ఆంధ్రప్రదేశ్‌

పొత్తులపై తొందరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: ‘పొత్తులపై తొందరపడం. వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం’ అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు అన్నారు. బుధవారం తెలంగాణ టిడిపి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మహానాడుకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలు బొబ్బిలిపులిలా, కొండవీటి సింహంలా పని చేస్తున్నారని ప్రశంసలతో ఉర్రూతలూగించారు. కార్యకర్తలే తనకు, పార్టీకి బలమన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన వద్దని, ఎన్నికల ముందు ఆ సంగతి ఆలోచిద్దామని, అప్పటి వరకు సమష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పొత్తుల విషయంలో ఆలోచించండని పార్టీ నేతలకూ సూచిస్తూనే, తొందరపడి మాట్లాడడం భావ్యం కాదన్నారు. భగవంతుడు ఇచ్చే శక్తిమేరకు పార్టీని ముందుకు నడిపిస్తానని, ఎన్నికల సమయం వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి అప్పుడు ఆలోచిద్దామన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, సైన్యం వంటి కార్యకర్తలుంటే ఎవరూ తమను విస్మరించరని దిశానిర్దేశం చేశారు. టిడిపికి బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. అనేకమంది నాయకులు, కార్యకర్తలను తయారు చేశానని, నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ పార్టీ అని చెబుతూ, 1986లో గండిపేట తెలుగు విజయంలో జరిగిన శిక్షణ తరగతులను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఏపీ సిఎంగా తనకు బాధ్యత ఉన్నా, తెలంగాణకూ సమయం కేటాయిస్తానని, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎక్కడా ఎప్పుడూ ఎవరికీ లేని పరిస్థితులు తమకు ఉన్నాయన్నారు. కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నామని, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రెండు ప్రాంతాలకూ న్యాయం జరగాలని అన్నామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని వివరించారు.
మెట్రో నేనే తెచ్చాను..
మెట్రో రైల్ ప్రాజెక్టును తానే తెచ్చానని, అది నేటికీ పూర్తికాకపోవడం బాధ కలుగుతోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ, సైబరాబాద్, అవుటర్ రింగ్ రోడ్డు వంటివి ఎనె్నన్నో తాను చేస్తే, ఇప్పుడు కొంతమంది వారు చేసినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. నాడు ఎన్టీఆర్‌కు, తనకు కార్యకర్తలు, ప్రజలు ఆదరించారని, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్‌ను గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని నగరంలోని ఎన్టీఆర్ ఘాట్‌లో పార్టీ తరఫున ప్రతిష్టిద్దామని అన్నారు. భావితరాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే తన జీవితాశయం అని చంద్రబాబు చెప్పుకున్నారు. నిరాశ, నిస్పృహ లేదని, భయం అంతకాన్నా లేదని, అన్నింటికీ ఆనందంగా కష్టపడుతున్నానని చెప్పారు. ఎక్కడ ప్రజలకు కష్టాలుంటే అక్కడకు పార్టీ కార్యకర్తలు ఆదుకునేందుకు వెళ్తారన్నారు. కార్యకర్తలతో 36 ఏళ్ళ అనుబంధం ఉందని, పోరాటాల్లో, కష్టసుఖాల్లో వారివెంటే ఉన్నానన్నారు. బాబ్లీ కోసం చేసిన పోరాటాన్ని, అక్కడ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టిడిపి తెలంగాణలో, హైదరాబాద్‌లోనే ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా కొండంత ధైర్యంతో పోరాటం చేస్తూ, ఏ త్యాగానికైనా సిద్ధపడుతూ పార్టీ జెండాను మోస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ జెండా రెపరెపలాడేలా పోరాడుతున్నారని చంద్రబాబు అన్నారు.
ఎవరు చెప్పినా వినను: మోత్కుపల్లి
పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రసంగిస్తూ మహానాడు సభకు కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో ఎవరినీ చూసీ రాలేదని, కేవలం చంద్రబాబున చూసి వచ్చారని అన్నారు. తాను చంద్రబాబు చెబితే వింటాను తప్ప ఎవరు చెప్పినా విననని తెలిపారు. రాబోయే కాలంలో నాయకుడు ఎవరో చెప్పాలని అన్నారు. తన లాంటి సీనియర్ నాయకులం బాధ పడుతున్నామని, మార్పు కోసం తపిస్తున్నానని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చంద్రబాబును కోరారు.
ఉదయం మహానాడులో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ప్రారంభోపన్యాసం చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా పాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. పార్టీ మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా ప్రసంగించారు.
ఆర్. కృష్ణయ్య డుమ్మా
ఇలాఉండగా పార్టీ ఎమ్మెల్యే, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మహానాడుకు డుమ్మా కొట్టారు. ఎంపి దేవేందర్ గౌడ్ అమెరికాలో చికిత్స పొందుతున్నందున హాజరుకాలేదు.

చిత్రం... తెలంగాణ మహానాడు వేదికపై పార్టీ రాష్ట్ర నేతలతో చర్చిస్తున్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు