ఆంధ్రప్రదేశ్‌

దెబ్బతిన్న ‘దేశం’ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 10: ఇన్నాళ్లు దేశం అధినేత అపురూపంగా చెప్పుకుంటున్న కంచుకోటకు బీటలు వారుతున్నట్లే కనిపిస్తోంది. మొత్తంగా పార్టీ ప్రతిష్ఠ మసకబారి చివరకు పార్టీలోనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే వరకు పరిస్థితి వచ్చేసింది. మరికొందరు నేతలు వారసులతో వివాదాల్లో చిక్కుకుంటే, మరికొందరు ఇసుక, మట్టి వివాదాల్లో మచ్చ వేయించుకున్నారు. ఈవిధంగా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిని చివరకు ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగేందుకు కారణమవుతోందనే చెప్పాలి. నెలకొసారి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి ఇంతకాలంలో ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవటం కూడా ఒక సమస్యగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షించేందుకు ప్రతినెల ఒక సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు రావటం తెల్సిందే. అంతకుముందు, ఆతర్వాత బయటపడుతున్న వివాదాలు, వ్యవహారాలపై ఆయన ఏనాడూ దృష్టి పెట్టిన పరిస్దితి కనిపించలేదు. ఇక తాజాగా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయనను మట్టుపెట్టేందుకు కుట్ర చేశారంటూ అధికారపార్టీకే చెందిన మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడిని శనివారం అరెస్టు చేయటం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. కొద్దిరోజులుగా ఈ వ్యవహారం ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారిపోయింది. కొద్దిరోజుల క్రితం ఏలూరు రూరల్ పోలీసులు ఒక రౌడీషీటర్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని వారితరహాలో విచారించగా ఈ కుట్ర వ్యవహారం బయటపడిందని ఏలూరు డిఎస్పీ జి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక ఆతర్వాత నుంచి ఈవ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేసి ఈ కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న ఏలూరు రూరల్ వెంకటాపురం మాజీ సర్పంచ్, దేశం నేత రెడ్డి అప్పలనాయుడిని అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఎనిమిదిమందిని కూడా ఈ కేసులో అరెస్టు చూపించారు. అయితే ఇది అంతా అద్భుతకల్పన అని, తనకు కుట్రతో ఎటువంటి సంబంధం లేదని, దెందులూరు ఎమ్మెల్యే తనను ఇరికించారని కోర్టు నుంచి బయటకు వచ్చాక వాస్తవాలు వివరిస్తానని స్వయంగా రెడ్డి అప్పలనాయుడు విలేఖరులతో పేర్కొనడం విశేషం. మరోవైపు దెందులూరు నియోజకవర్గం స్దానిక ప్రజాప్రతినిధులు, నేతలంతా ఏలూరులో ఆందోళన నిర్వహించి రెడ్డి అప్పలనాయుడిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే వారు ఏలూరు ఎమ్మెల్యేను పరోక్షంగా ఉద్దేశించి పలు వ్యాఖ్యలు కూడా చేయటం నేతల మధ్య పెరుగుతున్న అంతరానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. చివరకు శనివారం సాయంత్రానికి పార్టీ సభ్యత్వం నుంచి, పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడ్ని సస్పెండ్ చేస్తూ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ పరిణామాలన్నీ ఇంతకాలం అరమరికలు లేకుండా ఉంటున్నారనుకున్న ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల నేతల మధ్య దూరాన్ని భారీగా పెంచిందనే చెప్పాలి. క్రమంగా ఈ వ్యవహారాలు మచ్చపడ్డ నేతకు పరిమితం కాకుండా ఎమ్మెల్యేస్థాయి నేతలపై కూడా అనుమానాలను తీసుకువచ్చే స్థాయికి వెళ్లిపోయాయి. మరోవైపు రెడ్డి అప్పలనాయుడు వర్గం కూడా కొద్దిరోజులుగా ఏలూరులో పెద్దఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించి తమ నేతపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వారు కూడా ఏలూరు ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఏదీఏమైనా మొత్తంమీద ఈవ్యవహారం అంతా అధికారపార్టీలోనే అటు సంచలనాన్ని, ఇటు విబేధాలను రేకెత్తించే రీతిలో సాగిపోతోంది.
ఇక దెందులూరు ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని ఒక మాజీసర్పంచ్ కుట్ర పన్నాల్సిన అవసరం ఏముందని పరిశీలించినా బలమైన కారణం కనిపించకపోవటం మరో విశేషం. ఏలూరు మండలంలో కొంతభాగం దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉండటం, మిగిలిన భాగం ఏలూరు నియోజకవర్గంలోనూ ఉంది. దీంతో ఏలూరు ఎంపిపి పదవి విషయంలో మూడేళ్ల క్రితమే ఒక ఒప్పందం జరిగిందని అధికారపార్టీ నేతలే పేర్కొన్నారు. దానిప్రకారం మండల పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉన్నందున మొదటి రెండున్నరేళ్లు రెడ్డి అప్పలనాయుడు సతీమణి రెడ్డి అనురాధకు, మిగిలిన రెండున్నరేళ్లు దెందులూరు నియోజకవర్గం పరిధిలోని మోరు హైమావతికి అవకాశం కల్పించాలని అప్పట్లో నిర్ణయించారని నేతలు పేర్కొన్నారు. అ విధంగానే కొద్దికాలం క్రితం రెడ్డి అనురాధను తప్పించి హైమావతికి పట్టం కట్టారు. ఈ సమయంలోనే అప్పలనాయుడు ప్రభుత్వ విప్ చింతమనేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటం, ఏకంగా అవినీతి ఆరోపణలు కూడా చేయటంతో ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత సర్దుమణిగిందని భావించినా ఆకారణంగానే రెడ్డి అప్పలనాయుడు ఇప్పుడు హత్యకు కుట్ర పన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదీఏమైనా ఈ వ్యవహారాలన్నీ కంచుకోటగా చెప్పుకుంటున్న పశ్చిమలో పార్టీ పరువు, ప్రతిష్ఠను భారీగానే దెబ్బతీశాయని చెప్పుకోవాలి.