అనంతపురం

ఆశల ‘కియా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 27 : కొరియా దేశానికి చెందిన ఆటోమోబైల్ దిగ్గజం కియా కార్ల కంపెనీ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు (పరస్పర అంగీకార ఒప్పందం) కుదుర్చుకోవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాష్ట్రంలో ఆటోమోటివ్స్ ఏర్పాటుపై చర్చించడంలో భాగంగా కొరియా దేశానికి చెందిన కియా మోటార్స్ కార్పొరేషన్‌కు కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఎంఓయూపై సంతకాలు చేశారు. జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, కలెక్టర్ జి.వీర పాండ్యన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ను కియో కార్ల కంపెనీ ఏర్పాటు పనుల పురోగతిని సమీక్షించడానికి నోడల్ అధికారిగా నియమించారు. పెనుకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎర్రమంచి గ్రామంలో ఈ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల కార్ల ఏజెన్సీలు మాత్రమే ఉన్న జిల్లాలో ఆటో మొబైల్ రంగంలో మొట్ట మొదటిసారి కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుండటం విశేషం. 2019 నాటికి ట్రయల్ ప్రొడక్షన్ (ప్రయోగాత్మక ఉత్పత్తి)ను ప్రారంభించాలని ప్రభుత్వం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి 3 లక్షల కార్లు తయారు చేసే సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆటో మొబైల్- ఆటో కాంపొనెంట్ పాలసీ-2015కు అనుగుణంగా జిల్లాలో కార్ల కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలో స్థానికంగా 95 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో జిల్లా నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే మెకానికల్, కంప్యూటర్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్ తదితర అనేక విభాగాలతోపాటు వాహనాల అసెంబుల్‌కు, కార్యాలయ అవసరాలు, ట్రాన్స్‌పోర్ట్, ఇతరత్రా పనులు చేసేందుకు ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు అవసరమవుతారు. 4వేల మందికి శాశ్వత ప్రాతిపదికన, 7వేల మందికి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. కాగా ప్రభుత్వం, జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు స్పందించి కియా కార్ల కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. ఎందుకంటే 2019లో ప్రయోగాత్మకంగా కార్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని చెబుతున్నా, ఏనెలలో అన్న విషయం స్పష్టత లేదు. అదే ఏడాది, లేదా అంతకన్నా ముందుగానే రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోపు కియో కంపెనీ పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. అదే వేగంతో కార్ల ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో కోడ్ ఉండటం, ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకపోవడం వల్ల ఎన్నికల ముందే ఫ్యాక్టరీని ప్రారంభించాల్సి ఉంటుందని జిల్లా నిరుద్యోగ యువత ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు పలు కొత్త కంపెనీలు, సంస్థలు తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. వాటి కొన్ని అతీగతీ లేకుండా పోయాయి. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు అటకెక్కింది. అలాగే పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తామంటున్న విమానాల విడి భాగాల తయారీ-మరమ్మతు కేంద్రంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక గార్మెంట్ పరిశ్రమ రంగంలో పరిశ్రమల ఏర్పాటు కూడా నత్తనడకన సాగుతోంది. ఉరవకొండ, పామిడి తదితర ప్రాంతాల్లో గార్మెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా ఔత్పాహికలకు పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదన్న విమర్శలు లేకపోలేదు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు కాగితాలకే పరిమితమవుతూ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు పలు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు కూడా తూతూ మంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలూ లేకపోలేదు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల దరఖాస్తుల్ని జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా పరిశీలించడం, అవసరమైన అనుబంధ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులపై అవగాహన కల్పించి సమన్వయంతో తగిన సహకారం అందించడం జరుగుతోంది. అయితే ప్రభుత్వం కాగితాల్లో చూపినంత వేగంగా క్షేత్ర స్థాయిలో పనులు సాగడం లేదన్న ఆరోపణలున్నాయి.
ప్రేక్షకుడి బలి!
* భారీగా బాహుబలి-2 టికెట్ ధర పెంపు
* రూ.2000 వరకూ విక్రయం

అనంతపురం, ఏప్రిల్ 27 : కొత్త సినిమా అనగానే ప్రేక్షకులు మొదటి షో చూడాలనుకోవడం సహజం. అయితే ఆ కోరిక బాహుబలి చిత్రం విషయంలో రెట్టింపు అయింది. బాహుబలి-2 చిత్రాన్ని వీక్షించడానికి అభిమానులు, ప్రేక్షకులు అత్యధిక ఉత్సాహంతో టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఉత్కంఠ నేపథ్యంలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు పోటీ పడుతున్నారు. ఈనేపథ్యంలో మూడు, నాలుగు రోజుల నుంచే సినిమా ప్రదర్శించే థియేటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శనివారానికి కూడా బుధవారం రోజే టికెట్లు విక్రయించడం విశేషం. కాగా సినిమాకు డిమాండ్ పెరగడంతో పాటు సినిమా కొనుగోలు సొమ్ము రాబట్టుకోవడానికి నిబంధనల్ని తుంగలో తొక్కేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పటికే అమ్మిన టికెట్లపై ధరలు ముద్రించలేదు. అంతేగాకుండా ఆట, సీట్ నంబరు, సమయం తప్ప ధర లేకపోవడం గమనార్హం. ఇలా థియేటర్ యాజమాన్యాలు అమాంతం టికెట్ల ధరలు పెంచేసి పబ్లిక్‌గా దోపిడీకి తెరలేపాయని చెప్పవచ్చు. అయినా రెవెన్యూ యంత్రాంగం సైతం చేష్టలుడిగి ఉండిపోయే పరిస్థితి నెలకొంది. తమకు ఫిర్యాదులొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూ ఉన్నతాధికారులు చెప్పడం విశేషం. కాగా రెండు రోజులుగా టికెట్ల ధరలు తగ్గించాలని పలు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఆందోళనకారుల్ని అరెస్టు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారే తప్ప టికెట్ల ధరల నియంత్రణ, మామూలు రేట్లకే విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలోని రెండు, మూడు ప్రధాన థియేటర్లతోపాటు ఇతర థియేటర్లలో కింది క్లాస్ టికెట్‌ను కనీసం రూ.200కు ఆపైన రూ.500, రూ.1000 వరకు టికెట్లు విక్రయించారు. థియేటర్ల సౌకర్యాన్ని బట్టి రూ.2000 వరకు కూడా విక్రయించినట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం సైతం ఏపిలో రోజుకు 5 ఆటలకే అనుమతిచ్చింది. బెనిఫిట్ షోలు వేయరాదని ఆదేశించింది. అధిక ధరకు టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం రెవెన్యూ అధికారులు నామమాత్రపు ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు. కాగా బాహుబలి-2 సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు భారీగా ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. దీంతో గురువారం రాత్రి నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది.
భగవన్నామమే ముక్తిమార్గం
* దత్తవిజయానంద తీర్థ స్వామీజీ
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 27: భగవన్నామమే ముక్తికి మార్గమని మైసూరు దత్తపీఠం శ్రీ దత్తవిజయానంద తీర్థ స్వామీజీ అన్నారు. ఈమేరకు గురువారం నగరానికి విచ్చేసిన స్వామీజీ దత్తమందిరంలో భక్తులనుద్దేశించి ఉపన్యసించారు. భగవన్నామ సంకీర్తనలో ప్రతి భక్తుడు పాల్గొనాలని, దీని ద్వారా అహంకారము తొలగిపోతుందన్నారు. ప్రతి ఒక్కరు దాన గుణాన్ని అలవరుచుకోవాలన్నారు. కనీసం ప్రతి రోజు మనం అన్నం వండుకునే ముందు ఆ బియ్యం నుండి పిడికెడు బియ్యం పక్కకు తీసి ఉంచాలని, వాటిని దత్త మందిరాల్లో ఇచ్చినట్లయితే వాటిని ప్రసాదం చేసి భక్తులకు పంచడం జరుగుతుందన్నారు. మే 6వ తేదీ నుండి నెల రోజులపాటు మైసూరు దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 75వ జన్మదినం సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 30న బొమ్మేపర్తిలో శ్రీ జయలక్ష్మీ మాత ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు స్వామి తెలిపారు. స్వామీజీకి భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో స్వామీజీ పాల్గొన్నారు.

2020కి
చైనా సిల్క్ దిగుమతి ఆపేస్తాం
* సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఛైర్మన్ హనుమంతరాయప్ప
కదిరి, ఏప్రిల్ 27: మీ అందరి సహకారంతో 2020 సంవత్సరానికల్లా చైనా సిల్క్ దిగుమతి ఆపేస్తామని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఛైర్మన్ కె.యం హనుమంతరాయప్ప పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి పారిశ్రామికవాడలో నాలుగు మల్టీ ఎండ్ యూనిట్లు, సిల్క్ స్పిట్టింగ్ యూనిట్లను సిల్క్ బోర్డు ఛైర్మన్‌తోపాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాలు ప్రారంభించారు. అనంతరం పట్టుగూళ్ల విక్రయ కేంద్రంలో సిల్క్ రీలర్లు, రైతులతో కలిసి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు కదిరి ప్రాంతంలో పట్టు పరిశ్రమ సాగుతో రీలర్లు, రైతులు, కూలీలు కళకళలాడేవారని చెప్పారు. అయితే అతివృష్టి ప్రభావంతో పట్టు పరిశ్రమ పడిపోయిందని తెలిపారు. వీటిని పునరావృతం చేస్తూ పూర్వవైభవం రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రూపంగా 75 శాతం అందిస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా ఈ పట్టుతో చైనా సిల్క్‌కు మించి పట్టు రాబడితే ఇతర దేశాలకు కూడా సరఫరా చేసే స్థాయికి ఎదుగుతామని, వీటన్నింటికీ అందరి సహకారం అవసరమన్నారు. అనంతరం ఏడుగురికి షెడ్ల నిర్మాణం కోసం చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టు సెరికల్చర్ జెడి అరుణ, శాస్తవ్రేత్త మనోహర్‌రెడ్డి, అసదుల్లా, రీలర్లు తదితరులు పాల్గొన్నారు.

పిడుగుపాటుకు మేకల కాపరి మృతి
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 27 : మండల పరిధిలోని కోడిపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి ఓబుళపతి (38) గురువారం సాయంత్రం పిడుగుపాటుకు మృతి చెందాడు. ఓబుళపతి రోజూ లాగే ఉదయం ఓబుళపతి మేకలను అడవికి తీసుకుపోయాడు. అయితే సాయంత్రం పిడుగులతో వర్షం కురవడంతో మేకల మంద వద్ద ఉన్న ఓబుళపతి పిడుగుపాటుకు మృతి చెందాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. రూరల్ పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నగరపాలక సంస్థ పాలనపై
శే్వతపత్రం విడుదల చేయాలి
* పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్
అనంతపురంటౌన్, ఏప్రిల్ 27: అస్తవ్యస్థ నగరపాలక సంస్థ పాలనపై శే్వతపత్రం ప్రకటించాలని పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావుకాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైపులైను పనుల పేరుతో ఇష్టారాజ్యంగా రహదార్లను తవ్వి వేశారన్నారు. పైపులైను పనులు జరుగుతాయని తెలిసి కూడా లక్షల రూపాయల ప్రజా ధనం వెచ్చించి సిమెంటు రోడ్లు వేసిన కొన్ని రోజులు కూడా కాకుండానే తవ్వివేశారన్నారు. కేవలం కాసుల కక్కుర్తితోనే అభివృద్ధి పనులు చేస్తున్నారన్న చర్చ ప్రజలలో సాగుతోందన్నారు. ఏపుగా పెరిగిన చెట్లను సైతం విచ్చలవిడిగా నరికివేస్తుంటే అటవీ శాఖ చోద్యం చూస్తోందన్నారు. చెట్లు నరికి వేయిస్తున్నా మున్సిపల్ అధికారుల చర్యలను నిరోధించటంలో వైఫల్యం చెందారన్నారు. భానుడి ప్రతాపానికి ప్రజలు తల్లడిల్లుతున్నారని అన్నారు. నీడనిచ్చే చెట్లు లేక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. పైపులైను పనులు పూరె్తైన తర్వాత మీటర్లు పెట్టి ముక్కుపిండి తాగునీటి బిల్లులు వసూలు చేస్తారన్నారు. కాసులు కాంట్రాక్టర్లకు మున్సిపాలిటీ అప్పులు ప్రజలపై మోపనున్నారని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న కమిషనర్ వివాదాస్పద రెండున్నర కోట్ల బిల్లులు ఇవ్వటానికే వస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. అధికార పాలకవర్గం మూడు గ్రూపులుగా విడిపోయి కాసుల కోసం కొట్లాడుకుంటూ బజారున పడ్డారని అన్నారు. దూరదృష్టి కలిగిన వ్యక్తిగా చెప్పుకునే చంద్రబాబునాయుడి దృష్టికి అధికార పార్టీ నేతల అవినీతి భాగోతం కళ్లకు కనపడటం లేదాయని ప్రశ్నించారు. రహదార్ల విస్తరణ, అభివృద్ధి పేరుతో రోడ్లను వంపులు తిప్పుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పాలకవర్గంపై చర్యలు తీసుకోవటానికి ఎందుకు వెనుకాడుతున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజా ధనం లూటీ చేయటాన్ని ఆపకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు వాసు, దాదాగాంధీ, సత్యనారాయణ, రమణ, రామాంజనేయులు పాల్గొన్నారు.
పవర్‌లూమ్స్ పరిశ్రమలపై
ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
ధర్మవరం, ఏప్రిల్ 27: ధర్మవరం పట్టణంలో గురువారం పవర్‌లూమ్స్ పరిశ్రమలపై చెన్నై, తిరుపతికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ, ఏడి పుల్లయ్యల ఆధ్వర్యంలో పలువురు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టణంలో పలుచోట్ల పవర్‌లూమ్స్‌పై దాడులు నిర్వహించారు. ఇందిరమ్మ కాలనీ ఎదురుగా వున్న టౌన్‌బ్యాంక్ అధ్యక్షులు పరిశె సుధాకర్ పవర్‌లూమ్స్ పరిశ్రమతోపాటు శివానగర్, రేగడి తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా పవర్‌లూమ్స్ పరిశ్రమలో పట్టుచీరలు నేస్తున్నారా? అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. అలాగే చీరల్లో పట్టుదారం ఎంత శాతం, శిల్క్ ఎంత శాతం వాడుతున్నారన్న విషయాన్ని అక్కడికక్కడే పరిశీలించారు. పరిశె సుధాకర్ పవర్‌లూమ్స్ పరిశ్రమలో వారు చీరలతోపాటు వాడుతున్న దారాన్ని పరిశీలించారు. అందులో 50 శాతం లోపే పట్టుదారం వున్నట్లు గుర్తించారు. పూర్తి పట్టుచీరలు మరమగ్గాల్లో నేయరాదని అధికారులు యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా పవర్‌లూమ్స్ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని, పట్టణంలో పవర్‌లూమ్స్ ఏర్పాటుకు అధికారికంగా 1986లోనే ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని సుధాకర్‌తోపాటు మరమగ్గాల కమిటీ అధ్యక్షులు గిర్రాజు రవి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. అయితే ఇది ప్రభుత్వం నిర్ణయం మేరకే వుంటుందని అధికారులు వారికి తెలిపారు.
పవర్‌లూమ్స్ ఏర్పాటుకు
అనుమతి లేదు : ఎడి పుల్లయ్య
ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ నిబంధనల మేరకు మరమగ్గాల ఏర్పాటుకు అనుమతులు లేవని ఎడి పుల్లయ్య దాడుల అనంతరం విలేఖరులకు తెలిపారు. ఇటీవలె ఆర్‌డిఓ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు మరమగ్గాలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగిందని, ఆ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్ళడం, తదుపరి తమకు ఆదేశాలు రావడంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అయితే పట్టణంలో పవర్‌లూమ్స్ పరిశ్రమకు అనుమతులు లేవన్న ఎడి పుల్లయ్య పవర్‌లూమ్స్ పరిశ్రమపై దాడులు చేసి అనుమతులు లేనపుడు వాటిని ఎందుకు సీజ్ చేయలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానాన్ని దాటవేశారు.
మాదిగల పట్ల చంద్రబాబు నిర్లక్ష్యం
* ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ
హిందూపురం టౌన్, ఏప్రిల్ 27 : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో మాదిగ ఓటు బ్యాంకు ను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ విమర్శించారు. గురువారం స్థా నిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మం త్రివర్గంలో మాదిగల ప్రాతినిథ్య లేకు ండా చేయడం బాధాకరమన్నారు. గతంలో మంత్రిగా ఉన్న రావెల కిషోర్‌బాబును తప్పించి ఆ స్థానాన్ని తి రిగి మాలలకు కట్టబెట్టారన్నారు. రాజధాని అమరావతిని సైతం మాలలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. మాదిగల ఉనికిని దెబ్బతీసేలా ప్రభు త్వం వ్యవహరిస్తోందన్నారు. మాదిగ ల పక్షాన నిలబడి మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా అటు అసెంబ్లీ ఇటు బయట ఎలాంటి ప్రకటనలు చేయకుండా వౌనంగా ఉంటున్నారన్నారు. తక్కువ జనాభా ఉన్న మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఇందులో భాగంగా మాదిగల ఉనికిని చాటుకోవడానికి జూలై 7న అమరావతిలో పెద్ద ఎత్తున కురుక్షేత్ర జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుండి మాదిగలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆంజనేయులు, శేఖర్, లాయర్ విశ్వనాథ్, ప్రకాశ్, ఉదయ్, బాబయ్య, మోదా శివ, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల రిలే దీక్షలు విరమణ
* నేటి నుంచి సామూహిక సెలవులో సిబ్బంది
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 27: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సిబ్బంది వేతనాలు, పదోన్నతులు, పే రివిజన్ కోరుతూ గత మూడు రోజలుగా బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్‌రావ్ మాట్లాడుతూ ప్రధానంగా సిబ్బందికి సంస్థ యాజమాన్యం ఇ 2, ఇ 3 వేతనాలు చెల్లించాలని కేంద్రానికి నివేదిక అందించినప్పటికి, కేంద్రం ఇ 1, ఇ 2 మాత్రమే ఇస్తామంటూ చెప్పటం సమంజసం కాదన్నారు. దీనిని సాధించటానికి ఈ నెల 28న తమ సిబ్బంది దేశ వ్యాప్తంగా సామూహిక సెలవులోకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌రెడ్డి, లింగమయ్య, రామాంజనేయరెడ్డి, డిఇ బాలయ్య, బాలగంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
* ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రి, ఏప్రిల్ 27: మునిసిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యకు నివారణ చర్యలు తీసుకుంటున్నామని శాసన సభ్యులు జెసి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి హాజరైనారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గండికోట, చాగల్లు రిజర్వాయర్‌ల నుంచి నీటిని తీసుకురావడానికి పైపులైను పనులు జరుగుతున్నాయని, ఐదు రోజుల్లో పైపులైను పనులు పూర్తవుతాయని, పట్టణంలో తాగునీరు సరఫరా అవుతుందన్నారు. రాష్ట్రంలో అమృత్ పథకంలో ఏ పురపాలికకు మంజూరు కానటువంటి నిధులు తాడిపత్రి పురపాలక సంఘానికి మంజూరైనాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌టిసి కమిటీ ద్వారా రూ.89.82 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.39 కోట్లు మంజూరు చేసాయని, తాడిపత్రి మునిసిపాలిటీ 10శాతం నిధులు పెట్టాలన్న నియమం పెట్టారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వ్యయాన్ని భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో 38 అంశాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సమావేశంలో మునిసిపల్ కమిషనర్(ఎఫ్‌ఎసి) రఘుకుమార్, మునిసిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నూతనంగా ఎంపికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
ఇటీవల మునిసిపాలిటీలో 4, 6 వార్డులలో జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. మునిసిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో గురువారం 4వ వార్డులో విజయం సాధించిన లక్ష్మిదేవి, 6వ వార్డులో ఏకగ్రీవంగా ఎంపికైన రసూల్‌బీలతో చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి ప్రమాణస్వీకారం చేయించారు.
