ఆంధ్రప్రదేశ్‌

గ్రీన్ ఎనర్జీ సిటీగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 25: విద్యుత్ సంరక్షణ, పొదుపుతో సహా ఈ రంగంలో అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ సాధించిన గణనీయ విజయాలు కేంద్ర ఇంధన రంగ సంస్థలను ఆకర్షించేలా చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానంతో భాగస్వామి అయ్యేందుకు దాదాపు 100 దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసిన ప్రఖ్యాత ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టెరి) ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలకు సంపూర్ణ సహకారమందిస్తామంటూ టెరి డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ స్పష్టం చేశారు. అమరావతిని గ్రీన్ సిటీగా మలిచేందుకు కృషి చేస్తున్న రాజధాని నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ)తో కలసి అడుగులు వేసేందుకు టెరి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సిఆర్‌డిఎ చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేందుకు ‘టెరి’ ముందుకు రావడంపై రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ హర్షం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో అజయ్ జైన్ పాల్గొన్నారు.
కర్బన ఉద్గారాల వ్యాప్తిని గణనీయంగా తగ్గించి వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ‘టెరి’ మద్దతు తెలపడం అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగుగా సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ (ఎన్‌ఆర్‌ఈ), బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (టీఈఈ) ఇప్పటికే రాష్ట్రానికి ఇంధన పొదుపు, సంరక్షణలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు ‘టెరి’ కూడా జత కలిసింది. సిఆర్‌డిఎ పరిధిలో అంతర్జాతీయ స్థాయి అధ్యయన కేంద్రాన్ని ‘టెరి’ ఏర్పాటు చేయనున్నది. దానికన్నా ముందే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, మలేషియా, యుఏఇ వంటి దేశాల్లో పర్యటించి గ్రీన్ ఎనర్జీ నగరాల వృద్ధిలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా పంపనున్నది. ఈ నివేదికలలో ఏది అమరావతికి ఉపయోగపడుతుందో, దానిని ఎంపిక చేసి అమలు చేస్తుంది. ‘టెరి’ డెరెక్టర్ జనరల్ మాథుర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం మే 3వ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానుంది.
ఢిల్లీలోని ‘టెరి’ కార్యాలయంలో అజయ్ మాథుర్‌తో మంగళవారం అజయ్ జైన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం భేటీ అయ్యింది. ఈ భేటీలో సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇంధన, సిఆర్‌డిఎ సలహాదారు ఎ.చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఈ సందర్భంగా అజయ్ జైన్ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాదక్షత కారణంగా సిఆర్‌డిఎ పరిధిలో రూ.1,37,832 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయని, ఈ ఒప్పందాలన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయని శ్రీధర్ చెప్పారు. మే 15 నాటికి అమరావతి తుది మాస్టర్ ప్లాన్ ఎంపిక పూర్తవుతుందని అన్నారు. రాష్ట్రంలో టెరి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కమిషనర్ ఆహ్వానించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అమరావతి సాధించిన ప్రధాన అభివృద్ధి అంశాల గురించి వివరించారు.