిని ఒక్కటి చేసినా గత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఈ నెయ్యం ఎన్నాళ్లు? అన్న సందేహాలున్నాయి. ఇటు విజయనగరం రాజులు, అటు బొబ్బిలి రాజ కుటుంబాలు కుటుంబపరంగా, రాజకీయంగా ఉన్న విభేదాలకు చరమగీతం పాడాయి.
బొబ్బిలి రాజ కుటుంబానికి చెందిన బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో విజయనగరం జిల్లాలో అశోక గజపతిరాజు, సుజయకృష్ణ రంగారావు కలిసి పనిచేయాల్సి రావడం తాజా పరిణామం. ఇప్పటి వరకు విజయనగరం రాజుల కుటుంబసభ్యులు టిడిపిలో కొనసాగుతుండగా, బొబ్బిలి రాజకుటుంబసభ్యులు మొదట్లో కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు పోటీపడటం, విమర్శలకు దిగటంతో ఈ రెండు కుటుంబాల మధ్య గడచిన మూడు దశాబ్ధాలుగా వైరం కొనసాగింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బొబ్బిలి రాజకుటుంబ సభ్యులైన ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి చేరికను విజయనగరం రాజకుటుంబ సభ్యుడైన కేంద్రమంత్రి, విజయనగరం ఎంపి అశోక గజపతిరాజు స్వాగతించటంతో రెండు కుటుంబల మధ్య ఉన్న వైరానికి తెరపడే అవకాశం ఏర్పడింది. దీనివల్ల తెలుగుదేశం మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు బొబ్బిలి రాజకుటుంబం, ఇటు విజయనగరం రాజకుటుంబం సభ్యులు రాజకీయాల్లో చక్రం తిప్పినవారే. తమకంటూ ప్రత్యేకత కలిగి ఉన్నవారే. ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తాత శేషాచలపతి రామకృష్ణ రంగారావు1932-36 మధ్య ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుజయకృష్ణ రంగారావు తండ్రి ఎస్‌విజెకె రంగారావుఎంపిగా పనిచేశారు. సుజయకృష్ణ రంగారావు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, మూడో విడత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుత కేంద్రమంత్రి అశోక గజపతిరాజు కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో ఆరితేరిన వారే. అశోక గజపతిరాజు తండ్రి దివంగత పివివి రాజు బొబ్బిలి ఎంపిగా, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన పెద్దకుమారుడు ఆనంద గజపతిరాజు మొదట్లో టిడిపిలో చేరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తరువాత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. చిన్నకుమారుడు అశోక గజపతిరాజు మొదట జనతాపార్టీ, ఆ తరువాత టిడిపిలో కొనసాగుతు వస్తున్నారు. ఎన్నికల్లో సుజయకృష్ణ రంగారావును ఓడించేందుకు పార్టీపరంగా జిల్లా టిడిపి నాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితునిగా పేరున్న రంగారావు వైఎస్ జగన్ జైలుకు వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరశైలికి నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగుతూ జగన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. జిల్లాలో తన రాజకీయ విరోధి బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన నాటినుంచి సుజయకృష్ణ రంగారావు వైఖరిలో మార్పు వచ్చింది. కొన్ని నెలల కిందటే ఆయన పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరే ఆలోచనకు వచ్చినా, ఇటు పార్టీ అధినేత జగన్ ఆయనకు నచ్చజెప్పటం, అటు టిడిపి నాయకత్వం నుంచి అనుకూల సంకేతాలు రాకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో సుజయకృష్ణ రంగారావు టిడిపిలో చేరటానికి అవకాశం ఏర్పడింది.