ఆంధ్రప్రదేశ్‌

మార్కెట్ యార్డుల్లో ఈ-నామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 16: రాష్ట్రంలోని మార్కెట్ యార్డులన్నింటిలో ఈ- నామ్ మార్కెటింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 22 యార్డులలో ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం అమలులో ఉందని వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఈ-నామ్ పరిధిలోకి తీసుకు వస్తామన్నారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మార్కెట్‌యార్డుల విస్తరణ, రైతుబజార్ల పనితీరు తదితర అంశాలపై శుక్రవారం గుంటూరులోని మార్కెటింగ్‌శాఖ ప్రధాన కార్యాలయంలో 13 జిల్లాల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డులలో నెలాఖరులోగా డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఈ మార్కెట్ ప్రక్రియ ద్వారా 60 నుంచి 70 శాతం లావాదేవీలు జరుగుతున్నాయని, నూరుశాతం ఈ విధానంతో మార్కెటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న 19 రైతుబజార్లను మూడు నెలలలోపు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కొత్తగా 36 రైతుబజార్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫాం టు హోం కింద రాష్ట్రంలో 12మొబైల్ రైతుబజార్లు పనిచేస్తున్నాయని, వచ్చే నాలుగు నెలల్లో మరో 25 అదనంగా అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.
మిర్చి మార్కెట్ల విస్తరణ
ఈ ఏడాది గుంటూరు మిర్చి మార్కెట్‌లో 50 లక్షల క్వింటాళ్లకు పైగా లావాదేవీలు జరిగాయని, దీనివల్ల నిల్వలు పేరుకుపోయి భద్రత కరవైందని మిర్చి మార్కెట్ల విస్తరణతో రైతులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. గుంటూరు మార్కెట్‌పై ఒత్తిడి తగ్గించేందుకు కొత్తగా 11 మిర్చి మార్కెట్లకు రూపకల్పన చేయాలని మంత్రి ఆదినారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త మార్కెట్లలో జూలై 15 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాదిలోగా క్రయ, విక్రయాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా మార్కెట్ యార్డులలో సిసి కెమెరాల ఏర్పాటు, సదుపాయాల కల్పనపై మంత్రి చర్చించారు. ప్రస్తుతం 6 మార్కెట్లలో 20.71 లక్షల వ్యయంతో వసతుల కల్పన జరుగుతోందని రెండు నెలలోపు వీటిని పూర్తిచేయాలన్నారు. మార్కెట్ భవనాలను అద్దెకు ఇచ్చే విషయమై సమావేశంలో చర్చించారు. వివిధ జిల్లాల జెడిలు, ఎడిలు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
మార్కెటింగ్ కమిషనర్ బదిలీ
రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జునరావు బదిలీ అయ్యారు. గత ఏడాది క్రితం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను అటవీశాఖ ఎండిగా బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

చిత్రం.. మార్కెటింగ్ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి