ఆంధ్రప్రదేశ్‌

మిర్చి రైతులకు తీపికబురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: మిర్చి రైతుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది. రెండు నెలలుగా సీజన్ ప్రారంభం నుంచి ధరలు పూర్తిస్థాయిలో పతనమైన నేపథ్యంలో రైతులు రోడ్డెక్కారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు నిబంధనలు అడ్డంకి కావడంతో ప్రభుత్వం కేంద్రానికి వివరించే ప్రయత్నం చేసింది. దీంతో మిర్చి రైతులు గుంటూరు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మిర్చి రైతులు గుంటూరులో యార్డు ఎదుట ఆందోళనలు నిర్వహించారు. అటు కోల్డు స్టోరేజీలలో నిల్వచేసే వీలులేక.. ఇటు గిట్టుబాటు ధర రాక రైతులు సొమ్మసిల్లారు. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లకు సాంకేతిక కారణాలు అవరోధంగా మారాయి. రాష్టవ్య్రాప్తంగా 12 లక్షల క్వింటాళ్లకు పైగా మిర్చి నిల్వలు పేరుకుపోయాయి. క్వింటాల్‌కు 3 నుంచి 6 వేల ధరతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల దళారులు లబ్దిపొందుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ధరల్లో వ్యత్యాసం తొలగిపోయేంత వరకు మిర్చి రైతులకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 500 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
వ్యాపారులు చెల్లించే ధరతో పాటు ప్రభుత్వం మద్దతుధర తరహాలో క్వింటాల్‌కు రూ. 15 వందలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీనిపై త్వరలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మల్లికార్జునరావు ఈ విషయమై అధికారులు, ఏఎంసి పాలకవర్గంతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే రైతుల వద్ద ఉన్న మిర్చిని ఆంక్షలులేకుండా పూర్తిస్థాయిలో కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కాగా అర్హులైన మిర్చి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వ ఆర్ధికసాయాన్ని జమచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మిర్చిని యార్డులో కొనుగోలు చేయాలా లేక ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలా అనే విషయమై స్పష్టత రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది. ఎంతవరకు వెసులుబాటు కలుగుతుందనే విషయమై నియమ, నిబంధనలను మూడురోజుల్లో రూపొందించనున్నట్లు మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. ఇదిలా ఉండగా గిట్టుబాటుధర కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలను గురువారం రామకృష్ణ రైతులకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు.

చిత్రం..మిర్చి రైతులకు రాయితీ విధివిధానాలపై చర్చిస్తున్న మార్కెటింగ్ కమిషనర్
మల్లికార్జునరావు, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు