ఆంధ్రప్రదేశ్‌

కార్మికులకూ ఆత్మాభిమానం ఉంటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: ప్రతి కార్మికుడికి ఆత్మ గౌరవం ఉంటుందని దాన్ని యాజమాన్యాలు గుర్తెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదరించి ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో నేనే ఒక కార్మికుడినని ఏదైనా సన్మానం చేయవలసి వస్తే ముందుగా తనకే సన్మానం చేయవలసి ఉంటుందని, రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి కార్మికుడి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో కలసి ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. మేడేని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఎ కనె్వన్షన్ ఫంక్షన్ హాలులో కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ శ్రామికశక్తిని నిర్లక్ష్యం చేసే కంపెనీలు మనుగడ సాగించలేవని, అలాగే యాజమాన్యాల సాధక బాధలను శ్రామికులు గుర్తెరిగి మసులుకుని ఒక కుటుంబంలాగా ఇరువురు సుహృద్భావంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వవలసిన బాధ్యత అటు యాజమాన్యాలు ఇటు ప్రభుత్వంపై ఉందని, అందుకు తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. శ్రామికులు లేకపోతే పారిశ్రామికవేత్తలు లేరని, పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీలు పెట్టకపోతే శ్రామికులు లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నారు. యాజమాన్యాలు రాష్ట్రంలో ప్రతి కార్మికుడికి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఇందుకు యాజమాన్యాలు ముందకు వచ్చి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తే ప్రభుత్వం ఇళ్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు. యాజమాన్యాలు ఇంటి స్థలాలను సమకూరిస్తే ప్రభుత్వ వ్యయంతో ఇళ్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి కార్మికుని చంద్రన్న బీమా పథకం కిందకి తీసుకువచ్చామని ప్రమాదం సంభవించిన తర్వాత కార్మికుల కుటుంబ సభ్యులు 155214 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్‌చేసి కార్మికుని ప్రమాద సమాచారాన్ని అందించవచ్చన్నారు. చంద్రన్న బీమాకి 44వేల 469 క్లెయిమ్స్ ఇప్పటివరకు వచ్చాయని, ఇందులో 34వేల 252 క్లెయిమ్స్ పరిష్కరించి 170 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించామన్నారు. 4 లక్షల సంస్థలకు సంబంధించి వార్షిక రిటర్న్‌లు ఆన్‌లైన్‌లో ఇచ్చామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాబోయే కాలంలో గ్రామ పంచాయతీలోని వీధి దీపాలను సైతం సెన్సర్‌లు ఉపయోగించి ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తామన్నారు. కార్మికులకు పనిగంటలు, సెలవు దినాలు కల్పించటం అదనపు పనిగంటలకు రెట్టింపు వేతనం, కార్మిక చట్టాలకు సవరణ తదితరమైనవి తీసుకొచ్చామన్నారు. కార్మికులకు ఎక్కడైనా నష్టం జరుగుతుంటే కొత్త చట్టాలు తీసుకువస్తామన్నారు. కష్టించి పనిచేసే కార్మికులను ప్రోత్సహించి సన్మానిస్తే మిగిలిన కార్మికులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మేడే రోజు శ్రమశక్తి అవార్డులను ప్రధానం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే 27 లక్షల మంది కూలీలను భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసి వారికి చంద్రన్న బీమా, సంక్షేమ పథకాలను వర్తింపు చేస్తున్నామని చెప్పారు. కార్మిక, శిక్షణ, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ ఆధునీకరణలో భాగంగా పారిశ్రామికవేత్తలు, శ్రామికులు అందరూ కలసి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విధంగా వెళ్లినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మేడే ఉత్సవాల్లో భాగంగా శ్రమశక్తి అవార్డులను 64 మందికి, బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులను 29 మందికి మొత్తం 93 మందికి ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనపరచినందుకు ముఖ్యమంత్రి దుశ్శాలువతో సత్కరించి మెమెంటో అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రిని కార్మికుల పక్షాన మంత్రి పితాని సత్యనారాయణ దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. మేడే కార్యక్రమంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. చంద్రన్న బీమా చెక్కు అందచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు