రాష్ట్రీయం

ఇంకా తప్పుటడుగులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఇసుక మాఫియాకు అడ్డంగా దొరికిపోయే కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించి ఇప్పటికే ఇ వేలం విధానంలో బోర్లాపడిన రాష్ట్రప్రభుత్వం ఇంకా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఇంకా తప్పులు చేస్తూనే ఉంది. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన కొత్త ఇసుక విధానంలోనే లొసుగులు ఉన్నాయని, విధానంలో వౌలిక మార్పులుచేస్తే తప్ప ఫలితం ఉండదని ‘ఆంధ్రభూమి’ మొదటి నుండి చెబుతూనే ఉంది. ఇసుక రీచ్‌ల ఇ వేలంలో క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.500 పైన రాష్ట్రప్రభుత్వానికి చెల్లించడానికి సిద్ధపడి, ఇ వేలంలో కోట్ చేసిన, అలాగే క్యూబిక్ మీటరుకు రూ.150కన్నా తక్కువ మొత్తంలో దాఖలైన టెండర్లను రద్దుచేయాలంటూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించి, దానికి సంబంధించిన మెమోలను గనుల శాఖకు జారీచేసింది. మంత్రివర్గ సమావేశంలోనే దీనికి సంబంధించిన నిర్ణయాలను తీసుకున్నప్పటికీ, ఉత్తర్వులు జారీచేసినపుడు మాత్రం సమగ్రమైన మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయని అంతా భావించారు. కానీ అలాంటి మార్పులేమీ జరగలేదు. క్యూబిక్ మీటరుకు రూ.500కన్నా అధికంగా, రూ.150కన్నా తక్కువ ధరను కోట్ చేస్తున్న టెండర్లను రద్దుచేసేందుకు అసలు ప్రాతిపదికమేమిటో ఎవరికీ అర్ధంకావటం లేదు. రాష్ట్రప్రభుత్వం ఇలాంటి మెమో జారీచేసింది కాబట్టి క్యూబిక్ మీటరుకు రూ.499 చెల్లిస్తామని ఎవరైనా దాఖలుచేసిన టెండర్లను ఆమోదించాల్సి ఉంటుంది. వాస్తవానికి క్యూబిక్ మీటరుకు రూ.499 రాష్ట్రప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించిన వారి టెండర్లను ఆమోదిస్తే, అలా వేలం దక్కించుకున్న వ్యక్తి రూ.499తో పాటు క్యూబిక్ మీటరుకు పన్నులు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.170 నుండి నూ.200్భరించాల్సి ఉంటుంది. అంటే రూ.400 నుండి రూ.499 ధర కోట్ చేసిన వారు రూ.570 నుండి 699వరకు భరిస్తూనే ప్రజలకు క్యూబిక్ మీటరుకు రూ.500కు అమ్మాల్సి ఉంటుంది. అంటే అసలు ధర కన్నా ఎక్కువ ధరను రాష్ట్రప్రభుత్వానికి చెల్లించి వ్యాపారం చేయాలన్న మాట. ఇందులో కిటుకు ఏమిటో, ఇలాంటి వ్యాపారం వల్ల లాభం ఎలా వస్తుందో రాష్ట్రప్రభుత్వమే చెప్పాలి. అలాగే క్యూబిక్ మీటరుకు రూ.150 కన్నా తక్కువ మొత్తం రాష్ట్రప్రభుత్వానికి చెల్లించే విధంగా దాఖలైన టెండర్లను రద్దుచేయాలని మెమో జారీచేసిన రాష్ట్రప్రభుత్వం, ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందో తెలియదు. కనీస బిడ్ మొత్తాన్ని రూ.100గా నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం, రూ.100కుపైన -రూ.150కి లోపు ధరతో దాఖలైన టెండర్లను ఎలా రద్దు చేస్తారో, ఇది ఏ నిబంధన ప్రకారం చేస్తోందో కొత్త విధానంలో ఎక్కడా పేర్కొనలేదు. కావాలనుకుంటే మినిమమ్ బిడ్‌ను పెంచాలే తప్ప, ఇలా అర్ధంలేని మెమోలను జారీచేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందోనని కాచుకుని కూర్చున్న వారు ఏదో విధంగా ఇసుక వేలాన్ని ఆపి, దొంగ వ్యాపారం చేసుకునేందుకు చూస్తున్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే, సమూలంగా మార్పుచేసి, తక్కువ ధరకు, సరఫరా అ య్యేలా చూడాలన్నారు.
భూములు ఆక్రమిస్తే
చోద్యం చూస్తున్నారా
శాసనసభా కమిటీ ఆగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 18: ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకున్నారా అని అధికారుల తీరుపై రాష్ట్ర శాసనసభ హామీల కమిటీ చైర్మన్ పి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో శాసనసభ హామీల కమిటీ సమీక్ష జరిపింది. ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూములు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తుంటే, అవి పూర్తయ్యేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. నగర పరిధిలోని గాజువాక, వడ్లపూడి, తదితర ప్రాంతాల్లో ఎపిఐఐసి భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బకాయిల రికవరీలో మహావిశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వాన్సులు తీసుకొని సొమ్ము చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిటీ ఆదేశించింది. గాజువాక మున్సిపాల్టీలో వృత్తిపన్ను బకాయిలు ఏళ్లతరబడి వసూళ్లుగాక నిలిచిపోవడం పట్ల మండిపడ్డారు. సముద్ర గర్భంలో నిక్షేపాలను వెలికితీసే పనులు 2005లో బోత్రాల్, జివి మినరల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు అప్పగించినప్పటికీ నేటి వరకు పనులు ప్రారంభించనందున వాటి కాంట్రాక్ట్ రద్దు చేయాలని కమిటీ సూచించింది.

