ఆంధ్రప్రదేశ్‌

ఆ నాలుగు గంటలు బాబు ఎక్కడున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు రాకుండా ఆరుగంటల పాటు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? శనివారం ఎలక్ట్రానిక్ చానెళ్లలో వైసీపీ నేతలు వేసిన ప్రశ్నలు, ప్రసారం చేసిన కథనాలు నిజంగానే అందరిలోనూ అనుమానాలు రేపాయి. అయతే వాస్తవానికి చంద్రబాబు ఆ సమయంలో రెండు కంపెనీల సిఇఓలతో చర్చలు జరిపినట్టు వెల్లడయంది. నిజానికి చంద్రబాబునాయుడు బృందం శుక్రవారం మధ్యాహ్నం మూడుగంటలకే ఢిల్లీ విమానాశ్రాయానికి చేరుకుంది. రాత్రి 12 గంటల సమయంలో విజయవాడకు చేరుకుంది. ఈ మధ్యలో ఆరుగంటల పాటు బాబు మాయమయిపోయారంటూ వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియా చేసిన రచ్చ వల్ల అందరి దృష్టి బాబు అజ్ఞాతంపైనే మళ్లింది. దీనిపై ఆరా తీయగా ఆనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రానికి ఎయిర్‌బస్ ప్రాజెక్టు, కువైట్‌కు చెందిన సుప్రసిద్ధ ఆరామ్‌కో కంపెనీని తీసుకువచ్చేందుకు గత కొంతకాలం నుంచీ రాష్ట్రప్రభుత్వం వారితో చర్చలు కొనసాగిస్తోంది. ఆ మధ్యలో ఎయిర్‌బస్ కంపెనీ ప్రతినిధులు అనంతపురం వెళ్లి అక్కడి పరిస్థితులు అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఇటీవల బెంగళూరులో జరిగిన ఎయిర్‌షో విన్యాసాలకు ఆ కంపెనీ సీఈఓ వచ్చిన సందర్భంగా ఆయనతోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చించారు. ఇక ఆరామ్‌కో కంపెనీతో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ రెండు కంపెనీలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. బాబు దావోస్ పర్యటన నుంచీ ఈ రెండు కంపెనీలను రాష్డ్ర ప్రభుత్వం సంప్రదిస్తూనే ఉంది.
ఆ స్థాయిలో డిమాండ్ ఉన్న రెండు కంపెనీలనూ రాష్ట్రానికి తెచ్చేందుకు చంద్రబాబునాయుడు వ్యక్తిగత శ్రద్ధ కనబరిచిన ఫలితంగా, రెండు కంపెనీల ప్రతినిధులు శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. రాష్ట్రానికి వచ్చే సమయం లేనందున ఢిల్లీలోనే చర్చలు జరుపుదామని ఇద్దరు సీఈఓలు విడిగా చేసిన ప్రతిపాదనను బాబు అంగీకరించారు. నిజానికి బాబు ఢిల్లీ నుంచి నెల్లూరు వెళ్లి అక్కడ మంత్రి నారాయణను పరామర్శించాల్సిన కార్యక్రమం ఉంది. అయినా దానిని మరుసటిరోజుకు వాయిదావేసుకుని ఇద్దరు సీఈఓలతో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ విమానాశ్రయంలో కాకుండా దానికి సమీపంలోని ఒక హోటల్‌లో జరిగినట్లు సమాచారం.
నిజానికి సీఎం స్థాయి వ్యక్తికి ఎయిర్‌పోర్టులోనే విడిగా విడిది ఏర్పాటుచేసే వెసులుబాటు ఉంది. అయినా దానిని కాదని మరొకచోట భేటీ కావలసిన అవసరం ఏమిటన్న అనుమానం సహజంగానే తెరపైకి వస్తుంది. దానిపై ఆరా తీయగా.. బాబుతో భేటీ అవుతున్న రెండు ప్రపంచస్థాయి కంపెనీలు ఇలాంటి భేటీలకు ప్రచారానికి విముఖత చూపుతాయి. అది స్టాక్ ఎక్స్ఛేంజీలో తమ కంపెనీలపై ముందుగానే ప్రభావం చూపుతాయన్న ముందుచూపుతోనే, ఉన్నత స్థాయి వ్యక్తుల భేటీకి ప్రచారం ఇవ్వవని అధికారవర్గాలు వెల్లడించాయి. అదీకాకుండా తమ బోర్డు సమావేశంలో ఖరారు చేసేందుకు జరిగే ముందస్తు భేటీలపై అవి గోప్యత పాటిస్తాయి. ఎయిర్‌పోర్టు లాంజ్, లేదా అక్కడే భేటీ జరిగితే అది బయటకు పొక్కుతాయన్న వారి సూచనను ఆమోదించి అక్కడికి సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో చర్చలు జరిపారు.
దానితో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని ఇబ్బందిపెట్టడం భావ్యం కాదన్న కోణంలో ఆ భేటీకి ప్రచారం ఇవ్వలేదు. నిజానికి బాబు వ్యవహారశైలి తెలిసిన వారెవరైనా అంత ప్రఖ్యాత కంపెనీ సీఈఓలతో భేటీ కార్యక్రమానికి ప్రచారం ఇవ్వకుండా ఎలా ఉంటారన్నది ఎవరికైనా వచ్చే సందేహం. మామూలుగా అయితే ఈపాటికే అది మీడియాలో హడావిడి చేసి ఉండాలి. కానీ ఈ విషయంలో బాబు, అధికారులు తమ సహజ ప్రచారశైలికి విరుద్ధంగా వ్యహరించి గోప్యత పాటించినట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, వైసీపీ నేతలు చెబుతున్నట్లు వారి భేటీ ఆరు గంటలు కాకుండా నాలుగు గంటలేనని తెలుస్తోంది.
వీటిని పక్కకుబెడితే బాబు అజ్ఞాతం కథనాలే విస్మయానికి గురి చేస్తున్నాయి. బాబు జడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్న వీవీఐపి. అందునా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పైగా తీవ్రవాదుల నుంచి ముప్పుపొంచి ఉన్న నేత. సహజంగా ఆ క్యాటగిరిలో ఉన్న వీవీఐపి ఆనుపానులు, కదలికలు, ఎవరితో కలుస్తున్నారన్నది ప్రతి క్షణం రికార్డవుతుంది. దానిని ఎస్పీజీ దళాలు ఎప్పటికప్పుడు తమ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తుంటారు. సదరు వీవీఐపిని కలిసే ప్రముఖులు, వెళ్లే ప్రదేశాలను కూడా రికార్డు చేస్తుంటారు. వారి కళ్లు గప్పి అజ్ఞాతంలోకి వెళ్లడం అసాధ్యం. తీవ్రవాదుల ముప్పు ఉన్న బాబు ఆరుగంటల పాటు అజ్ఞాతంలోకి వెళితే పరిస్థితి ప్రశాంతంగా ఎలా ఉంటుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘మీడియా మిడి మిడి జ్ఞానంతో సెక్యూరిటీ అంశాన్ని కూడా జటిలం చేస్తోంది. బాబు ఒక్కరే కాదు. ఆ క్యాటగిరిలో ఉన్న వారెవరైనా అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం లేదు. మీరే రాసుకుని మమ్మల్ని వివరణ అడగటం కూడా భావ్యం కాద’ని ఆయన ఆంధ్రభూమితో వ్యాఖ్యానించారు.