ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో ‘కరెంట్’ కల్లోలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: ముఖ్యమంత్రి ఆదేశాలు శిలాక్షరాలు. ఆయన ఎప్పుడు చెప్పినా, ఏ సందర్భంలో చెప్పినా అవి శిలాశాసనాల కిందే లెక్క. కానీ రాష్ట్రంలో సీనియర్ అధికారులు జనం సమక్షంలో సీఎం ఇచ్చిన హామీని వెక్కిరిస్తూ, అందుకు భిన్నంగా చేస్తున్న ప్రకటనలు అటు సీఎం, ఇటు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన అధికార పార్టీ వర్గాల్లో మొదలయింది. విద్యుత్ చార్జీల తగ్గింపు- ప్రతి ఏటా పెంపు అంశంపై సీఎం-ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి చేసిన విభిన్న ప్రకటనలతో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల చేతికి చిక్కిన వైనం సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఈనెల 8న అనంతపురంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకపై విద్యుత్ చార్జీల పెంపు ఉండదని, వచ్చే ఏడాది నుంచి చార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు. బాబు చేసిన ప్రకటన సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి ఊరట కలిగించింది. వచ్చే ఏడాది నుంచి అమలుచేస్తామని ప్రకటించినందున, అది ఆపై ఏడాదిలో జరిగే ఎన్నికల్లో పార్టీకి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని అటు పార్టీ వర్గాలు కూడా ఆనందడపడ్డాయి. ఎందుకంటే 2004 ఎన్నికల్లో పెంచిన విద్యుత్ చార్జీలే బాబు ప్రభుత్వం కొంపముంచాయి. అదే అంశంపై బషీర్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలో పోలీసు కాల్పులు, లాఠీచార్జీలు బాబు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలుచేశాయి. దానినే ప్రధానాశంగా తీసుకున్న నాటి కాంగ్రెస్ నేత దివంగత వైఎస్ తమను గెలిపిస్తే, ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు, ఉచితవిద్యుత్‌ను తొలగించకపోవడం రైతాంగానికి ఊరట కలిగించింది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లకు విద్యుత్ చార్జీలను ఇప్పటికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మూడుసార్లు శ్లాబ్ రేట్లు పెంచడం అసంతృప్తి కలిగించింది. వచ్చే ఏడాది నుంచి విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో ఆ వ్యతిరేకత తగ్గి, సానుకూలత పెరుగుతుందని పార్టీ సీనియర్లు అంచనా వేశారు. కానీ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచీ ప్రతి ఏటా 5 శాతం విద్యుత్ చార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ ఉదయ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరినందువల్ల, ఆ నిబంధనల మేరకు ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు పెంచకతప్పదని ఆయన చేసిన వ్యాఖ్య తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లో పడేసింది. ఆ మేరకు పత్రికల్లో వచ్చిన అజయ్ జైన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయటం కూడా టిడిపిని ఇరుకున పెట్టినట్టయింది. ‘గతంలో పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం కూడా అధికారులే. మళ్లీ వాళ్లే ఆ పుణ్యం కట్టుకునేలా ఉన్నారు. సీఎం గారు ఇచ్చిన హామీకి భిన్నంగా అజయ్‌జైన్ మాట్లాడారంటే మా సార్ ఆఫీసర్లకు ఏ స్థాయిలో స్వేచ్ఛ ఇస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పుడిక ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా చేసుకుని మాపై సంధిస్తాయి. అసలే కష్టాలు, సమస్యల్లో ఉన్న మా ప్రభుత్వాన్ని అధికారులు ఇంకా సమస్యల్లో నెట్టేస్తున్నారు. 8 ఏళ్లు ఆ శాఖలో ఉన్న అధికారికి మీడియాకు ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదో తెలియదా’ అని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. దీనిపై ఇంధన శాఖ అధికారి చంద్రశేఖరరెడ్డి వివరణ కోరగా, ఉదయ్ పథకంలో చేరినందున ఆ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా వాటిని పాటించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఏ సందర్భంలో అలా వ్యాఖ్యానించారో తనకు తెలియదని వివరణ ఇచ్చారు.