ఆంధ్రప్రదేశ్‌

కాటన్ వ్యవస్థకు పాలకుల తూట్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 16: రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థకు గుండెలాంటి గోదావరి డెల్టా విభాగాల కార్యాలయాలను మూడు దశబ్దాల నాటి ఒక జిఒ ఆధారంగా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో కాటన్ హయాంలో నిర్మించిన బ్యారేజీ ఆధారంగా మూడు డెల్టాలు ఏర్పాటయ్యాయి. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టాలను పర్యవేక్షించడానికి మూడు డివిజన్ కార్యాలయాలు నెలకొల్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కాలువలకు నీటి సరఫరా వ్యవహారాలను ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తుంటాయి. పాలనా సౌలభ్యం దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన తూర్పు, మధ్య డెల్టాకు సంబంధించిన డివిజన్ కార్యాలయాలు బ్యారేజీకి చేరువలోనే ధవళేశ్వరంలో నెలకొల్పగా, పశ్చిమ గోదావరికి సంబంధించిన పశ్చిమ డెల్టా డివిజన్ కార్యాలయాన్ని ఆ జిల్లా కేంద్రం ఏలూరులో నెలకొల్పారు.
అయితే తాజాగా మధ్య డెల్టా డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎప్పుడో 1988లో జారీ అయిన జిఒ ఆధారంగా ఈ కార్యాలయ తరలింపునకు ప్రతిపాదనలు పంపించడం, వాటిని ఇఎన్‌సి ఆమోదించడం జరిగిపోయాయి. దీనిపై రైతులు, ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.కాటన్ బ్యారేజి వ్యవస్థకు రక్షణ కల్పించలేని అధికార యంత్రాంగం ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలను మాత్రం తరలించేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల శ్రేయస్సు ముసుగులో కార్యాలయాలను తరలించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాటన్ కూడా రైతుల కోసమే ఈవ్యవస్థను ఏర్పాటు చేశారనే విషయాన్ని మర్చిపోయి మరుగున పడిన జీవోలను వెలికితీసి గుట్టు చప్పుడుకాకుండా ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించడానికి సన్నాహాలు చేపట్టారు. ఈ కార్యాలయం తరలింపు వ్యవహారంలో ఆంతర్యమేమిటో అర్ధం కాక ఉద్యోగులు ఆందోళనకుదిగారు. ఇప్పటికే జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్యోగ సంఘ నాయకులు విజయవాడలో కలిసి ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలించడానికి వీల్లేదని విజ్ఞప్తిచేశారు. దీనిపై చర్చిస్తామని మంత్రి వారికి హామీయిచ్చారు. తరలింపు వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిస్తే... స్థానిక సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మరుగునపడిన 1988 నాటి 216 జీవోను వెలికితీసి, గత మార్చి నెలలో విజయవాడలోని ఇఎన్‌సి అడ్మినిస్ట్రేషన్‌కు ప్రతిపాదన పంపించారు. మార్చి 28న ధవళేశ్వరం నుంచి ఎస్‌ఇ రాంబాబు సెంట్రల్ డివిజన్‌ను అమలాపురం తరలించడానికి ప్రతిపాదన పంపిస్తే, ఏప్రిల్ 21న ఇఎన్‌సి నుంచి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ ఉత్తర్వులను గుట్టుచప్పుడు కాకుండా కనీసం డివిజన్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు కూడా తెలియకుండా అమలుచేసేందుకు చర్యలు చేపట్టారు. బ్యారేజికి సమీపంలోనే కాటన్ దొర అన్ని విభాగాల కార్యాలయాలను ఒక చోటే ఉండేవిధంగా కేంద్రీకృత కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఆనాడే ధవళేశ్వరంలో ఏర్పాటుచేశారు.
ఈ నేపధ్యంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి కార్యాలయాలన్నీ ఆయా క్షేత్ర స్థాయిలోనే వుండేలా చేసి పర్యవేక్షక ఇంజనీర్ల కార్యాలయాలను విభాగాల వారీగా ధవళేశ్వరంలోనే ఏర్పాటుచేశారు. ఈ విధంగా ధవళేశ్వరంలో సెంట్రల్ డివిజన్, ఈస్ట్రన్ డివిజన్ కార్యాలయాలు ఉంటే, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వెస్ట్రన్ డివిజన్ కార్యాలయాన్ని ఆ జిల్లా కేంద్రం ఏలూరులో ఏర్పాటుచేశారు. ఇందులో ఇపుడు సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధంగా తరలించడం వల్ల ఎటువంటి ప్రయోజనంలేదని, సొంత భవన సముదాయాలు వదిలేసి అమలాపురం మార్చడం వల్ల లక్షలకు లక్షలు అద్దె రూపేణా ప్రభుత్వానికి అదనపు భారం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ఈ కార్యాలయ కార్యకలాపాలకు అనుసంధానంగా ఉండే పి అండ్ ఎ కార్యాలయం, ఎస్టాబ్లిష్‌మెంట్, లస్కర్లు, లాక్ సూపరింటెండెంట్, కొంత మెట్ట ప్రాంతం, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ, క్షేత్ర స్థాయిలో పనిచేసే అమలాపురం సబ్ డివిజన్‌లోని డిఇ, ఎఇఇలు తదితరులంతా పనిచేసే విధంగా వుంది. అంతేకాకుండా ఈ సెంట్రల్ డివిజన్ పరిధిలోనే అమలాపురంలో ఒక సబ్ డివిజన్, గన్నవరం, రాజోలులో సబ్ డివిజన్లు పనిచేస్తున్నాయి. డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మార్చాల్సి వస్తే దాదాపు 40 మంది ఉద్యోగులను తరలించాల్సిన పని. వారంతా మళ్ళీ ప్రతీ పనికీ ధవళేశ్వరం రావాల్సిందే. ప్రభుత్వానికి అదనపు భారం తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం కన్పించడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.