ఆంధ్రప్రదేశ్‌

కౌలు కిరికిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజమాని అంగీకార పత్రానికి అధికారుల పట్టు ససేమిరా అంటున్న భూ యజమానులు
ఇప్పటికే అన్ని రుణాలూ తీసుకున్న యజమానులు పంచాయతీలకు అప్పగిస్తేనే సమస్య పరిష్కారం
రైతు సహకరించకుంటే సర్కారుకు అపజయమే

అమరావతి, మే 22: ‘ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుంది. కౌలురైతుకు కల్టివేషన్ సర్ట్ఫికెట్ ఇవ్వడంతోపాటు, ఒక ఏడాదికి ఆ ఒక్క పంటకు మాత్రమే బీమా, రుణం, ఇన్‌పుట్ సబ్సిడీ మినహా మరెలాంటి హక్కులు కౌలురైతుకు ఉండవు. అందువల్ల భూ యజమానులు భయపడాల్సిన పనిలేదు. దీనిపై మేం రైతుల్లో చైతన్యం తీసుకువస్తాం’ ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది. కానీ, ఇది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. భూ యజమానులు, బ్యాంకర్లు, రెవిన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తే తప్ప, సర్కారు అమలు చేయదలుచుకున్న కొత్తచట్టం విజయవంతం కాదని రైతు సంఘాలు, భూ యజమానులు, కౌలు రైతుల మాటల్లో స్పష్టమవుతోంది. కౌలు రైతును ఆదుకోవాలన్న చిత్తశుద్ధి సర్కారుకు ఉంటే, దానికి కొత్త చట్టం అవసరం లేదని, 2011లో తెచ్చిన చట్టాన్ని అమలుచేస్తే సరిపోతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో భూమి సాగుచేస్తున్న వారిలో 60 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. వీరంతా ఏడాదికి ఇంత అని భూ యజమానులకు పంట ఇస్తూ, మిగిలినది తాము తీసుకుంటున్నారు. అందుకయ్యే వ్యవసాయ ఖర్చులన్నీ వారే భరిస్తారు. దీనికి సంబంధించి భూ యజమాని-కౌలు రైతు ఒప్పంద పత్రాలు రాసుకునే సంస్కృతి లేదు. కేవలం నోటిమాట, నమ్మకం మీదనే కౌలు సంస్కృతి కొనసాగుతోంది. కౌలు రైతును ఆదుకునేందుకు 2011లోనే ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చింది. సాగుచేస్తున్న వారికే పంట రుణాలు, సబ్సిడీలు ఇవ్వాలన్నది ఆ చట్టంలోని సారాంశం. కానీ, అది అమలుకావడం లేదు. ముఖ్యంగా కౌలు రైతుకు బ్యాంకర్లు నేరుగా రుణాలిచ్చేందుకు ముందుకురాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 25లక్షల మంది కౌలు రైతులుంటే, లక్ష మందికి మాత్రమే రుణాలిచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. 60వేల కోట్ల రుణ ప్రణాళికలో అంతమందికి రుణాలివ్వాలంటే కేవలం కౌలు రైతుల కోసమే 20వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది. ఈ నిధులు విడుదల చేస్తే తప్ప కౌలుసాయంపై సర్కారు చేస్తున్న ప్రకటనలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
అటు భూ యజమానుల నుంచి కూడా సహాయ నిరాకరణ ఎదురవుతోంది. అంగీకార పత్రాలిస్తే భూమి కౌలురైతు హక్క్భుక్తం అవుతుందన్న భయాందోళనే దానికి కారణం. రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీపై కౌలు రైతులు.. భూ యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని చాలాచోట్ల బ్యాంకర్లు షరతు విధిస్తుండటంతో, కౌలు రైతుకు రుణం అందని పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని చట్టం చెబుతున్నా, బ్యాంకర్లు అదే ధోరణి కొనసాగిస్తున్నారు.
ఇప్పటి వరకూ కౌలు రైతులకు పూర్తి స్థాయిలో గుర్తింపు కార్డులే ఇవ్వలేదు. ప్రతి ఏడాది కార్డులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ 6 లక్షల 717మందికి మాత్రమే కార్డులిచ్చి, వారిలో 95వేల మందికే 218.88కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ ఏడాది కూడా 8లక్షల మంది కౌలు రైతులను గుర్తించి, రుణాలతో పాటు కార్డులివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్న నిబంధనలు అమలు చేస్తే అసలు కొత్త చట్టాలే అవసరం లేదని రైతు సంఘం నేతలు వాదిస్తున్నారు. అర్హులైన కౌలురైతును గ్రామ సభల్లోనే గుర్తించి వారికి ఏడాదికి అర్హత సంపాదించే గుర్తింపు కార్డులివ్వడం, గ్రామసభల గురించి ముందస్తు దండోరా వేయటం వంటి నిబంధనలేమీ పాటించకపోవడం వల్లే, కౌలు రైతుకోసం రూపొందించిన పాత చట్టాలు అమలుకావడం లేదు.
‘కౌలుదారు 11 సంవత్సరాల నుంచి సాగుచేస్తుంటే అతనికి యాజమాన్య హక్కు వస్తుంది. అందుకే భూ యజమాని కౌలు రైతుకు ధ్రువీకరణ పత్రాలేవీ ఇవ్వడం లేదు. పాసు పుస్తకాలు తీసుకురావాలని, యజమాని అంగీకార పత్రాలు తీసుకురావాలని కింది స్థాయి అధికారులు చెబుతున్నారు. నిజానికి చట్టంలో అవేమీ లేవు. ఈ అంశంలో యజమానులకు అవగాహన కల్పించడటంలో రెవిన్యూ శాఖ విఫలమైంది. యజమాని-కౌలు రైతుకు లాభం ఉండే చట్టపరమైన రక్షణ కల్పిస్తే ఎలాంటి సమస్యలు ఉండవ’ని ఏపి రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివిపి ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 16లక్షల 25 వేల మంది రైతులున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటకీ నిజానికి 76 లక్షల మంది ఉన్నారు. ఒక ఎకరం నుంచి హెక్టారు వరకూ ఉన్న రైతులే 49 లక్షల మంది ఉన్నారు. వారిలో ఎక్కువమంది కౌలురైతులే ఉంటారు. గ్రామ సభలతోపాటు, కేరళ-పశ్చిమబెంగాల్ మాదిరిగా పంచాయతీలకే అధికారం ఇస్తే కౌలురైతుకు న్యాయం జరుగుతుందని సూచించారు.
తాజాగా సర్కారు తీసుకువస్తానంటున్న చట్టం లక్ష్యం మంచిదే అయినప్పటికీ, భూ యజమానుల సహకారం లేకపోతే విజయం సాధించటం కష్టంగానే కనిపిస్తోంది. యజమానులకు బ్యాంకర్లు రుణాలు రెన్యువల్ చేయడం నిలిపివేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. భూమి హక్కుల్ని చట్టబద్ధంగా యజమానికే ఇచ్చి, పంట రుణం మాత్రం కౌలుదారుకే ఇచ్చేలా చట్టం చేస్తే ఇరువురికీ లాభం ఉంటుంది. అప్పుడే యజమానుల్లో అభద్రత, అనుమానాలు తొలగి కౌలురైతుకు సహకరించే అవకాశం ఉంది.

మార్తి సుబ్రహ్మణ్యం