ఆంధ్రప్రదేశ్‌

పర్సెంటేజీల కోసమే పనుల్లో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాంట్రాక్టర్లపై ఉన్న వ్యామోహం రైతులపై లేదని, పర్సెంటేజీల కోసమే వంశధార స్టేజ్-2 పనులు విలువ మరో రూ. 400 కోట్లుకు పెంచారని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. శుక్రవారం రాత్రి హిరమండలంలో వంశధార నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాక ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు రైతులపై ప్రేమ లేదన్నారు. దివంగత సిఎం వైఎస్ ఈ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేసారని, కేవలం 10 శాతం పనులకు రూ. 54 కోట్లు అవసరమైనప్పటికీ, వీటిని రూ. 400 కోట్లకు పెంచి కాంట్రాక్టర్ల నుంచి 30 శాతం పర్సంటేజీలు తీసుకునేందుకే ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు పనులను కూడా రాజ్యసభ సభ్యుడైన సిఎం రమేష్ బినామీకి అప్పగించారని విమర్శించారు. వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు రూ. 400 కోట్లు అవసరమా అంటూ తాము ప్రశ్నిస్తే? స్టీల్, సిమెంట్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయంటూ ఉత్తర్వులు జారీ చేసి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌లు తీసుకుంటున్నారన్నారు. ప్రాజెక్టు ప్రారంభంలో ఎకరాకు రూ. 1.26 లక్షల పరిహారం చెల్లించారని, పదేళ్లయినా ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నిర్వాసితులంతా అవస్థలు పడుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చేసరికి రూ. 97,000 కోట్లు అప్పువుండగా, ఈ మూడేళ్ళలో రూ. 2.16 లక్షల కోట్ల రుణాన్ని పెంచి రూ. 1.18 లక్షల కోట్లు అప్పులు చేసారన్నారు. రాష్ట్ర బడ్జెట్ 1.50 లక్షల కోట్లు ఉంటే, రూ. 1.18 లక్షల కోట్లు అప్పుచేసిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి రూ. 1000 కోట్లు ఇచ్చి వంశధార ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయదని ప్రశ్నించారు. పోలవరం, పట్టిసీమ, కొవ్వాడ అణుపార్కు నిర్వాసితులకు ఇచ్చే భూసేకరణ పరిహారాన్ని వంశధార నిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్ చేసారు. వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, ఎస్.కళావతి తదితరులు పాల్గొన్నారు.

హిరమండలం నుంచి అమరావతికి ప్రశ్నల వర్షం..
వంశధార నిర్వాసిత గ్రామమైన పాడలికి చెందిన రైతు రవి జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు కావాలని అప్పట్లో ఎకరాకు లక్ష రూపాయలు ఇచ్చారని, నూజివీడులో పట్టిసీమ ప్రాజెక్టుకు ఎకరాకు రూ. 53 లక్షలు ఇదే ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పాడు. రాష్ట్రంలో భిన్నవిధానాలు ఎందుకంటూ ముఖ్యమంత్రిని వంశధార నిర్వాసితుడు రవి ప్రశ్నించాడు. రణస్థలం మండలంలో కొవ్వాడ ప్రాంతంలో ఎకరాకు రూ. 18 లక్షలు ఇస్తున్నారని, అక్కడ రైతులకు, వంశధార రైతులకు తేడా చెప్పాలంటూ సిఎంను నిలదీసాడు. 2004 నుంచి 2017 వరకూ పరిహారం విడతల పద్ధతిలోనే ఇవ్వడంతో ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితులని వివరించాడు. 2013 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేమంటూ అధికారులు, మంత్రులు చెప్పి యూత్ ప్యాకేజీ ఇస్తున్నారన్నాడు.గ్రామసభలన్నీ పోలీస్ పహారాలో జరుగుతున్నాయని, వంశధార ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు అంతా నక్సలైట్లమా, తీవ్రవాదులమా, ఉగ్రవాదులమా..కేవలం రైతులమే కదా అంటూ ముఖ్యమంత్రిని వాస్తవ పరిస్థితులు ప్రతిపక్షనేత సమక్షంలో వివరించారు. తులగాం గ్రామానికి చెందిన జి.శ్రీనివాసరావు 2004లో జలయజ్ఞంలో వంశధార ప్రాజెక్టు వచ్చిందని, పునరావాసం కల్పించిన తర్వాత పనులు ప్రారంభించాలన్నది చట్టంలో ఉందని స్పష్టం చేసాడు. ఈ ప్రభుత్వం మాయమాటలతో పనులు ప్రారంభించి, కాంట్రాక్టులకు నిధులు పెంచి, నిర్వాసితులకు ఎందుకు పెంచరని వేదిక ద్వారా ప్రశ్నించాడు. పోలవరం, పట్టిసీమ, కొవ్వాడ ప్రాజెక్టులకు ఇస్తున్న ప్యాకేజీ వంశధార నిర్వాసితులకు ఎందుకు ఇవ్వరంటూనే, తుపాకీ నీడన, తూటాలతో భయపెట్టి ఏమీ చేయలేరని, ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించడం గమనార్హం.

చిత్రం... హిరమండలంలో వంశధార నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడుతున్న జగన్