ఆంధ్రప్రదేశ్‌

ఆ భవనం ఏపీఎన్జీవోలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: హైదరాబాద్‌లోని ఏపి ఎన్‌జివో అసోసియేషన్ భవనం బైలా ప్రకారం ఏపి ఎన్‌జివో అసోసియేషన్ సొంత ఆస్తి అని ఎపి ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపి ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఒక్కొక్క రూపాయి చందాల రూపంలో సేకరించుకుని కొనుగోలు చేసిన ఆస్తిపై చట్టరీత్యా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గాని, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఎటువంటి హక్కు లేదన్నారు. భవనంలో కొంత భాగాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. శనివారం విజయవాడ గాంధీనగర్‌లోని ఏపి ఎన్‌జివో హోంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఏపి ఎన్‌జివో హోం భవనంలో కొంత భాగాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘానికి కేటాయించాలని, దీనిపై చర్చించేందుకు శనివారం ఉదయం హాజరుకావాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు చందాల రూపంలో రూపాయి రూపాయిని సేకరించుకుని స్థలాన్ని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించుకున్నారన్నారు. దీనికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేదన్నారు. ఇది కేవలం ప్రైవేట్ ఆస్తి మాత్రమేనని, ప్రభుత్వ ఆస్తి కాదని తెలంగాణా అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఓడి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే అసోసియేషన్‌లో సభ్యత్వం కల్పించారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న స్వామిగౌడ్ కూడా ఒకప్పుడు ఏపి ఎన్‌జివో అసోసియేషన్ ఇసి మెంబరుగా పనిచేశారన్నారు. 1957లో రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్‌జివో అసోసియేషన్‌లు వారి వారి పంథాలో కార్యకలాపాలను కొనసాగించాయన్నారు. తెలంగాణ ఎన్‌జివో అసోసియేషన్ 10 జిల్లాలకు ఏపి ఎన్‌జివో అసోసియేషన్ 13 జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాయన్నారు. కేవలం హైదరాబాద్ నగరంలోని తెలంగాణ, ఏపి ఎన్‌జివో అసోసియేషన్ ఉమ్మడి కార్యకలాపాల్లో పాలు పంచుకున్నాయన్నారు. కేవలం 80 నుంచి 100 మంది కూడా లేని స్థానిక ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. సామరస్యంగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి మెలుగుదాం అనే తెలంగాణ ఉద్యోగులు ఇలాంటి వివాదాలకు పాల్పడడం సరికాదన్నారు. సరైన సమయం ఇవ్వకుండా చర్చలకు రావాలని కలెక్టర్ నోటీసులు పంపడం సబబు కాదన్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ వాదనలను వినిపిస్తామన్నారు. భవన వివాదాన్ని గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేసి ఏపి ఎన్‌జివో హోం భవనాన్ని కాపాడుకుంటామని అశోక్‌బాబు తెలిపారు. ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు విడతల డిఏను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఏపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎన్.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 30, 31 తేదీల్లో తిరుపతిలో ఐదువేల మంది ఉద్యోగులతో కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని చెప్పారు.