ఆంధ్రప్రదేశ్‌

మైనారిటీ ఓట్లపై ఆశలొదుకోవాల్సిందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 11: ‘బిజెపి-టిడిపి కలసి పనిచేయడం వల్ల మైనారిటీల ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది. మతతత్వ బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపిని ఓడించండి’ ఇది 2014 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు. ‘రెండు అంశాల్లో తప్ప బిజెపికి మేం ఎప్పుడూ మద్దతిస్తూనే ఉన్నాం. రాష్టప్రతి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఆ పార్టీకి ఉంది. అలాంటప్పుడు విపక్షాలు పోటీ చేయటం వల్ల ప్రయోజనం లేదు’ ఇది తాజాగా ప్రధాని మోదీని కలిసిన అనంతరం జగన్ మీడియాతో చేసిన వ్యాఖ్య.
రాష్టప్రతి ఎన్నికలో బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం, క్రిస్టియన్ల ప్రభావం లేని ప్రాంతాల్లో నేతలు జగన్ ప్రకటన వల్ల రాజకీయ ప్రభావేమీ ఉండదని అభిప్రాయపడుతుండగా, మైనారిటీముద్ర ఉన్న తమ పార్టీపై ఇది పెను ప్రభావం చూపేదనని ఆ రెండు మతాల ప్రభావం ఉండే ప్రాంతాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కీలక నిర్ణయం ప్రకటించే ముందు, కనీసం పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకోకపోవడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ నాయకుడికి అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకునే అలవాటు లేదని, ఇప్పుడూ అదే కనిపించిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ, ఎస్టీ నియోజకవర్గాలు, ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉండే నియోజవకర్గాల్లో ఈ నిర్ణయం పార్టీకి చేటు తెస్తుందని, మైనారిటీ ఓట్లకు మంగళం పలికేవేనన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఎక్కువగా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో పార్టీకి 67 సీట్లు రావడానికి ప్రధాన కారణం క్రైస్తవులు, ముస్లింలేనన్న విషయాన్ని జగన్ మర్చిపోయినట్లున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఆ రెండు మతాలకు వైఎస్ సాయం చేయడంతోపాటు, స్వయంగా క్రైస్తవుడయినందున ఆ మతం వారు తమ పార్టీకి ఓట్లు వేశారని గుర్తు చేస్తున్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండే హిందు అనుకూల బిజెపిని సమర్థించడం వల్ల, పార్టీపై ఇప్పటివరకూ ఉన్న మైనారిటీ అనుకూల ముద్ర చెరిగిపోతుందని, ఇది స్థానికంగా తమకు నష్టం కలిగిస్తుందని ఆందోళనతో ఉన్నారు.
జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమనేది లేకుండా, ఉన్న రెండు పార్టీలూ బిజెపి అనుకూలమైనవేనన్న భావన ప్రజల్లో ఏర్పడిందని మరికొందరు నేతలు విశే్లషిస్తున్నారు. ‘రాష్ట్రంలో టిడిపితో మేం ఇక్కడ పోరాడుతున్నాం. టిడిపి కేంద్రంతో సఖ్యతగా ఉంది. అదే కేంద్రంలోని బిజెపితో ఇప్పుడు మేమూ సఖ్యతగానే ఉంటే ఇక్కడ బిజెపికి శత్రువులెవరుంటారు? రేపు ఎన్నికల్లో బిజెపి మా ఇద్దరిలో ఎవరిలో ఒకరితో వెళ్లడం ఖాయం. మా బాస్ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
అయితే జగన్ నిర్ణయం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీలేదన్న అభిప్రాయం మరికొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ మైనారిటీలు దూరమవుతున్నారనుకున్నా, వారు టిడిపి వైపు వెళ్లే అవకాశం ఉండదని వాదిస్తున్నారు. రాష్ట్రంలో రెండు పార్టీలూ బిజెపికి మద్దతునిస్తుంటే, మైనారిటీలు టిడిపి వైపు చూసే అవకాశమే ఉండదంటున్నారు. పైగా యుపి వంటి అతిపెద్ద సంఖ్యలో మైనారిటీలున్న రాష్ట్రంలోనే ముస్లింలు మోదీని బలపరిస్తే, ఇలాంటి భావన ఏ కోశానా లేని మన రాష్ట్రంలో వ్యతిరేకత ఎందుకు ఉంటుందని ఈ వర్గం నాయకులు లాజిక్కులు తీస్తున్నారు.
‘ఇక్కడ హైదరాబాద్ మాదిరిగా హిందూ-ముస్లిం గొడవల్లేవు. ఉన్నదంతా కులాల మధ్య గొడవే తప్ప మతాల మధ్య ఏమీ లేవు కదా? ముస్లింలను పక్కకుపెడితే క్రైస్తవులు ఎలాగూ జగన్‌ను చూసే ఓట్లేస్తారు. రెడ్లదీ అదే పరిస్థితి. ఇప్పుడు ఒక కులం వారి హవా చూసి రెడ్లలోనూ చైతన్యం వచ్చింది. ముస్లింలకు వైఎస్ ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్ల కృతజ్ఞత మోదీని జగన్ కలవడం వల్ల పోతుందనుకోలేం. కాబట్టి ఎటు చూసినా మోదీని జగన్ కలిసి మద్దతు ప్రకటించడం వల్ల ఎలాంటి నష్టం ఉండద’ని ఓ సీనియర్ నేత విశే్లషించారు.
పైగా ఈ పరిణామాలు నిరాశగా ఉన్న పార్టీ నేతలకు కొత్త ఉత్సాహం ఇస్తాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండటం విశేషం. ఇప్పుడు బిజెపి దృష్టిలో తాము, టిడిపి ఒకటేనని అందువల్ల ఢిల్లీ స్థాయిలో ఒక దన్ను కూడా ఉంటుందని చెబుతున్నారు. పరోక్షంగా మాకూ ఢిల్లీలో ఒక భరోసా దొరికినట్లయిందని, దీనివల్ల టిడిపి మునుపటి మాదిరిగా తమపై దూకుడుగా వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు. మోదీని జగన్ కలిసిన తర్వాత, బిజెపితో టిడిపి మరింత తగ్గి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇది ఒకరకంగా రాజకీయంగా తమకే లాభమని విశే్లషిస్తున్నారు.