ఆంధ్రప్రదేశ్‌

తెదేపాలో కుమ్ములాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొట్టిపాటిపై కరణం వర్గం దాడి మంత్రుల సమక్షంలోనే విభేదాల కిందపడిన ఎమ్మెల్యే రవికుమార్
ఘటనపై ముఖ్యమంత్రికి నివేదిక జిల్లా అధ్యక్షుని ఎంపిక వాయిదా

ఒంగోలు, మే 23: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం విభేదాలు మంగళవారం మరోసారి భగ్గుమన్నాయి. ముగ్గురు మంత్రుల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలంలోని వేమవరం సంఘటన మరవకముందే జిల్లా కేంద్రమైన ఒంగోలులో గొట్టిపాటి, కరణం వర్గీయులు బాహాబాహికి దిగడం రాష్టవ్య్రాప్తంగా సంచలనమైంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడిలో కిందపడిపోయిన గొట్టిపాటి చొక్కా చిరిగిపోయింది. జిల్లా కేంద్రమైన ఒంగోలు ఏ వన్ ఫంక్షన్ హాలులో తెదేపా సంస్ధాగత ఎన్నికల ప్రక్రియ మంగళవారం జరిగింది. పార్టీ పరిశీలకులుగా మంత్రి పరిటాల సునీత వ్యవహరించగా మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావుతోపాటు మాజీ మంత్రి పుష్పరాజ్, రాష్ట్ర పార్టీ నాయకుడు చందు సాంబశివరావు హాజరయ్యారు. ముందుగా వేదిక వద్దకు ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్ వర్గీయులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వేదిక వద్దకు వచ్చే సమయంలో ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. వేమవరం హత్యకు గొట్టిపాటే కారణమంటూ బలరాం, ఆయన అనుచరులు దాడి చేయటంతో గొట్టిపాటి కిందపడిపోయారు. ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం తలెత్తింది. అరుపులు, కేకలతో సభావేదిక మార్మోగింది. జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసి, గొట్టిపాటిని సమావేశం హాల్లోకి పంపించేశారు. గొట్టిపాటి రవికుమార్ వేదికపై ఉంటే మళ్ళీ దాడులు జరగొచ్చన్న ఉద్దేశంతో మంత్రి పరిటాల సునీత, జిల్లా అధ్యక్షుడు దామచర్ల, ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్వయంగా ఆయన్ని బయటకు పంపేశారు. ఆ సమయంలోనూ గొట్టిపాటిపై దాడికి కరణం వర్గీయులు ప్రయత్నించటంతో మంత్రి సునీత జోక్యం చేసుకున్నారు. పోలీసులను అలెర్ట్ చేసి శాంతిభద్రతలు పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సమావేశం జరుగుతుండగా గొట్టిపాటి లోపలకు వచ్చే సమయంలో ఆయన అనుచరులు తక్కువగా ఉండటంతోనే బలరాం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో గొట్టిపాటి వర్గీయులూ ఎక్కువ ఉండివుంటే మరింత రణరంగమయ్యేది. కాగా గొట్టిపాటిపై దాడిని సిఎం చంద్రబాబు తీవ్రంగా తీసుకున్నట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం విజయవాడలో ముఖ్యమంత్రి బాబును స్వయంగా కలిసిన గొట్టిపాటి పరిస్థితిని నివేదించినట్టు సమాచారం.
ఇదిలావుంటే జిల్లా తెదేపా అధ్యక్షుని ఎంపికను మంత్రులు వాయిదా వేస్తూ, నిర్ణయాన్ని రాష్ట్ర పార్టీకే వదిలేశారు. ఈ విషయంపై మాత్రం ముగ్గురు మంత్రులు ఏంమాట్లాడకుండా వౌనం వహించటం గమనార్హం. జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ సమగ్ర నివేదికను సిఎంకు నివేదిస్తామని, సమస్యను ఆయనే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ గొట్టిపాటి గన్‌మెన్ రాజశేఖర్ దురుసు ప్రవర్తన కారణంగానే సంఘటన తలెత్తిందని తెలిపారు. తమ వర్గీయులపైకి గొట్టిపాటి తన గన్‌మన్‌ను ప్రోత్సహించి దుర్భాషలాడారన్నారు. ఇదిలావుంటే, బుధవారం జరగాల్సిన మినీ మహానాడు గురువారానికి వాయిదా పడింది. మొత్తంమీద గొట్టిపాటిపై కరణం వర్గీయులు మూకుమ్మడి దాడికి పాల్పడి చేయి చేసుకోవటం రాష్టవ్య్రాప్తంగా సంచలనమైంది.
సంఘటనపై సిఎం ఆరా
గొట్టిపాటిపై దాడి ఘటనకు సంబంధించి సిఎం చంద్రబాబు జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఆరా తీశారు. ఫోన్‌లోనే వివరాలు తెలుసుకున్న బాబు, తక్షణం నివేదిక పంపాలని ఆదేశించారు.
ఇదిలావుంటే, రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవను నియంత్రించే సమయంలో తాలుకా సిఐ వెంకటేశ్వర్లు కంభం జెడ్పీటీసీ జాకీర్‌పై దురుసుగా ప్రవర్తించటంతో వివాదం తలెత్తింది. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో, పోలీసులు క్షమాపణ చెప్పాలంటూ సమావేశం హాలులో కార్యకర్తలు బైఠాయించారు. కార్యకర్తలకు దామచర్ల సర్దిచెప్పటంతో వివాదం సద్దుమణిగింది.
chitram...
తోపులాటలో కింద పడిపోతున్న గొట్టిపాటి