ఆంధ్రప్రదేశ్‌

చట్టసభల్లో బిసి రిజర్వేషన్లకు దేశవ్యాప్త ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌పై దేశవ్యాప్త ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల నుంచే నాంది పలుకుతున్నామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ రిజర్వేషన్ల విషయమై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐదారుసార్లు, తెలంగాణ శాసనసభలో ఒకసారి ఏకగ్రీవ తీర్మానం చేశారన్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికి కనీసం 50సార్లు ప్రధానమంత్రి మోదీని కలిసినా, బిసి రిజర్వేషన్ల విషయమై ప్రస్తావించకపోవటం వెనుక అగ్రవర్ణ ఆధిపత్య అహంభావం కన్పిస్తోందన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం బిసి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్, యాదవ మహాసభ రాష్ట్ర నేత వెంకట సత్యనారాయణలతో కలిసి కృష్ణయ్య విలేఖరులతో మాట్లాడుతూ అమెరికాలో నల్లజాతి ఒబామా అధ్యక్షుడు కాగలిగారన్నారు. అయితే భారతదేశంలో బిసిలుగా పుట్టడమే పాపమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా బిసిలకు మాత్రం ఆ స్వాతంత్య్ర ఫలాలు అందలేదన్నారు. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారన్నారు. అయితే ఈ దేశంలోని 2600 బిసి కులాల్లో 2550 కులాలకు చెందిన వారిలో ఏ ఒక్కరూ నేటికీ పార్లమెంట్‌లో అడుగు పెట్టలేదన్నారు. 56 శాతం పైగా జనాభా ఉన్నప్పటికీ నామమాత్రం జనాభా కల్గిన అగ్రవర్ణాలతో బిసిలు పోటీపడలేక అన్ని విధాలుగా నష్టపోతున్నారన్నారు. అసలు ఈ దేశంలో పుట్టి సంపద సృష్టించే వివిధ కుల వృత్తులవారికి మాత్రం చట్టసభల్లో స్థానం లేదా అని ప్రశ్నించారు. తమ పోరాటాల ఫలితంగానే స్థానిక సంస్థల్లో తొలుత 20 శాతం, ఆపై 32 శాతం బిసిలకు రిజర్వేషన్లు లభించినా కేవలం నాలుగైదు కులాల వారే అందలం ఎక్కుతున్నారనే విమర్శలకు దీటుగా ఎబిసిడి వర్గీకరణ కోసం ఆది నుంచి డిమాండ్ చేస్తున్నామని కృష్ణయ్య తెలిపారు. పార్లమెంటులో 36 రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పార్టీ కూడా బిసిల పక్షాన నోరు మెదపడం లేదన్నారు. బిసి ఎంపిలు కూడా నోరు మెదపకపోవటం తమ దౌర్భాగ్యమన్నారు. ఇందుకోసం పార్టీల కతీతంగా కేంద్రంపైన, రాష్ట్రాలపైన పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణాలో తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పటం వలనే తాను తెదేపా తరపున పోటీ చేశానని, ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనివల్లనే మహానాడు వంటి పార్టీ కార్యక్రమాల్లో దీనిపై చర్చలు జరుగటం లేదన్నారు. ఏది ఏమైనా బిజెపి బిసి వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానిని చేయడం, ఆపై మోదీ జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ పరంగా చట్టబద్ధత కల్పించారన్నారు. అగ్రవర్ణాల నేతలు వ్యతిరేకించినప్పటికీ మోదీ కనుక చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తే తామంతా ఆయనకు పరిపూర్ణ మద్దతు ఇస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వాలు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి గల అభ్యంతరాలేమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో 56 శాతం జనాభా గల బిసిలకు చట్టసభల్లో 12 శాతం ప్రాతినిధ్యం దాటలేదు. ఇక 16 రాష్ట్రాల నుంచి ఒక్క బిసి ఎంపి లేడు. ఇక ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ కన్పిస్తుందని ప్రశ్నించారు. బిసి ఓట్లతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టినవారు కనీసం ఒక నిమిషమైనా బిసిల గురించి మాట్లాడటం లేదన్నారు. చట్టసభల్లో బిసి రిజర్వేషన్ల కోసం అతి త్వరలో విజయవాడ, ఏలూరు, విశాఖ, అనంతపురం, కాకినాడ, తిరుపతి నగరాల్లో కనీసం ఐదు లక్షల మందితో పార్టీల కతీతంగా మహాసభలు నిర్వహించబోతున్నామని ఆపై ముఖ్యమంత్రులపై ఒత్తిడి పెంచుతామని అన్నారు.