ఆంధ్రప్రదేశ్‌

తలమానికంగా అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 17: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవంతిని తలమానికంగా వుండేలా తీర్చిదిద్దడం కోసం 160 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల, హరిత అవసరాలకోసమే వదిలిపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తుది ప్రణాళికలో కొన్ని మార్పులు చేసినట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలియజేశారు. ఈ మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులను ఉత్తరదిశగా కొద్దిగా ముందుకు జరిపారు.
అమరావతి నగర నిర్మాణ పురోగతిపై బుధవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పరిపాలన నగర నిర్మాణ ఆకృతులు, ప్రణాళిక 90 శాతం పూర్తయ్యాయని సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా శాసనసభ భవనం, ప్రజా రవాణా వ్యూహం, జల వనరులపై నార్మన్ ఫోస్టర్ బృందంతో విపులంగా చర్చించామని చెప్పారు. 22న ఫోస్టర్ బృందం మలివిడత ఆకృతుల్ని అందిస్తుందన్నారు. ఫోస్టర్ బృందం సభ్యుడు క్రిస్‌బర్గ్ ఆధ్వర్యంలో ఇప్పటికే 90 శాతం ప్రణాళిక పూర్తయ్యిందని తెలిపారు.
సచివాలయ భవంతి 8 నుంచి 10 అంతస్తులతో కనీసం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంటుందని శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 26 వేల మంది ఉద్యోగులకు కార్యస్థానంగా దీని నిర్మాణం జరుగుతుందన్నారు. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందిస్తున్న ప్రజా రవాణా ప్రణాళిక రానున్న కాలపు అవసరాలకు తగినట్టుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ నగరాల్లో ఓన్ యువర్ కార్, లీజ్ యువర్ కార్, రెంట్ యువర్ కార్ అనే కానె్సప్ట్ నడుస్తోందని, అమరావతిలో డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయని చెప్పారు. హైపర్ లూప్ టెక్నాలజీ, మెట్రో రైలు వ్యవస్థ, ఎలక్ట్రికల్ కార్లు, జల రవాణా, బీఆర్‌టీఎస్ వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థ బృహత్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
నగర ముఖ్య కూడలి నుంచి సచివాలయం వరకు డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తాయని, ఇవి నిర్ణీత బస్సు స్టాపులలో ఆగుతూ సాగుతాయని అధికారులు తెలిపారు. పరిపాలన నగరంలో ఒక నోడ్ నుంచి మరొక నోడ్‌కు కాలినడకన చేరుకోవడానికి కేవలం 5 నిమిషాలే పట్టేలా వుంటుందన్నారు. బస్సు, రైలు, వాటర్ ట్యాక్సీలన్నింటికీ కలిపి ఒకే టికెట్ విధానం వుండే పద్ధతిని ప్రవేశపెడదామని ముఖ్యమంత్రి చెప్పారు.
అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించబోయే సాంస్కృతిక భవనం తరతరాల మన సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రలకు అద్దం పట్టేలా నిలవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర శాసనసభ తరువాత ఇదే నగరానికి తలమానికంగా వుండే నిర్మాణమని అన్నారు. రాజధానికి వచ్చే ప్రతి ఒక్కరూ దీన్ని చూసి స్ఫూర్తి పొందేలా వుండాలని చెప్పారు. రాజధానిలో ఫ్లైవోవర్లు లేనిదే నగరానికి ఆకర్షణ వుండదంటూ ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా వున్న తొలి వంద ఫ్లైవోవర్లను పరిశీలించి అత్యుత్తమంగా వున్న ఆకృతులను తీసుకోవాలని కోరారు.
లండన్ పర్యటనలోనే కేంబ్రిడ్జికి వెళ్లి అక్కడ కాలువల వ్యవస్థపై అధ్యయనం చేశామని సిఆర్‌డిఎ కమిషనర్ తెలియజేశారు. త్వరలో అమరావతి పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ పోర్టల్ అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన మొత్తం నిర్మాణ ప్రక్రియను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ నిర్వహణ, పర్యవేక్షణలకు వీలుగా వుంటుందని వివరించారు.
సౌర విద్యుత్ నిల్వపై అంతర్జాతీయ సదస్సు
సౌర విద్యుత్ నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా దీనిపై ప్రపంచ వ్యాప్తంగా వున్న సాంకేతిక పద్ధతుల గురించి తెలుసుకోవడానికి వీలుగా త్వరలో అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహించాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపిలో సౌరశక్తికి కొదవలేదని, సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరును సార్థకం చేసేలా రాష్ట్రాన్ని సౌర విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా మార్చుతామని చెప్పారు. సౌర, పవన విద్యుత్ నిల్వకు సంబంధించి నూతనంగా ఆవిష్కరించిన సాంకేతిక పద్ధతులపై సమాలోచనకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు సిఎం చెప్పారు. ఇంధన నిల్వల్లో అగ్రగామి సంస్థలుగా వున్న వారంతా ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. ఎపిని మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవడానికి ఇదే సాధనం అవుతుందని అన్నారు.
సౌర, పవన విద్యుత్ నిల్వ విధానంలో మరింత సమగ్రమైన అధ్యయనానికి సహకరించేలా ఎక్ట్రికల్ ఇంజనీరింగ్ నిపుణుడు ఫ్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్ వాలాను వెంటనే సంప్రదించాలని ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. భారత్‌లో 50 శాతం విద్యుత్‌ను సౌరశక్తి ద్వారా సమకూర్చుకునే ఒక నూతన ఆవిష్కారాన్ని చేసిన అశోక్ ఝన్‌ఝన్ వాలా 2030 నాటికి దేశమంతటా సౌర విద్యుత్‌పై ఆధారపడేలా చేయాలన్న ఆశయంతో పనిచేస్తున్నారన్నారు. ఇలావుంటే, అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి అవసరమైన అన్ని సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ను ఆదేశించారు. దేశంలో ఇదే తొలి ఇంధన విశ్వవిద్యాలయం అవుతుందని, విద్యుత్ రంగంలో నిరంతర పరిశోధనలు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.

చిత్రం... రాజధాని నిర్మాణ ప్రణాళికపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు