ఆంధ్రప్రదేశ్‌

ఆశలతో అమెరికాకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటివరకూ జరిపిన విదేశీ పర్యటనలకు, మేలో జరపతలపెట్టిన అమెరికా పర్యటన భిన్నంగా ఉండబోతోంది. ప్రపంచశ్రేణి దిగ్గజ సంస్థల అధిపతులతో ఆయన భేటీ కాబోతున్న నేపథ్యంలో, అనూహ్య ఫలితాలు సాధిస్తారన్న అంచనా వ్యక్తమవుతోంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీటింగుల ద్వారా అనేకమంది ప్రముఖులతో బాబు బృందం భేటీ కానుంది. మే 4నుంచి 11వరకూ ముఖ్యమంత్రి బృందం జరపతలపెట్టిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటనలో, రాష్ట్రానికి మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత మూడేళ్లలో జరిపిన వివిధ విదేశీ పర్యటనలకంటే అమెరికా పర్యటన విభిన్నంగా, వినూత్నంగా కార్యక్రమాలు రూపొందించారు. సహజంగా ప్రధాని సహా ఎవరు విదేశీ పర్యటనలు వెళ్లి అక్కడి కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయినా, అది హోటళ్లకే పరిమితమవుతుంటుంది. కానీ ప్రపంచంలో అతి పెద్ద సంస్థ సిస్కో కంపెనీ అధినేత దానికి భిన్నంగా చంద్రబాబునాయుడు బృందానికి అమెరికాలోని తన నివాసంలో ఆతిథ్యం ఇవ్వనున్నారంటే, ఈ పర్యటన ఫలితాలు ఎలా ఉంటాయో అర్థమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ పర్యటనలో బాబు బృందం మొత్తం ప్రపంచంలోని 300 ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ కానుండటం ఈసారి విశేషం. యాపిల్, టెస్లా, సిస్కో, ఒరాకిల్, గూగుల్, లింగ్డిన్, ఫేస్‌బుక్ వంటి ప్రపంచశ్రేణి కంపెనీలను బాబు బృందం సందర్శించనుంది. సిస్కో సీఈఓ జాన్‌చాంబర్స్ అపాయింట్‌మెంట్ విదేశీ ప్రముఖులకు అరుదుగా లభిస్తుంటుంది. ఆయనతో ఏ సమావేశమైనా, పవర్ పాయింట్ ప్రజంటేషన్ అయినా హోటళ్లకే పరిమితమవుతుంటుంది. అలాంటి జాన్‌చాంబర్స్ బాబు బృందానికి ఏకంగా తన నివాసంలోనే డిన్నర్ మీటింగ్ ఇవ్వడం ఒక రికార్డుగా చెబుతున్నారు. ‘ఆ భేటీని రేపు ప్రపంచం మొత్తం చూడబోతోంది. ఇది మనకు తెలిసినంతవరకు ఒక అపురూప ఘట్టం. సీఎంకు ప్రపంచదేశాల్లో ఉన్న ఇమేజ్, ఆయన చూపించే చొరవకు ఇంతకంటే మరేం నిదర్శనం ఉంటుంద’ని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
8న జరిగే ఈ భేటీలో సుందర్ పిచాయ్, టిమ్‌కుక్, షెర్లీశాండ్‌బగ్, లారీ ఇల్లిసన్ వంటి ప్రముఖులు భాగస్వాములు కానున్నారు. ఇప్పటివరకూ ప్లెక్స్ ట్రానిక్స్ సీఈఓ మైక్ మెక్ సమరా, ఒరాకిల్ గ్లోబల్ సీఈఓ సఫ్రాకార్డ్‌లతో బాబు భేటీ కానున్నారు. 4న ఒరాకిల్, 5న యాపిల్, గూగుల్, 8న సిస్కో, 9న స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ ప్రతినిధులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగు ఉండబోతోంది.
గతంలో బాబు విదేశీ పర్యటనలెప్పుడూ రెండు మూడు కంపెనీలు, స్థానికంగా ఉన్న తెలుగువారితో భేటీలకే పరిమితమయ్యేవి. కానీ ఈసారి మాత్రం ఏకంగా 300 మంది కంపెనీ ప్రముఖులతో భేటీలు ఏర్పాటు చేయటం ద్వారా, వారి నుంచి పెట్టుబడులు ఏ స్థాయిలో ఆశిస్తూ ఈ ఏర్పాట్లు జరిగాయో స్పష్టమవుతోంది. ఇప్పటికే యాపిల్ కంపెనీని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాబు బృందం పర్యటన తర్వాత ఈ ప్రముఖ కంపెనీల్లో సగం సంస్థల నుంచి పెట్టుబడులు, కంపెనీల స్థాపన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
సమైక్య రాష్ట్రానికి బాబు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను ఐటి ఐకాన్‌గా మార్చేందుకు శ్రమించిన ఫలితంగా, హైదరాబాద్‌కు ఐటి పరిశ్రమ తరలివచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దానిని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర కంపెనీలను ఆకర్షించే పనిలోఉంది.
బాబు సీఎం అయిన తర్వాత నవ్యాంధ్రలో, ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ఐటి కంపెనీలు రాలేదన్న విమర్శలకు తెరదింపేందుకు, 300 కంపెనీల సీఈఓలతో జరపతలపెట్టిన ఈ సమావేశాల వల్ల అనూహ్య ఫలితాలే వస్తాయన్న అంచనా వ్యక్తమవుతోంది. ఈ ప్రపంచశ్రేణి కంపెనీ సీఈఓలతో భేటీ చేయించేందుకు అధికారుల బృందం నెలరోజుల పాటు చేసిన కసరత్తు ఫలించింది.