ఆంధ్రప్రదేశ్‌

మలుపు తిరిగిన నంద్యాల రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 14: నంద్యాల అసెంబ్లీకి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎగ్జిట్‌పోల్ లాంటివేనని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సార్వత్రికి ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అటు టిడిపి, ఇటు వైకాపాకు ప్రతిష్టాత్మకంగా మారనుందని చెప్పాలి. టిడిపి నాయకుడు మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైకాపాలో చేరడంతో నంద్యాల రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. శిల్పా పార్టీని వీడినంత మాత్రాన తమకు ఎలాంటి నష్టం లేదని టిడిపి నేతలు ప్రకటిస్తున్నా వాస్తవాలను పరికిస్తే ఉప ఎన్నికల్లో విజయం టిడిపికి అంత సులువు కాదని అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఇమడలేక, అటు భూమా వర్గంతో కలసి పనిచేయలేక, అసెంబ్లీ ఉప ఎన్నిక టికెట్‌పై అధిష్టానం నాన్చివేత ధోరణితో విసిగిపోయిన శిల్పా మోహన్‌రెడ్డి బుధవారం జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. 28 మంది కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసీలతో పాటు భారీ సంఖ్యలో అనుచరగణాన్ని వెంటబెట్టుకుని జగన్ ముందు బలప్రదర్శన నిర్వహించారు. శిల్పా నిర్ణయంతో నంద్యాల రాజకీయం కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకు ఎలక్షన్ ఏకపక్షమే అంటున్న అధికార పార్టీకి ఇప్పుడు శక్తులన్నీ ఒడ్డి పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది.
తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన శిల్పా టిడిపి పతనం నంద్యాల ఉప ఎన్నిక నుంచే ప్రారంభం అవుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరించినా ఆ ఫలితం 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అటు వామపక్షాలతోపాటు ఇటు కాంగ్రెస్, వైకాపా నిరసిస్తున్నాయి. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత త్వరలో జరిగే ఉప ఎన్నికలో ప్రస్పుటంగా కనిపిస్తుందని వారంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉప ఎన్నిక బరిలో ప్రత్యర్థులెవరన్న దానిపై చర్చ జోరందుకుంది. వైకాపా టికెట్ శిల్పాకు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
టిడిపి నుంచి ఎవరు పోటీచేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాకున్నా భూమా కుటుంబం నుంచి ఎవరో ఒకరు బరిలో ఉంటారని తెలుస్తోంది. ఉప ఎన్నికలో అధికారపార్టీ సర్వశక్తులు కూడగట్టుకుని విజయం సాధిస్తే 2019 ఎన్నికలకు పార్టీ సమరోత్సాహంతో ముందుకు ఉరుకుతుంది. ఒకవేళ వైకాపా గెలిస్తే తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివేనని చెప్పాలి. స్థానిక అంశాలను బేరీజు వేసుకుని ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపితో కలసి పోటీ చేస్తే వైకాపా ఆత్మ విశ్వాసంతో బరిలో దిగుతుందని మేథావులు అంటున్నారు. ముఖ్యంగా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపోటములు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లిం మైనార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. సుమారు 70 వేల ఓటు బ్యాంకు ఉన్న ముస్లిం మైనార్టీలు విజేతను నిర్ణయిస్తుంటారు. వీరి తరువాత రెండవ స్థానంలో ఉన్న సామాజిక వర్గమైన బలిజ, కాపులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీపై పూర్తి వ్యతిరేకతలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, బిసి, మైనార్టీల ప్రభావం ఈ ఎన్నికపై ఖచ్చితంగా ఉంటుందని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోవడం వల్లే శిల్పా మోహన్‌రెడ్డి ఓటమిపాలయ్యారన్నది అక్షర సత్యం. ముస్లింలు ఉప ఎన్నికలో సైతం టిడిపికి మొండిచేయి చూపితే వైకాపా అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇదే జరిగితే టిడిపి చేజేతులా నంద్యాల స్థానాన్ని కోల్పోయినట్టవుతుంది. అదే జరిగితే వైకాపా నూతనోత్సాహంతో 2019 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరిస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.