ఆంధ్రప్రదేశ్‌

గోదావరికి సీలేరు బైపాస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 27: బలిమెల రిజర్వాయర్ నుంచి సీలేరు జలాలను బైపాస్‌గా తీసుకునే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ప్రతిగా ఒడిశాకు విద్యుత్ ఇచ్చే ఒప్పందాన్ని చేసుకోనున్నారు. అంటే, గోదావరి బేసిన్‌కు సీలేరు జలాలను ఏడాది పొడవునా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వేసవిలో సైతం గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని సాకుగా చూపించి, ఏడాది పొడవునా సీలేరు జలాలతోపాటు గోదావరి జలాలనూ పట్టిసీమ ద్వారా కృష్ణాకు తరలించేందుకు యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జీవనది గోదావరి నదిలో డిసెంబర్ నుంచి మే వరకు నీటి లభ్యత పూర్తిగా అడుగంటిపోతుంటుంది. ఒక్కోసారి మాత్రం మండు వేసవిలో సైతం సహజ నీటి లభ్యత పుష్కలంగా ఉంటోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వేసవి కాలంలో సైతం సీలేరు జలాలను తీసుకుంటే పట్టిసీమ నుంచి పుష్కలంగా జలాలను వినియోగించుకోవచ్చనే ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించిన నీటిని సీలేరు నుంచి గోదావరి బేసిన్‌లోకి వదిలివేస్తారు. ఈ వాటాగా రబీ కాలంలో 36 టిఎంసి సీలేరు జలాలను గోదావరి బేసిన్‌లో వినియోగించుకుని రబీని గట్టెక్కడం జరుగుతోంది. మిగిలిన కాలంలో కూడా సీలేరు నుంచి నీటిని తీసుకుని అందుకు ప్రతిగా ఒడిషాకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీలేరు నుంచి బైపాస్ జలాలను వినియోగించుకుంటామని ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో సిఎం నోటి వెంట వచ్చిన నేపథ్యంలో సీలేరు జలాలను విద్యుత్ వినియోగం లేకుండా గోదావరి నదికి బైపాస్ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సీలేరు జల విద్యుత్కేంద్రంలో విద్యుత్ వినియోగం తర్వాత ఆ జలాలను గోదావరి బేసిన్‌లో విడిచిపెట్టడం జరుగుతోంది. ఈమేరకు బలిమెల రిజర్వాయర్‌లో ఇటు ఆంధ్రప్రదేశ్‌కు, అటు ఒడిషాకు నీటి వాటాలు ఉన్నాయి. ఒడిషా వాటా జలాలను కూడా గోదావరి బేసిన్‌లోకి వినియోగించుకుని అందుకు ప్రతిగా ఒడిషాకు విద్యుత్ ఇచ్చేలా ఏడాది నుంచి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
మరోవైపు గోదావరి నదీ జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తోడాలంటే ధవళేశ్వరం బ్యారేజి వద్ద 13.64 మీటర్ల నుంచి 14.2 మీటర్ల వరకు నీటిమట్టం ఉండాలి. రబీ కాలంలో కూడా బ్యారేజి వద్ద ఈ మట్టానికి గోదావరి జలాలు చేరాలంటే సీలేరు జలాలను విద్యుత్ వినియోగానికి కాకుండా గోదావరి నదికి బైపాస్ చేసుకుంటే వరదల సమయంలోనే కాకుండా రబీ సీజన్‌లో కూడా గోదావరి నుంచి పట్టిసీమకు నీటిని తోడవచ్చు. రబీలో కూడా కృష్ణాడెల్టాకు ఢోకా లేకుండా చేయొచ్చని ఆలోచన చేస్తున్నారు.
గోదావరిలో సహజ నీటి లభ్యతతో పాటు సీలేరు జలాలు కూడా కీలకం. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్న వంటి పెద్ద నదులు, నాగావళి, వంశధార, చంపావతి, శారద, వరాహ, తాండవ, ఏలేరు, ఎర్రకాలువ, తమ్మిలేరు, రామిలేరు వంటి 37 మధ్య, చిన్న తరహా నదులు అపార జల సిరులను అందిస్తున్నాయి. ఈ నదుల ద్వారా 75 శాతం విశ్వసనీయతతో 1916 టిఎంసిల జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక్క గోదావరి నదిలోనే మనకు 1480 టిఎంసిల వాటా వుంది. గోదావరి నదికి మహా వరదలు వచ్చినపుడు బ్యారేజి నుంచి సెకనుకు 50లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంలో కలుస్తాయి. అదే రబీ సీజన్‌లో అయితే చుక్క చుక్కకు లెక్క కట్టి వినియోగించుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. సీలేరు జలాలు లేకుండా గోదావరి బేసిన్‌లో రబీ గట్టెక్కలేని పరిస్థితి వుంది. ఈ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి ఆయకట్టు స్థిరీకరణ జరగాలంటే ఈ సమస్యలకు పరిష్కారం ఒక్క పోలవరమే.