ఎస్‌టిపిఐతో
వుడా ఒప్పందం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 18: విశాఖలో సుమారు 63 కోట్ల రూపాయలతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) నెలకొల్పేందుకు వుడా(విశాఖ నగరాభివృద్ధి సంస్థ)తో ఒప్పందం కుదిరింది. నగరంలో వుడా కార్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని ఎస్‌టిపిఐకి ఇవ్వనుంది. ఇందులో ఎనిమిది అంతస్థుల భవనాన్ని ఎస్‌టిపిఐ నిర్మించనుంది. మొదటి అంతస్థును కమర్షియల్ కాంప్లెక్స్‌గా తయారు చేసి వుడాకు ఇవ్వడానికి, ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి వుడా, ఎస్‌టిపిఐల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో వుడా విసి బాబూరావు నాయుడు, ఎస్‌టిపిఐ డైరెక్టర్ సివిడి రాంప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

లేపాక్షిలో వైభవంగా ధ్వజస్తంభ స్థాపన
లేపాక్షి, ఫిబ్రవరి 18 : శిల్పకళారామంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రాలయంలో గురువారం ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. గతంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం విరిగిపోవడంతో దాదాపు నాలుగేళ్లుగా తాత్కాలిక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారం, దేవాదాయశాఖ నిధులు దాదాపు రూ.9 లక్షలతో నూతన ధ్వజస్తంభాన్ని కొనుగోలు చేశారు. తెలంగాణ ఐజి సజ్జనార్, దేవాదాయశాఖ డిఇ శ్రీనివాసప్రసాద్ నేతృత్వంలో గురువారం నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తొలుత నూతన ధ్వజస్తంభానికి సజ్జనార్ దంపతులు, బిసి కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం, శ్రీచక్రార్చన, నవగ్రహపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి, ఎంపిపి హనోక్, సర్పంచ్ జయప్ప, ఎంపిటిసిలు నాగభూషణ, చిన్నఓబన్న, తెలంగాణకు చెందిన పలువురు పోలీసు అధికారులు, మండల సర్పంచులు, ప్రజలు హాజరయ్యారు.
శ్రీకాకుళంలో 26 వేల కోట్లతో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు
ముత్తుకూరు, ఫిబ్రవరి 18: శ్రీకాకుళం జిల్లాలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఎపి జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని జెన్ కో ధర్మల్ విద్యుత్ కేంద్రం సిఎండి విజయానంద్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 26 వేల కోట్ల వ్యయం కాగలదని అంచనా వేస్తున్నామన్నారు. గురువారం ఆయన నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఈనెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు విచ్చేయుచున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై ఎపి జెన్‌కో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం పరిపాలన భవనంలో విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 150 మిలియన్ యూనిట్లు విద్యుత్ అందిస్తున్నామని, మరో 170 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నామన్నారు. ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడవ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమంత్రి శంకుస్థాపన , జెన్‌కో ప్రాజెక్టులోని కంట్రోల్ రూమ్, పంపుహౌస్, పరిపాలన భవనాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. 2016 సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ కల్పించడమే ఎపి జెన్‌కో, ట్రాన్స్‌కోల ప్రధాన ఉద్దేశం అని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు రోజుకి 17 వేల టన్నుల బొగ్గును ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఐదు లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉందని, మరో లక్ష టన్నులు కృష్ణపట్నం పోర్టులో నిల్వ ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసిబి సోదాలు
నెల్లూరు, ఫిబ్రవరి18: రాష్టవ్య్రాప్తంగా జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై బుధవారం రాత్రి ఎసిబి సోదాలు జరిగాయి. అందులో భాగంగా నెల్లూరు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్‌కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి వరకు ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కూడా రిజిస్ట్రార్ కార్యాలయం బిజీగా ఉండడంతో ఎసిబి అధికారులు విస్తుపోయారు. బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ తనిఖీలు గురువారం మధ్యాహ్నం వరకూ కొనసాగాయి. సోదాల్లో లెక్కలు తేలని సుమారు 2.15లక్షల రూపాయలను ముగ్గురు ఉద్యోగులు, 13మంది దస్తావేజు లేఖరు లనుంచి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఒక్క రోజే 85 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ల తంతు జరగ్గా వీటిలో 71 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, మరో 14 డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. విచారణానంతర నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

