ఆంధ్రప్రదేశ్‌

బాబు భారీ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 1: సమర్థులను క్యాబినెట్‌లోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి బాబు నివాసం వద్ద ఆశావహుల సందడి మొదలయింది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఫలానా వారికి మంత్రి పదవులివ్వాలంటూ సిఫార్సులతో వచ్చిన సీనియర్లతో, బాబు నివాసం కోలాహలంగా మారింది. పార్టీకి తాము చేసిన సేవలు, ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఖర్చు, నాటి ప్రభుత్వం నుంచి ఎదురైన కష్టాలను వారంతా బాబు వద్ద ఏకరవు పెట్టారు. అయితే, బాబు ఎవరినీ నిరుత్సాహ పరచకుండా అంతా సావధానంగా విని, చూద్దామమ్మా.. అన్నీ నాకు తెలుసుకదా? నేను చూసుకుంటా నాకు వదిలేయండి, నా ఇబ్బందులనూ మీరు గమనించాలని భుజం తట్టి పంపటంతో, ఆ సంకేతాలను ఏవిధంగా అర్థం చేసుకోవాలో తెలియక కొందరు, అనుకూలంగా స్పందించారని ఇంకొందరు ఎవరి భాష్యాలు వారు విశే్లషించుకుని వెళ్లారు. తర్వాత 3 గంటల వరకూ బాబు ఒంటరిగానే కసరత్తు చేశారు. ఈ సందర్భంగా లోపలికి వెళ్లి వచ్చిన వారిని బయట ఉన్న ఎమ్మెల్యేలు, మీడియా ప్రశ్నించగా ‘మీకు సార్ సంగతి తెలియనిదేముంది? ఇన్నాళ్లలో ఎప్పుడైనా నీకు ఇస్తాను, ఇవ్వను అని చెప్పారా? ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవడమే తప్ప మనకూ ఏమీ తెలియదు బ్రదర్’ అంటూ వ్యాఖ్యానించారు.
పయ్యావులకోసం జెసి సిఫారసు
అనంతపురం జిల్లా ఎంపి జెసి దివాకర్‌రెడ్డి కూడా బాబును కలిశారు. పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని, సమర్థులకు, ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే వారికి పదవులివ్వాలని తాను కోరగా, అన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటానని చెప్పారని మీడియాకు వెల్లడించారు. ఆయనేం చెబుతాడో మీకు తెలుసు కదా? అదే చెప్పాడు. నేను మాత్రం నేను చెప్పాల్సింది చెప్పానన్నారు.
ధూళిపాళ్ల విన్నపం
మరో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూడా బాబును కలసి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా తన పనితీరును, జిల్లా మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై చేసిన పోరాటాన్ని ఆయనకు గుర్తు చేశారు. అన్నీ విన్న బాబు కులసమీకరణలు కుదరాలి కదా? ఈ సమయంలో నన్ను ఇబ్బంది పెట్టవద్దని వ్యాఖ్యానించినట్టు సమాచారం. బాబు నుంచి ఆశించిన స్పందన కనిపించనట్లు బయటకు వచ్చిన తర్వాత ధూళిపాళ్ల భావోద్వేగాలను బట్టి స్పష్టమయింది.
శివాజీ అసంతృప్తి
శ్రీకాకుళం జిల్లా పలాస సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ కూడా బాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆగ్రహంతో కనిపించారు. నిజానికి గౌతుకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. లోకేష్‌కు సన్నిహితుడైన గౌతు అల్లుడు వెంకన్నచౌదరికి లోకేష్ ఆ మేరకు హామీ ఇచ్చారని, కానీ బాబు మాత్రం గౌతు తనను కలసినప్పుడు తాను మంత్రి పదవి ఇవ్వలేనని చెప్పడంతో ఆయన ఆగ్రహంతో తాను ఎమ్మెల్యే పదవికి, తన కుమార్తె జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తామని చెప్పి బయటకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనితో బాబు మంత్రి అచ్చెన్నాయుడును పిలిపించి, గౌతును బుజ్జగించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తన ప్రత్యర్థి అయిన కళా వెంకట్రావుకు మంత్రి పదవి దక్కకుండా చేసేందుకే అచ్చెన్న ఈ కథ నడిపారా? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాబు శనివారం రాత్రి మూడు విడతలుగా మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తాను ఎంపిక చేసుకున్న ప్రాతిపదిక, కొత్తగా తీసుకునేవారి అవసరాలు, ఆయా జిల్లాల్లో వారి ప్రాధాన్యత, పార్టీకి వారు చేసిన సేవలు, గతంలో తాను వారికిచ్చిన మాట, పనితీరు తదితర అంశాలను వారితో పంచుకున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ప్రాతిపదికగా పనిచేస్తున్న తనకు మీరంతా సహకరించాలని, అంతా బాగా పనిచేశారని, అయితే భవిష్యత్తు అవసరాలు కూడా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.
బొజ్జలకు బాబు సారీ
మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలిసినప్పుడు మంత్రి పదవిలో కొనసాగించలేనని, పైగా మీరు ఆరోగ్యానికి ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బొజ్జల ఒకరిద్దరి వద్ద ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మంత్రి కొల్లు రవీంద్రను బాబు మందలించినట్లు సమాచారం. ఎక్సైజ్, బీసీ శాఖలిచ్చినా మీరు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారని, ఇకనైనా పనితీరు మార్చుకుని, మైలేజీ వచ్చేలా చూసుకోవాలని క్లాసు ఇచ్చారంటున్నారు.
సాయంత్రం ముఖ్యమంత్రి మంత్రులందరినీ పిలిపించి కొందరితో విడిగా, మరికొందరితో బృందాలుగా చర్చించారు. ఆ సమయంలో మంత్రి పదవులు పోనున్నాయన్న ప్రచారం ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి గైర్హాజరయ్యారు. అమరావతి నగర నిర్మాణానికి రైతుల నుంచి భూములు ఇప్పించేందుకు కృషి చేసిన తెనాలి శ్రవణ్‌కుమార్‌కు ఇవ్వాలా? లేక నక్కా ఆనంద్‌బాబుకు ఇవ్వాలా అన్న దానిపై చర్చ జరిగింది. అయితే తుది నిర్ణయాన్ని బాబుకే వదిలేశారు.
ఇక ఇద్దరు మహిళలను తొలగిస్తున్న క్రమంలో ఆ స్థానంలో భూమా అఖిలప్రియను తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించినందున, మరో మహిళ ఎవరన్నదానిపైనా చర్చ జరిగింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత లేదా ఎస్సీ కోటాలో జవహర్ పేర్లు చర్చకు వచ్చింది. ఇక ఇప్పటివరకూ మైనారిటీ నుంచి ఎవరూ లేనందున షరీఫ్, జలీల్‌ఖాన్, చాంద్‌పాషా పేర్లు చర్చకు వచ్చినప్పుడు మెజారిటీ సభ్యులు షరీఫ్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
ఇక వైసీపీ నుంచి వచ్చిన వారికి నలుగురికి మంత్రి పదవులివ్వడంపైనా చర్చ జరిగింది. ఈ పరిస్థితిలో అంతమందికి పదవులివ్వడం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమయింది.
రావెల అసహనం
బాబును కలిసి బయటకు వచ్చిన మంత్రి రావెల కిశోర్‌బాబును మీరు రాజీనామా చేశారట కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ కూర్పు అనేది సీఎం ఇష్టం.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. ఇక చివరలో యనమల, లోకేష్‌తో చర్చించిన బాబు మంత్రివర్గ కూర్పును ఖరారు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత గవర్నర్‌కు తుది జాబితా పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.