ఆంధ్రప్రదేశ్‌

భూసేకరణ జటిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 29: తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం భూసేకరణ వ్యవహారం రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరకు తమ భూములిచ్చేది లేదని రైతులు స్పష్టం చేయడంతో బలవంతంగా భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధంచేశారు. దీంతో అక్కడ నిర్వహించ తలపెట్టిన పనులను రైతులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పథకానికి సంబంధించిన భూసేకరణ అంశాన్ని రాజమహేంద్రవరం సబ్- కలెక్టర్‌కు అప్పగించారు. ఇటీవల వారంపాటు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద అవార్డు ఎంక్వైరీ సభలు నిర్వహించారు. 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. భూములు ఇవ్వని రైతులకు సంబంధించిన నష్టపరిహారాన్ని కోర్టులో జమ చేసి భూములను స్వాధీనం చేసుకుంటామని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ స్పష్టం చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో నాగంపల్లి, పురుషోత్తపట్నం, చిన కొండేపూడి, వంగలపూడి రైతులు అధికార్లు ప్రకటిస్తున్న పరిహారానికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో పురుషోత్తపట్నం గ్రామంలో 72 ఎకరాలకు సంబంధించి 87మంది రైతులు కోర్టులో కేసువేశారు. అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తాము అనేక ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయామని, ఇపుడు ఈ ప్రాజెక్టులో కూడా భూములు కోల్పోతే కూలీలుగా మారతామని, పరిహారం పెంచాలని న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుంటామని అధికారులు ప్రకటించడంతో అధికారులు, రైతుల మధ్య సయోధ్య బెడిసికొట్టింది. భూసేకరణ విషయం పట్టింపులకు తావిచ్చేదిగా మారింది. ఈమేరకు గ్రామాలవారీగా బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుని పరిహారాన్ని కోర్టులో జమ చేసేందుకు దాదాపు రంగం సిద్ధయ్యింది.
కాగా నాగంపల్లి గ్రామంలోని పంట భూముల్లో పైపులైను వేసేందుకు శనివారం రాత్రి పనులు చేపట్టగా రైతులు అడ్డుకున్నారు. ఆదివారం మళ్లీ రైతులకు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రైతులు వినకపోగా, తమ ప్రాణాలు తీసుకుని భూములు లాక్కోండంటూ తీవ్ర స్వరంతో పనులను అడ్డుకున్నారు.
సోమవారం పురుషోత్తపట్నం గ్రామంలో శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన భూమిలో మాత్రం పోలీసు బలగాల సాయంతో పైపులైను పనులు చేపట్టారు. శ్రీనివాసరావు దంపతులు పురుగుల మందు తాగేస్తామంటూ పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసుల బలగాలతో వారిని వారించి, పనులు కొనసాగించారు. ఐదుగురు డిఎస్పీలు, 10మంది సిఐలు, 20మంది ఎస్సైల ఆధ్వర్యంలో భారీగా బలగాలను మోహరించారు. నాగంపల్లి గ్రామంలో సైతం భూములు స్వాధీనం చేసుకుంటారని భావించిన అక్కడి రైతులు పెద్ద సంఖ్యలో తమ భూముల్లో బైఠాయించారు. అయితే సోమవారం బలగాలు అక్కడకు రాలేదు. ఏదేమైనా మంగళవారం నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, కౌలు రైతుల స్థితి గతులపై కూడా సర్వే చేయాలని, భూములపై ఆధారపడిన కూలీలపై కూడా సర్వేచేసి సమగ్ర రీతిలో పరిహారాన్ని అందించాలని రైతులు డిమాండ్‌చేస్తున్నారు. మొత్తం మీద గ్రామాల్లో సామాజిక ప్రభావ అంచనా సర్వే నిర్వహిస్తే పరిష్కారమయ్యే వ్యవహారాన్ని అధికారులు అడ్డదిడ్డంగా వ్యవహరించి, సమస్యాత్మకంగా మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు.

చిత్రం... పురుషోత్తపట్నంలో రైతు సమ్మతి లేకుండానే అతని భూమిలో పనులు నిర్వహిస్తున్న దృశ్యం