మంగళంపల్లికి
‘గాన విరాట్’ ప్రదానం
అనకాపల్లి, ఫిబ్రవరి 18: ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకి గాన విరాట్ బిరుదు ప్రదానం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని రావుగోపాలరావు కళాక్షేత్రంలో గురువారం రాత్రి డైమండ్ హిట్స్ సంస్థ నేతృత్వంలో సంస్థ వ్యవస్థాపకులు మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సంగీత కచేరీ ఎంతో పరవశింపజేసింది. తొలుత డాక్టర్ మంగళంపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయనకు పురస్కారం ప్రదానం చేసి, గజమాల వేసి, శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళంపల్లి భారతరత్న అవార్డు పొందేందుకు అన్నివిధాలా అర్హులన్నారు. తన ఆరోగ్యం సహకరించకపోయినా, సంగీత ప్రియులను నిరుత్సాహ పరచటం ఇష్టం లేక హాజరయ్యానన్నారు.

మాఫియాకు చెక్
పెట్టేందుకు నిర్ణయం
జిపిఎస్ ద్వారా ఇసుక తరలించే వాహనాలపై నిఘా
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 18: ఇసుక అమ్మకాలపై ఇటీవల ఈ-వేలం ద్వారా టెండర్లు పిలవగా, ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చి వివిధ పార్టీల నేతలు కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా రేట్లను కోట్‌చేయడంతో వాటిని సర్కారు రద్దుచేసింది. ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి మళ్లీ డ్వాక్రా సంఘాలకే ఇసుక ఇసుక రీచ్‌లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో డ్వాక్రా మహిళల నిర్వహణలో ఇసుక విక్రయాలు జరగ్గా, భూ బకాసురులు బరితెగించి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. దాంతో ఈ-టెండర్లద్వారా అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 12 రీచ్‌లకు టెండర్లు పిలవగా 11 రీచ్‌లకే ఈ-వేలం నిర్వహించారు. ఒక రీచ్‌ను వివిధ కారణాలతో పక్కనబెట్టారు. ఇసుక మాఫియాతో మున్ముందు లేనిపోని తలపోట్లు వచ్చే అవకాశం ఉందని గమనించిన ప్రభుత్వం టెండర్లను రద్దుచేసి, తిరిగి డ్వాక్రా సంఘాల ద్వారానే ఇసుక విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రీచ్‌ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేసి ఇసుక తరలించే వాహనాలకు జిపిఎస్ అమర్చడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. క్యూబిక్ మీటరు ఇసుక గరిష్టంగా 550రూపాయలకు మించి విక్రయించరాదని ప్రభుత్వం నిబంధన విధించగా, ఒకరీచ్‌కు ఏకంగా 702రూపాయలు కోట్‌చేయడంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సైతం విస్తుపోయారు. ఇందులో ఏదో భారీ స్కెచ్ ఉందని గమనించి ఆరుజిల్లాల్లో ఇసుక టెండర్లను రద్దుచేశారు. నిబంధనలను కఠినతరం చేసి డ్వాక్రాసంఘాల ద్వారానే ఇసుక విక్రయాలు జరపాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.