ఆంధ్రప్రదేశ్‌

పాండురంగారావు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని స్థాయిలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ ఇంనీరింగ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి) డాక్టర్ పాము పాండురంగారావును ఏసిబి అధికారులు శనివారం అరెస్టు చేశారు. కాగా ఆయనను ప్రభుత్వ సర్వీసు నుంచి తొలిగించాలని ఏసిబి ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది. ఈమేరకు ఏసిబి డిజి ఆర్‌పి ఠాకూర్ నివేదిక పంపారు. పాండురంగారావు అక్రమాస్తులపై అధికారులు రెండోరోజూ కూడా సోదాలు కొనసాగించారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలోనూ.. హైదరాబాద్‌లోని ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించి అక్రమార్జనకు సంబంధించి మరింత సమాచారం సేకరించారు. దీంతోపాటు మరిన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పాండురంగారావును అరెస్టు చేసిన అధికారులు శనివారం విజయవాడలోని ఏసిబి కోర్టులో హాజరుపర్చగా జ్యుడిషియల్ రిమాండుకు తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇంత భారీ స్థాయిలో అవినీతి పాల్పడిన వైనం వెనుక రాజకీయ అండదండలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఈ దిశగా సమాచారం రాబట్టేందుకు ఏసిబి అధికారులు అతన్ని తిరిగి తమ కస్టడీకి తీసుకోవాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగా రెండురోజుల్లో కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేకపోలేదు. గుంటూరు తాడేపల్లిలోని ఇంటితోపాటు హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మొత్తం 14 చోట్ల ఏసిబి సోదాలు జరిపి బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో సుమారు 800 కోట్ల రూపాయలు అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. దాడుల్లో గుర్తించిన 60 ఆస్తుల్లో 42 నివేశన స్ధలాలతోపాటు 18 వాణిజ్య భవనాలే. విశాఖపట్నంలోని హెల్త్ సిటిలో స్నేహితుడు, కింగ్‌జార్జి ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌తో కలిసి వంద కోట్లు అశ్వనీ హాస్పటల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట నిర్మాణాలను చేపట్టడం గమనార్హం. శనివారం మరోసారి పాండురంగారావుతోపాటు కుటుంబ సభ్యులను విచారించగా తగిన విధంగా సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు లాకర్ల వివరాలు కూడా పూర్తి స్థాయిలో చెప్పకుండా మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజా విచారణలో భార్య రాజ్యలక్ష్మీ పేరుతో నాలుగు డొల్ల కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నంలో 2008 నుంచి సుధర్మ ఇన్‌ఫోటెక్ లిమిటెడ్, 2010లో హైదరాబాద్‌లో రాజ్యలక్ష్మీ హైటెక్ వర్క్స్, 2012లో హైదరాబాద్‌లో హెచ్‌ఎం టెక్నోక్రాట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, 2013లో మెస్సర్స్ లక్ష్మీ హనోరా డెవలపర్స్ పేర్లతో కంపెనీలు స్థాపించినట్లు నిర్ధారించుకున్నారు. అయితే ఈవేమీ కార్యకలాపాలు నిర్వహించకపోగా, అక్రమార్జనను కంపెనీలకు మళ్లించి లాభాలుగా చూపేందుకు స్థాపించినట్లు ఏసిబి గుర్తించింది. దీంతో ఈదిశగా ఆరా తీస్తున్నారు. దీనిలో భాగంగా సమాచారం కోసం కస్టడీ పిటిషన్ వేసే పనిలో ఉన్నారు.

చిత్రం.. పాము పాండురంగారావును అరెస్టు చేసి తీసుకెళుతున్న ఏసిబి అధికారులు