ఆంధ్రప్రదేశ్‌

కార్టూనిస్టుగా బిపి ఆచార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య వివిధ అంశాలపై వేసిన కార్టూన్లకు, పద్య కవితలకు అపూర్వ ఆదరణ లభించింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్-3లో గల జర్నలిస్టుల కాలనీలో గోతె-జంట్రుమ్ హాలులో మంగళవారం బిపి ఆచార్య కార్టూన్లు, పద్య కవితల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అనధికారులు తరలి వచ్చి ఆయన్ను అభినందించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాప్నె రెబెల్లో ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మాటలతో చెప్పలేని అనేక రకాల భావాలను కార్టూన్‌ల ద్వారా చెప్పవచ్చని, ఆ విధంగా ఆచార్య చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు వేసిన కార్టూన్లను, రాసిన కవితలను పుస్తక రూపంలో తీసుకుని రావాలని ఆమె సూచించారు.
1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బిపి ఆచార్య పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు గోల్కొండ కోటకు అద్భుతమైన లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయించారని ఆమె చెప్పారు. ఒక మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా పని చేశారని ఆమె తెలిపారు. ప్రముఖ రచయిత నరేంద్ర లూథర్ ప్రసంగిస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత కూడా కవితలు రాయాలని, కార్టూన్లు వేయాలని ఆచార్యను కోరారు. బిపి ఆచార్య ఆకాంక్ష మేరకు భవిష్యత్తులో యుఎన్ సెక్రటరీ జనరల్ కావాలని కోరుకుంటున్నానని ఆయన అనగానే సభికులు కరతాళధ్వనులు చేశారు.
బిపి ఆచార్య ప్రసంగిస్తూ 40 ఏళ్ళుగా వెయ్యికి పైగా కార్టూన్లు వేశానని చెప్పారు. వీటిలో వందకు పైగా వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయని ఆయన తెలిపారు. అయితే ఐఏఎస్‌గా ఎంపికైన తర్వాత కొన్ని నియమాలు ఉంటాయని, రాజకీయంగా ఎవరిపైనా కార్టూన్లు వేయలేమని అన్నారు. ప్రజలతో, అధికారులతో మమేకమైన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కార్టూన్లు వేశానని ఆయన తెలిపారు. తాను కార్టూన్ ప్రదర్శన ఏర్పాటు చేయడం ఇది రెండవసారి అని ఆయన తెలిపారు. చిన్నతనం నుంచే కార్టూన్లు వేయడం ప్రారంభించానని, ఆ రోజుల్లో స్కెచ్చెస్ కూడా లేవని, నీలి, ఎరుపు రంగులను మాత్రమే వాడానని అన్నారు. ఆర్‌కె లక్ష్మణ్ తనకు స్ఫూర్తి అని ఆచార్య చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారి గోయల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా మంచి కవి, రచయిత అని చెప్పారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కెసిఆర్ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆయన అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాపారావు, జివిఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిపి ఆచార్య కవితలు, కార్టూన్ల పుస్తకాన్ని తీసుకుని రావాలని ఉన్నతాధికారులు తమ ప్రసంగాల్లో కోరారు.
ఇలాఉండగా ఈ ఎగ్జిబిషన్‌ను వచ్చే నెల 2వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్‌లో మంగళవారం తాను వేసిన కార్టూన్లు,
రచించిన పద్య కవితలను ప్రదర్శించి ప్రసంగిస్తున్న ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య