ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లుగా దాఖలుకాని చార్జిషీటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: గోదావరి నది మహా పుష్కరాల నిర్వహణలో అధికారుల అవగాహన లోపం..ఆపై అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు అధికారులను వెంటాడుతూనే వున్నాయి.. గోదావరి నది పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రెండేళ్లుగా పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయలేకపోయారు. నేటికీ దర్యాప్తు పూర్తి కాలేదు. వాస్తవానికి రెండు మూడు నెలల్లోనే ఏ కేసులోనైనా ఛార్జిషీటు దాఖలు చేయాల్సివుంది. కానీ పుష్కర తొక్కిసలాట ఘటనపై ఇంకా దర్యాప్తుకూడా పూర్తికాకపోవడం విచిత్రం. పుష్కర తొక్కిసలాట ఘటనపై నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ కీలకదశకు చేరింది.కానీ పోలీసులు మాత్రం రెండేళ్లుగా దర్యాప్తు సాగిస్తూ ఇంకా ఛార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. 2015 జూలై 14న గోదావరి పుష్కరాలు ప్రారంభమైన కొద్ది గంటలకే రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌వద్ద సంభవించిన తొక్కిసలాట ఘటనలో 28 మంది భక్తులు మృతిచెందగా, 51 మంది గాయపడిన సంగతి విదితమే. ఈ తొక్కిసలాట ఘటనపై రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 174 ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తు ఇప్పటికీ పూర్తికాలేదు. ఇప్పటికీ వరకు పోలీసులు తమ దర్యాప్తులో సుమారు 170 మందిని విచారించినట్టుగా చెబుతున్నారు. మరి ఇంతమంది ఎవరిని విచారించారో తెలియదుగానీ జస్టిస్ సి వై సోమయాజులు విచారణ కమిషన్ ముందు మాత్రం ఒప్పుకున్నారు. జస్టిస్ సి వై సోమయాజులు కమిషన్ 2015 సెప్టెంబర్ 29న బాధ్యతలు చేపట్టింది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో సుమారు తొమ్మిది సార్లు విచారణ చేపట్టింది. ప్రభుత్వం బాధితుల తరపున వాదనలు విని తన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. కమిషన్ గడువు ఇప్పటికే చాలాసార్లు పొడిగిస్తూ ప్రభుత్వం జీవోలు జారీచేసింది. ఈసారి కమిషన్ కోరితే మరోసారి విచారణ గడువు పెంచవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటి వరకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 29వ తేదీతో కమిషన్ విచారణ గడువు పూర్తికానుంది. దర్యాప్తు ఏమైందని కమిషన్ జస్టిస్ సి వై సోమయాజులు విచారణ సందర్భంగా పోలీసు అధికారులను ప్రశ్నించారు. అయితే ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని పోలీసులు చెప్పడాన్ని బట్టి వారి చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఎదురైంది. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసు శాఖ ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. దీని దర్యాప్తు కోసం రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్‌ను నియమించింది. కొన్ని రోజుల తర్వాత ఆయన బదిలీపై వెళ్ళారుః. దరిమిలా ఈ కేసును అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్యకు అప్పగించారు. పోలీసులు తమ దర్యాప్తును త్వరగా పూర్తిచేసి ఛార్జిసీటు దాఖలుచేసివుంటే కమిషన్‌కు ఉపయోగకరంగా ఉండేది. అయితే కమిషన్‌కు పూర్తి ఆధారాలు సమర్పించకుండా అన్ని ప్రభుత్వ శాఖలు తమ వద్దవున్న ఆధారాలను తొక్కిపెట్టాయని ఇప్పటికే బాధితుల తరపు న్యాయవాదులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అదే తరహాలో పోలీసులు కూడా నాన్చివేత ధోరణి అవలంబించారు. 172 సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. వీటి పుటేజీ తమ వద్ద లేవని పోలీసులు చెప్పడాన్ని రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. సిసి పుటేజి మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఎప్పటికీ దర్యాప్తు పూర్తిచేస్తారో, ఛార్జిషీటు వేస్తారో ఇప్పటికీ స్పష్టతలేదు. త్వరలో ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్న నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసులు ఛార్జిషీటు వేయాలని బాధితుల తరపు న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు డిమాండ్ చేశారు.