వైభవంగా గంగాధరేశ్వరస్వామి హోమాలు
అమరాపురం, ఏప్రిల్ 27 : మండల పరిధిలోని హల్కూరులో వెలసిన గంగాధరేశ్వరస్వామికి గురువారం తెల్లవారుఝాము నుంచి గణపతి, నవగ్రహ, రుద్రహోమాలు, పూర్ణాహుతి వంటి పూజలతోపాటు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులచే లలితా సహస్ర నామ పారాయణంగావించారు. అర్చకులు లక్ష్మీకాంతరావు, నాగేంద్ర స్వామిజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాద పంపిణీ, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్లు సుధ, లీలావతి, విశ్రాంత ఇంజినీర్ లింగన్న పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య
బ్రహ్మసముద్రం, ఏప్రిల్ 27: మండల కేంద్రంలోని కోనాపురం గ్రామంలో కురబ అనూష(20) గురువారం ఉదయం కడుపునొప్పి తాళ లేక తమ ఇంటి పైకప్పుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. తన భర్త తిమ్మరాజు, స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆమెకు తీవ్ర కడుపునొప్పి తరచుగా వస్తుండేదని తెలిపారు. అదేవిధంగా ఈమెకు పెళ్ళి అయి 7 సంవత్సరాలు అయినా పిల్లలు కలగకపోవడంతో మనస్తాపం చెందిందని వారు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి తహశీల్దార్ సుబ్రమణ్యం పంచనామా చేసి అనంతరం పోస్టుమార్టంకు కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు.
ప్రియుడి ఇంటి ముందు
ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ, ఏప్రిల్ 27 : పెళ్లి చేసుకోలేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని షెక్షానుపల్లి తండాలో గురువారం చోటు చేసుకుంది. షెక్షానుపల్లి తండాకు చెందిన వంశీకృష్ణానాయక్, అదేగ్రామానికి చెందిన సుశీల ప్రేమించుకున్నారు. ఇరువురూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే గురువారం వంశీకృష్ణానాయక్ ఇంటికి వెళ్లి పెళ్లిచేసుకోవాలని సుశీల ఒత్తిడి చేసింది. అయితే వంశీకృష్ణానాయక్ బంధువులు నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. అక్కడ వంశీకృష్ణానాయక్ బంధువులు సుశీలపై మండిపడడంతో అక్కడి నుంచి ఇంటి వద్దకు వచ్చి ఇంటిలో ఉన్న కిరోసిన్ వేసుకుని నిప్పు పెట్టుకోవడానికి యత్నించింది. గమణించిన బంధువులు చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆగ్రహించిన సుశీల బంధువులు వంశీకృష్ణానాయక్‌పై దాడికి యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వంశీకృష్ణకు గాయాలయ్యాయి. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పండితులకు
పదోన్నతులు కల్పించాలి
అనంతపురం సిటీ, ఏప్రిల్ 27: భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని పలువురు వక్తలు కోరారు. గురువారం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఇఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షలకు ముందు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం డిఇఓ కార్యాలయం ముందు ఆమరణ దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలకు పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డా.గేయానంద్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మహమ్మద్ జిలాన్, సికె.నాగేంద్రబాబు, గోవిందు, కవులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో పండితులు స్థానం కీలకంగా ఉందన్నారు. ఇలాంటి పండితుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భాషా పండితులు, పిఇటిలు కలిపి అప్‌గ్రేడేషన్ చేస్తూ 144 జివోను జారీ చేశారన్నారు. జివో ప్రకారం పదోన్నతులు కల్పించి అప్‌గ్రేడ్ చేయాలని డిఎస్‌సి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పదోన్నతులకు కల్పించాలంటే కొంతమంది పండితులు జిల్లాలో కోర్టు కేసులు ఉన్నాయనే సాకుతో డిఇఓ పదోన్నతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పండితులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.

ఎస్‌వి థియేటర్ ముట్టడి
ఃఅనంతపురం సిటీ, ఏప్రిల్ 27: బాహుబలి-2 సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులకు వెయ్యి రూపాయల నుండి 2 వేల రూపాయల వరకు టికెట్టు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న ఎస్‌వి థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎఐఎస్‌ఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు డిమండ్ చేశారు. ఈమేరకు గురువారం ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ నాయకులు ఆధ్వర్యంలో ఎస్‌వి థియేటర్‌ను ముట్టడించారు. ముందుగా సిపిఐ కార్యాలయం నుండి ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు ర్యాలీగా థియేటర్ వరకు ధర్నా నిర్వహంచి ముట్టడి చేశారు. నినాదాలు చేస్తూ థియేటర్ యాజమాన్యం బయటకురాకపోవడంతో ఆందోళనకారులు థియేటర్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా, అప్పటికే అక్కడికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకతుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వినోదంతో వ్యాపారం చేయడం తగదన్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సినిమా చేసే అవకాశం అందని ద్రాక్షగా మారిందన్నారు. థియేటర్‌లో కనీస సౌకర్యాలు లేకుండానే వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ మధు, మనోహర్, ఎఐవైఎఫ్ ప్రసాద్, రమణ, విద్యార్థి నాయకులు చాంద్‌బాషా, ఆనంద్, జమీర్, సంతోష్, నాగరాజు, మన్సూర్, దాదు, రాకేష్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

జి.ఓ 151 అమలుకై ధర్నా
అనంతపురంటౌన్, ఏప్రిల్ 27: కార్మికుల వేతనాల పెంపునకై జారీ చేసిన జి.ఓ 151 వెంటనే అమలుచేయాలని, పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరించే జి.ఓ 279 రద్దు చేయాలని కోరుతూ గురువారం నగరపాలక సంస్థ కార్మిక సంఘాల జె.ఎ.సి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో జెఎసి నాయకులు గోపాల్, పెన్నోబులేశు, లింగమయ్య, నరసింహులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కార్మికులకు పనికితగ్గ వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం జి.ఓ 151ను జారీ చేసిందన్నారు. అయితే ఇప్పటివరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ జి.ఓ అమలుకు అధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. కావున వెంటనే జి.ఓ అమలుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే పారిశుద్ధ్య పనులు ప్రైవేటీకరించే జి.ఓ 279ను రద్దు చేయాలని అన్నారు. ఈ జి.ఓ అమలు వలన కార్మికుల సంఖ్యను తగ్గించి అధిక పనిభారం మోపే ప్రమాదం పొంచి ఉందన్నారు. లాభార్జనే ధ్యేయంగా ప్రైవేటు వ్యక్తులు వ్యవహరిస్తారని అన్నారు. దీనివలన కార్మిక హక్కులు హరించి వేసే ప్రమాదం ఉందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని వెంటనే జి.ఓ 279 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత అధికారులకు వినతిపత్రం అందచేశారు.
ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 27: నగరంలోని అక్బర్ కంటి ఆసుపత్రిలో గురువారం ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు. ఇటీవల పరమ పిత సంఘం ఆధ్వర్యంలో శింగనమల మండలం సలకం చెరువు గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరంలో శస్త్ర చికిత్సలకు 20 మందిని ఎంపిక చేశారు. వీరికి డా. భానుమూర్తి, డా. అల్త్ఫా అక్బర్‌లు శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి ఉచితంగా కళ్లజోడు, మందులు పంపిణీ చేశారు. డాక్టర్ అక్బర్ సాబ్‌తోపాటు రిటైర్డ్ ఎఎస్‌పి అబ్దుల్ రజాక్ పంపిణీ చేశారు.
దళితుడి మృతిని రాజకీయం
చేయటం సరికాదు
* రాష్ట్ర ఓ.సి సంఘర్షణ సమితి అధ్యక్షులు సింగం సదాశివారెడ్డి
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 27: యాడికి మండలం చందన గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ అనుమానాస్పద మృతిపై దళిత నాయకులు అనవసర రాజకీయాలు చేస్తూ ఓ కుటుంబాన్ని మానసిక వేధింపులకు గురిచేయటం భావ్యం కాదని ఓసి సంఘర్షణ సమితి అధ్యక్షులు సింగం సదాశివారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 27న లక్ష్మినారాయణ అనుమానాస్పదంగా మృతి చెందటం పట్ల ఆవేదనను వ్యక్తం చేసారు. యాడికి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈలోపు అదే గ్రామానికి చెందిన కొంతమంది ఆయన అనుచరులపై దళిత నాయకులు కరపత్రాలు పంపిణీ చేయటంతోపాటు ధర్నాలు చేయటం సరియైన పద్ధతికాదని వారికి హితవు పలికారు. సమావేశంలో భాస్కర్‌రెడ్డి, సంజీవరెడ్డి, సుబ్రమణ్యంశెట్టి పాల్గొన్నారు.

మెడికల్ విద్యార్థికి బంగారు పతకం
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 27: ప్రభుత్వ వైద్య కళాశాలలోని 2011వ బ్యాచ్‌కు చెందిన వేణుగోపాల్‌రెడ్డికి ఏపి మెడికల్ కౌన్సిల్ బంగారు పతకాన్ని ఈ నెల 25న వైద్య ఆరోగ్య శాఖామాత్యులు కామినేని శ్రీనివాసులు చేతులమీదుగా అందుకొన్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్-1, పార్ట్-2లలో కళాశాలలోనే అత్యధిక మార్కులు సాధించినందుకు వేణుగోపాల్‌రెడ్డికి ఈ అవార్డు అందజేయటం జరిగిందన్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో రాష్టస్థ్రాయిలోనే అత్యధిక మార్కులు సాధించినందుకు ఎన్‌టియర్ యూనివర్శిటీ గోల్డ్ మెడల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా స్నాతకోత్సవంలో ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. అవార్డ్‌గ్రహీత వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు సహాయ సహకారాలతోనే అత్యధిక మార్కులు సాధించటం జరిగిందన్నారు. ఇక తన లక్ష్యం ఎయిమ్స్, జిప్‌మర్‌లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పిజి సీటు సాధించటమేనన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ చిట్టి నరసమ్మ, ప్రొఫెసర్ ఉషాదేవి, శ్రీనివాసన్, మల్లేశ్వరి, సాయి సధీర్, బాబు, నాగరాజు, మినిస్టీరియల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
అనంతపురం సిటీ, ఏప్రిల్ 27: జిల్లాలో వ్యవసాయ కూలీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవనలో వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు నాలుగు నెలల నుండి పనులు చేస్తున్నా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉన్న అన్ని రకాల పనులను కూలీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 సంవత్సరాల పైబడిన వ్యవసాయ కూలీలకు 3వేలు కరవు ఫించన్ ఇవ్వాలని, కోనేరు రంగారావు సిఫార్సులు అమలుచేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీల సమస్యలపై మే 28న జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిండెంట్ పి.నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, రాప్తాడు నాయకులు శ్రీకాంత్, రామకృష్ణ, ఎర్రపోతన్న, చలపతి పాల్గొన్నారు.

లక్ష్మీనారాయణ హంతకులను
కఠినంగా శిక్షించాలి
* దళిత సంఘాల నాయకులు
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 27: యాడికి మండలం చందన గ్రామానికి చెందిన మాదిగ లక్ష్మినారాయణను అతిదారుణంగా హత్య చేశారని, హంతకులను వెంటనే గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కెవిపిఎస్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లడుతూ లక్ష్మీనారాయణను హత్య చేసిన వారిని అతని భార్య ఫిర్యాదుమేరకు అరెస్ట్ చేయాలన్నారు.